2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
హనుమంత వాహనంపై వేంకటాద్రిరామునిగా శ్రీ మలయప్పస్వామివారు
తిరుమల, అక్టోబరు 02 (ప్రజా అమరావతి): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధనుస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
`
హనుమంత వాహనం – భగవత్ భక్తి ప్రాప్తి
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణరథంపై శ్రీమలయప్పస్వామివారు కటాక్షిస్తారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
వాహనసేవలలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు.లలిత్, ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, టీటీడీ ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు శ్రీ పోకల ఆశోక్ కుమార్, శ్రీ నందకుమార్, ఢిల్లీ స్థానికి సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జెఈవోలు శ్రీమతి సదాభార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహకిషోర్, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటి ఈవో శ్రీ రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment