ఇచ్చిన మాటపై నిలబడే చేతల ప్రభుత్వం మాది
• తరతరాలు తలచుకొనేలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం
• వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సీఎం చేతుల మీదుగా విగ్రహావిష్కరణ
• మంత్రి మేరుగు నాగార్జన.
అమరావతి, అక్టోబర్ 26 (ప్రజా అమరావతి): తమది మాట చెప్పి పారిపోయే ప్రభుత్వం కాదని, ఇచ్చిన మాటపై నిలబడే చేతల ప్రభుత్వమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేసారు. కొంత మందికి ఎన్నికల సమయంలో మాత్రమే బాబా సాహెబ్ అంబేద్కర్ గుర్తుకు వస్తారని, అయితే తాము మాత్రం అంబేద్కర్ ను అందరూ తరతరాలపాటు తలచుకొనేలా 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాబోయే అంబేద్కర్ జయంతి నాటికి విగ్రహావిష్కరణ జరిగేలా అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు.
బుధవారం బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించారు. హరియాణలో జరుగుతున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులతో పాటుగా విజయవాడ పీడబ్ల్యుడీ మైదానంలో జరుగుతున్న ఇతర నిర్మాణపనుల ప్రగతిని మంత్రి నాగార్జున అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత సమయానికే విగ్రహావిష్కరణ జరగాలని అధికారులకు స్పష్టం చేసారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, ఇది వరకు ఉన్న ప్రభుత్వాలు అంబేద్కర్ అగౌరవపర్చే విధంగా ప్రవర్తించాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే బాబా సాహెబ్ అంబేద్కర్ ను తలుచుకొని ఆ తర్వాత ఆయనను మర్చిపోయే కొందరు విగ్రహ ఏర్పాటుపై కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఎక్కడో ముళ్ల చెట్లు, పొదల మధ్య అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టబోయామని వారు చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే అంబేద్కర్ ను తన గుండెల్లో పెట్టుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ముళ్లపొదల మధ్యన కాకుండా విజయవాడ నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తున్నారని గుర్తు చేసారు. రూ.100 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ పనుల అంచనా మొత్తం ప్రస్తుతం రూ.285 కోట్లకు చేరిందని చెప్పారు. అయితే ఖర్చు ఎంతైనా వెనకాడకుండా 125 అడుగుల విగ్రహాన్ని రాబోయే అంబేద్కర్ జయంతి నాటికి ఆవిష్కరించాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి ఉన్నారని పునరుద్ఘాటించారు. ప్రజలు అందరూ తరతరాల పాటు అంబేద్కర్ ను తలుచుకొనే విధంగా దేశంలో మరెక్కడా లేని విధంగా జరుగుతున్న ఈ విగ్రహ ఏర్పాటు ఒక చరిత్ర అని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి ఆశిస్తున్న విధంగానే విగ్రహ నిర్మాణ పనులు ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా త్వరితగతిన కొనసాగుతున్నాయని నాగార్జున తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.జయలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కే. హర్షవర్ధన్, వీఎంసి కమీషనర్ స్వప్నాల్ దినకర్, ఏపీఐఐసి ఇఎన్సీ శ్రీనివాస్ ప్రసాద్, కేపీసీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment