నెలలో 40 వేల మందికి గృహాల రిజిస్ట్రేషన్



*నెలలో 40 వేల మందికి గృహాల రిజిస్ట్రేషన్


*


పార్వతీపురం, నవంబర్ 5 (ప్రజా అమరావతి): నెల రోజుల్లో 40 వేల మందికి గృహాలను రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు రాష్ట్ర టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ తెలిపారు. పార్వతీపురం మండలం అడ్డాపుశీల వద్ద నిర్మిస్తున్న టిడ్కో గృహాలను పర్యవేక్షక ఇంజనీర్ డి. నరసింహమూర్తి, కార్యనిర్వాహక ఇంజనీర్ ఎస్. జ్యోతి తో కలిసి శనివారం చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 21 నాటికి 1.50 లక్షల గృహాలను రాష్ట్రంలో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి 8,400 గృహాలను లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో టిడ్కో గృహాల నిర్మాణాన్ని ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్వతీపురంలో 768 టిడ్కో గృహాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 20వ తేదీన పనులను ప్రారంభించామని ఇప్పటికీ 324 గృహాల నిర్మాణం పూర్తి చేశామని ఆయన అన్నారు. రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రాజెక్టు గృహాలను 65 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. 1992 నుండి 2020 సంవత్సరం వరకు చేపట్టిన ప్రాజెక్టులలో టిడ్కో గృహాల ప్రాజెక్టు అతి పెద్ద ప్రాజెక్టు అని ప్రసన్నకుమార్ చెప్పారు. పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఈ గృహాలను బహుమతిగా అందించారని పేర్కొన్నారు. 24 గంటలు నీటి సరఫరా ఉండే విధంగా రాష్ట్రంలో అన్ని టిడ్కో కాలనీలను తయారు చేస్తున్నామని చెప్పారు. మురుగు నీటిపారుదలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో 3 వందల చదరపు అడుగుల ఇళ్లను ఒక రూపాయికే లబ్ధిదారులకు అందిస్తామని తెలియజేశారని ఆ మేరకు పార్వతీపురంలో 768 గృహాలను ఒక రూపాయికే లబ్ధిదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. గృహాల రిజిస్ట్రేషన్ విలువ 50 వేల రూపాయలు ఉందని దాన్ని కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఒక యూనిట్ ఖరీదు 6.50 లక్షలుగా ఉందని దానికితోపాటు 20 గజాల అవిభాజ్య స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నామని వీటి మొత్తం వెరసి 10 లక్షల రూపాయలు ఖరీదు చేస్తుందని వీటిని లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గృహాలకు పుట్టి, వెట్రిఫైడ్ ఫ్లోరింగ్,  వంటగదిలో గ్రానైట్ స్లాబు వేస్తున్నామని ఆయన చెప్పారు. ఇంత గొప్పటి సంక్షేమ ప్రభుత్వం చూడలేదని ప్రసన్నకుమార్ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద దేశంలో కోటి 20 లక్షల యూనిట్ల ఇల్లు మంజూరు చేస్తే 32.60 లక్షల ఇళ్ళు ఆంధ్రప్రదేశ్ కు మంజూరై  దేశంలోనే మొదటి స్థానంలో రాష్ట్రం ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రెండు, మూడవ స్థానాల్లో నిలిచాయని ఆయన అన్నారు. 17 మునిసిపాలిటీ లలో 50 వేలు గృహాలను ఇప్పటికే లబ్ధిదారులకు అందించామని అందులో 25 వేలు గృహాలను రూపాయి విలువకే అందించామని చెప్పారు.


*తోటపల్లి నుండి నీటి సరఫరా* 


తోటపల్లి ప్రాజెక్టు నుండి టిడ్కో గృహాలకు నీటిని సరఫరా చేయుటకు చర్యలు చేపట్టామని ప్రసన్న కుమార్ తెలిపారు. ఉల్లి భద్ర వద్ద ఇంటెక్ వెల్ ను నిర్మించి అచ్చట నుండి  టిడ్కో గృహాలకు నీటిని సరఫరా చేయుటకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. నీటి వసతులు కల్పించుటకు తోటపల్లి వద్ద ప్రసన్నకుమార్ శనివారం పరిశీలించారు.


 ఈ కార్యక్రమంలో ఉప కార్యనిర్వక ఇంజనీర్ బాలకృష్ణమూర్తి, సహాయ ఇంజినీర్ ప్రవీణ్, కన్సల్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Comments