బడి మానొద్దు.. చదువుకు దూరం కావొద్దు



*బడి మానొద్దు.. చదువుకు దూరం కావొద్దు*



పార్వతీపురం, అక్టోబర్ 4 (ప్రజా అమరావతి): బడి మానొద్దు .. చదువుకు దూరం కావొద్దు అని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. చదువుతోనే అన్ని సాధ్యమని, కుటుంబాల స్థితిగతులు మెరుగుపడుటకు చదువు ముఖ్యమని ఉద్బోధించారు. కురుపాం మండలం కిచ్చాడ, కురుపాం లలో మంగళ వారం జిల్లా కలెక్టర్ పర్యటించారు. బడి మానివేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడారు. కుటుంబాలు బాగుపడాలని, పేదరికం నుండి బయటకు రావాలని ఆయన కోరారు. చదువుతో సామాజిక మార్పు వస్తుందని ఆయన తెలిపారు. పేదరికం ఇతర కారణాల పేరుతో చిన్నారులను విద్యకు దూరం చేయవద్దని సూచించారు. ప్రభుత్వం అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేస్తూ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుందని ఆయన వివరించారు. జగనన్న విద్యా కానుక క్రింద నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అందిస్తుందని, మధ్యాహ్న భోజనం ఇస్తుందని ఆయన అన్నారు. తలిదండ్రులు అందరికీ చదువు విలువ తెలిసిందే అని విజ్ఞతతో ఆలోచించాలని సూచించారు. పేదరికంలో పుట్టిన అబ్దుల్ కలామ్ తో సహా ఎంతో మంది ఉన్నత శిఖరాలు అధిరోహించిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. మీ చిన్నారిలో విజ్ఞానం, నైపుణ్యం ఉందని దానిని అణగదొక్కవద్దని, ఉత్తమ పౌరుడుగా మారుటకు సహకరించాలని కోరారు. 


గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాల కంటే ముందు వరుసలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. వారం రోజుల్లో మరింత ప్రగతి కోసం కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తూ భవనాలు నిర్మిస్తుందని ఆయన చెప్పారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.జి.కృష్ణాజి, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments