వచ్చే జనవరి మొదటి వారంలో చీఫ్ సెక్రటరీల సమావేశం:కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ

 వచ్చే జనవరి మొదటి వారంలో చీఫ్ సెక్రటరీల సమావేశం:కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ

అమరావతి,27 అక్టోబరు (ప్రజా అమరావతి):వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశాన్నినిర్వహించనున్నట్టు కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ(Rajiv Gauba) పేర్కొన్నారు.ఈమేరకు గురువారం ఆయన ఢిల్లీ నుండి త్వరలో నిర్వహించనున్న చీఫ్ సెక్రటరీల సమావేశానికి సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు,కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ


మాట్లాడుతూ వచ్చే జనవరి 5వ తేదీ నుండి 7వ తేదీ వరకూ మూడు రోజుల పాటు ద్వితీయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశాన్నినిర్వహించేందుకు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు.ఈసమావేశానికి సంబందించి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు,కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్ల నుండి ఆయన సలహాలు,సూచనలు స్వీకరించారు.జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం వల్ల వివిధ రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలతో పాటు పలు వినూత్నపధకాలు,కార్యక్రమాలను పరస్పరం తెల్సుకునేందుకు వివిధ ఉత్తమ ప్రాక్టీసులు(Best Practices)తెల్సుకుని వారి రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఈసమావేశం ఎంతో దోహదం చేస్తుందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ పేర్కొన్నారు.రానున్న చీఫ్ సెక్రటరీల సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను నీతి ఆయోగ్ నేతృత్వంలోని ఆర్గనైజింగ్ కమిటీ చూస్తుందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ చెప్పారు.

ఈవీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రత్యేక వినూత్న కార్యక్రమాలను డాక్యుమెంట్ రూపంలో రానున్న చీఫ్ సెక్రటరీల సమావేశంలో ప్రజెంటేషన్ కు అవకాశం కల్పించాలని సూచించారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రతకు సంబంధించి “దిశ” పేరిట ప్రత్యేక యాప్ ను రూపొందించడం జరిగిందని దానిని రానున్న సిఎస్ ల సమావేశంలో షోకేస్ చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.ఇంకా ఈవీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ కుమార్,అజయ్ జైన్,ముఖ్య కార్యదర్శులు యం.టి.కృష్ణబాబు,యం. రవిచంద్ర,అనిల్ కుమార్ సింఘాల్,ఇతర అధికారులు పాల్గొన్నారు.

   

Comments