*స్పందనలో 209 అర్జీలు స్వీకరణ*
..
*స్పందన అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత* ...
*ప్రజల సంతృప్తిస్ధాయి మరింత పెంచే విధంగా నాణ్యమైన పరిష్కారం* ...
ఏలూరు, నవంబరు, 07 (ప్రజా అమరావతి): ప్రజల్లో సంతృప్తిస్ధాయి పెంచే విధంగా స్పందన అర్జీల పరిష్కారం ఉండాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం స్ధానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీదారుల నుంచి వినతులను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్వీకరించారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 209 అర్జీలు అందాయని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలిపారు. స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తోపాటు జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, డిఆర్వో ఎవి సత్యనారాయణమూర్తి, ఏలూరు ఆర్డిఓ కె. పెంచల కిషోర్, డిఆర్డిఏ పిడి విజయరాజు, తదితరులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ స్పందనలో అందిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించడానికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రజల సంతృప్తికే అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. పిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్ధాయిలో పూర్తిగా పరిశీలించి పారదర్శకంగా విచారణచేసి అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఏ అర్జీకూడా రీఓపెనింగ్ కు ఆస్కారంలేకుండా పరిష్కరింపబడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ప్రజాసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుందన్నారు. అర్జీలు పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేకదృష్టి పెట్టడంతోపాటు నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు.
*మండలస్ధాయిలో ప్రత్యేకాధికారులు సమీక్షించాలి* ..... మండలాల్లో జరుగుతున్న ప్రభుత్వ ప్రాధాన్యతాకార్యక్రమాలు అమలు ప్రగతిని సంబంధిత మండల ప్రత్యేకాధికారులు ఆయా మండలాల్లోని అన్ని శాఖల అధికారులతో ప్రతివారం సమీక్షించాలని కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. తద్వారా క్షేత్రస్ధాయిలో మరింత మెరుగైన ఫలితాలను సాధించవచ్చన్నారు. గృహనిర్మాణాలు నాడు-నేడు, ఉపాధిహామీ, ప్రభుత్వ ప్రాధాన్యత నిర్మాణాలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించాలన్నారు.
అందిన అర్జీల్లో కొన్ని.... ఏలూరు రహమత్ వీధికి చెందిన పి. మధుమోహన్ అర్జీ అందిస్తూ నివాసాలమధ్య మురుగునీరు వెళ్లుటకు అవకాశం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వెంటనే వ్యక్తిగతంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్ద కమీషనరును ఆదేశించారు. ఏలూరు, తంగెళ్లమూడి రాణీ నగర్ కు చెందిన చందనాడ. నందేశ్వరరావు అర్జీనిస్తూ జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కు ధరఖాస్తు చేశామని ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వెంటనే సమస్యను పరిశీలించి పట్టాజారీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్ధ పివోను ఆదేశించారు. చాట్రాయి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన మోరంపూడి. సీతారావమ్మ, మోరంపూడి కృష్ణయ్య అర్జినిస్తూ తమ పొలం వేరేవారు సాగుచేస్తూ తమ పొలంలోకి మమ్ములను రానివ్వడం లేదని పిర్యాదు చేశారు. తమపొలంను సర్వేచేయించాలని కోరారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందిస్తూ వ్యక్తిగతంగా ఈవిషయాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భీమడోలు మండలం కొండ్రుపాడు గ్రామానికి చెందిన పూరేళ్ల నాగ గౌతమ్ అర్జీనిస్తూ తమ భూమి రికార్డులు పరిశీలించి ఈ-క్రాప్ బుకింగ్ చేసుకొని తాము సాగుచేసి పండించిన ధాన్యం అమ్ముకొనే వెసులుబాటు కల్పించాలని కోరారు. ఈ విషయంపై తగు పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. టి.నర్సాపురం మండలం వెంకటాపురం పంచాయితీ తిరుమలదేవి పేటకు చెందిన కొండపల్లి చిన్నవెంకటేష్ అర్జీనిస్తూ తమ తండ్రినుంచి సంక్రమించిన భూమి, ప్రభత్వమిచ్చిన భూమిని మొత్తం 2.75 ఎకరాలు సేధ్యం చేసుకొని జీవిస్తున్నానని అయితే ఒంటరి వృద్ధుడైన తనను సేద్యం చేసుకోనియకుండా కొంత మంది అడ్డుకుంటున్నారని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందిస్తూ వ్యక్తిగతంగా క్షేత్రస్ధాయిలో పరిశీలన చేసి సమస్యను పరిష్కరించాలని టి. నర్సాపురం తహశీల్ధారును ఆదేశించారు. గణపవరం మండలం కొత్తపల్లికి చెందిన మద్దాల కనకరత్నం అర్జీనిస్తూ 4.08 సెంట్లు చేపల చెరువు కొత్తపల్లి గ్రామంలో కలిగియున్నామని అయితే సదరు చెరువు ప్రభుత్వ రికార్డుల్లో ఆక్వాజోన్ పరిధిలో ఉందని అందువల్ల కరెంటు సబ్సిడీ రావండంలేదని తెలిపారు. కావున తమ అర్జీ పరిశీలించి కరెంటు రాయితీ ఇప్పించాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈవిషయంపై సమగ్ర పరిశీలన చేసి ప్రభుత్వ నిబంధనలమేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment