ఎగుమతులలో ఏపీకి ఎదురులేదు

అమరావతి (ప్రజా అమరావతి);


*ఎగుమతులలో ఏపీకి ఎదురులేదు*



*ఎగుమతులను పెంచేలా పారిశ్రామికాభివృద్ధి : పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన*


*'మిషన్ అమృత్ సరోవర్'పూర్తే లక్ష్యం :పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్*


*చేనేత, జౌళి  ఉత్పత్తులు, హస్తకళలు, లేపాక్షి బొమ్మల బ్రాండింగ్ లో జర్మనీ, నార్వేతో భాగస్వామ్యం : చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత*


*ఆంధ్రప్రదేశ్ ని ఫ్రూట్స్, ఫిష్ ఆంధ్రప్రదేశ్ గా పిలవవచ్చు : మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి*


*ఆంధ్రప్రదేశ్ జిల్లాల విభజన.. అభివృద్ధి దిశగా మలుపు : ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్*


స్థానిక ఉత్పత్తులకు  జి.ఐ ట్యాగింగ్ చేస్తే అంతర్జాతీయ మార్కెట్ ఉంటుందని, ఎగుమతులలో ఏపీకి ఎదురుండదని  భారత జర్మనీ రాయబారి పర్వతనేని హరీష్ వెల్లడించారు. ఉద్యానవన పంటలకు అంతర్జాతీయ జీఏపీ(గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టెసీస్) సర్టిఫికేషన్ పై దృష్టి పెడితే రెట్టింపు ఎగుమతులు సాధ్యమన్నారు.  ఉత్పత్తిలో నాణ్యత, పరిమాణం, ప్యాకింగ్ లపై దృష్టి పెట్టడం వలన మరింత రాణించగలదన్నారు. మత్స్య ఆధారిత ఉత్పత్తులకు విలువ జోడింపు వల్ల రెట్టింపు ఆదాయం వీలవుతుందని ఆ దిశగా ఏపీ త్వరలోనే ముందడుగు వేయాలని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో ఆయా ఉత్పత్తుల వ్యర్థాల ద్వారా బయో మీథేన్ తద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అపార అవకాశాలున్నట్లు రాయబారి హరీష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జర్మనీకి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు ఎక్కువ అవకాశాలున్నట్లు ఆయన చెప్పారు. మత్స్య, వ్యవసాయ రంగాలలో ఏపీ ఉత్పత్తిని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. అంతకుముందు ఏపీఐఐసీ మంగళగిరి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలతో ఎగుమతులపై చర్చించారు.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో పెట్టుబడులకు అనుకూలమని పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన వెల్లడించారు. ఇప్పటిదాకా ఏపీలో 1,006 లార్జ్ , మెగా పరిశ్రమలు స్థాపించడం వల్ల రూ.2,35,152 కోట్ల పెట్టుబడులు, 4, 66, 738 మందికి ఉపాధి అవకాశాలు అందాయని ఆమె పేర్కొన్నారు. భారతదేశం నుండి సరుకుల ఎగుమతులలో 4వ స్థానంలో ఏపీ ఉందన్నారు. గతేడాది గణాంకాలలో ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  లో అగ్రస్థానంలో ఏపీ ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లీడ్స్-2022  ర్యాంకుల్లో తీర ప్రాంత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇటీవల కాలంలో  ఆంధ్రప్రదేశ్ సాధించిన పురోగతిని తెలిపే అంశాలపై ప్రత్యేక ప్రజంటేషన్ ఇచ్చారు. గత మూడేళ్ల కాలంలో 106 యూనిట్లు ప్రారంభించడం ద్వారా రూ.44,802 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయన్నారు. 68, 418 మందికి ఉద్యోగాలు అందించనున్నట్లు తెలిపారు. 23 శాఖల సమన్వయంతో 90 రకాల ఆన్ లైన్ సేవలను పారిశ్రామికవేత్తలకు అందిస్తూ సింగిల్ డెస్క్ పోర్టల్ లో దేశంలోనే ఏపీకి పోటీలేరన్నారు. విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్ , బెంగళూరు కారిడార్ల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతుందన్నారు. 3 కొత్త పోర్టులు, 9 కొత్త ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తూ మత్స్య సంపద సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో 46,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకు సిద్ధంగా ఉందని, 245 పారిశ్రామిక పార్కులు, 28 ఆటోనగర్లు, 3 మల్టీ ప్రాడక్ట్ ప్రత్యేక ఆర్థిక మండళ్లు, 2 ఐ.టీ సెజ్ లు, 3 గ్రోత్ సెంటర్లు , 253 బల్క్ లు ఇలా వేగంగా పారిశ్రామికరంగంలో వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. 


ఆగస్ట్,2023 కల్లా మొత్తం 1362 అమృత్ సరోవర్లను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు.  'మిషన్ అమృత్ సరోవర్'పై  బిజినిస్ సమ్మిట్ లో ఆయన ప్రత్యేక ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం అమృత్ సరోవర్ గురించి తెలిపే వీడియోని అంబాసిడర్ల ముందు ప్రదర్శించారు.


చేనేత,జౌళి వస్త్ర ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని ఆ శాఖ చేనేత, జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి కె.సునీత వెల్లడించారు. ఏపీలోని పెడన ప్రాంతంలో తయారయ్యే కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలా చేరాయన్నారు. నార్వే, జర్మనీ దేశాలకు ఎగుమతి చేయగలిగే ఉత్పత్తుల జాబితాను సిద్ధం చేసి చర్చించడమే కాకుండా ఆమె ప్రంజటేషన్ ఇచ్చారు. ప్రత్యేకంగా పద్ధతుల్లో తీర్చిదిద్దిన దుస్తులు, బెడ్ షీట్లు జర్మనీ, నార్వే రాయబార కార్యాలయంలో ఉంచేలా ప్రభుత్వం తరపున అందజేశారు. బందర్ లోని జువెలరీ పరిశ్రమ,  ఏలూరు కార్పెట్స్ తరహా ఉత్పత్తులు, ఉప్పాడ , మంగళగిరి, వెంకటగరి, మాధవరం, ప్రొద్దుటూరు, ధర్మవరం చీరలు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలను అంతర్జాతీయ మార్కెట్ కి ఎగుమతి చేసే అంశంలో నార్వే, జర్మనీతో భాగస్వామ్యం అవుతామని ఆమె పేర్కొన్నారు.


 *ఆంధ్రప్రదేశ్ ని ఫ్రూట్స్, ఫిష్ ఆంధ్రప్రదేశ్ గా పిలవవచ్చు : మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి*



 పండ్లు, చేపల ఉత్పత్తికి ఏపీ చిరునామాగా మారిందని మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ని ఫ్రూట్స్, ఫిష్ ఆంధ్రప్రదేశ్ గా పెట్టుకోవచ్చని నీతి ఆయోగ్ సభ్యుడొకరు గతంలో అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కడప జిల్లాలో ఉల్లిపాయలు, అనంతపురంలో దానిమ్మ, విజయనగరంలో ఒకరకమైన ఎరుపు, పసుపు రంగు మామిడిపండ్లు, గుంటూరు మిర్చి , ఏలూరులో బాదం , నెల్లూరులో నిమ్మ, శ్రీకాకుళం జీడిపప్పు, కోనసీమ కొబ్బరి వంటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత సంతరించుకుందన్నారు. ఈ ఉత్పత్తులను  నాణ్యత, పరిమాణం, ప్యాకేజింగ్, రవాణా వంటి అంశాలను జోడించి రెట్టింపు ఎగుమతులు సాధించే దిశగా ఏపీ ప్రణాళికతో అడుగేస్తోందన్నారు.


ఏపీలో అన్ని రకాల పెట్టుబడులకు 'ఈడీబీ' కేంద్ర బిందువుగా ఉంటుందని ఏపీఈడీబీ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ సావరపు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్, సోలార్, ఫార్మా, కెమికల్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్ టైల్, బొమ్మలు, ఫర్నీచర్ తయారీ రంగాలలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నట్లు వెల్లడించారు. 2050 కల్లా పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ అవతరించేలా , లాజిస్టిక్ హబ్ గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈడీబీ పెట్టుబడులే లక్ష్యంగా పని చేసే ప్రత్యేక వ్యవస్థ అని పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన వెల్లడించారు.


*ఆంధ్రప్రదేశ్ జిల్లాల విభజన.. అభివృద్ధి దిశగా మలుపు : ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్* 


ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన జిల్లాల విభజన.. అభివృద్ధి దిశగా కీలక మలుపని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. ఎన్నో ఆవిష్కరణలు, పరిశీలన వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చి లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో నీతి ఆయోగ్ లా ఏపీలో జిల్లా కలెక్టర్ల సమన్వయ కమిటీల ద్వారా  సంక్షేమ పథకాలపై మానిటరింగ్ జరుగుతుందన్నారు.  రూరల్, అర్బన్ ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత,ఆహారశుద్ధి,  మార్కెటింగ్ శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి,  పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ ఏ.వి.పటేల్ , జాయింట్ డైరెక్టర్లు ఇందిరా, జీఎస్ రావు, రాజశేఖర్, విజయ్ రత్నం, వీఆర్ వీఆర్ నాయక్, ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ సావరపు ప్రసాద్, చేనేత జౌళి శాఖ, ప్రణాళిక, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments