జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆదుకోవాలి

 



నెల్లూరు నవంబర్ 14 (ప్రజా అమరావతి);

జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆదుకోవాల


ని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.  


సోమవారం మధ్యాహ్నం జిల్లాలో భారీ వర్షాలు స్థితిగతులపై  మంత్రి జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు, జిల్లా అధికారులతో నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణం లో సమీక్ష సమావేశం నిర్వహించారు. 


ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ

జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా వెంటనే తొలగించేందుకు తగిన చర్యలు చేపట్టాలని రాకపోకలకు ఏలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

ముఖ్యంగా నెల్లూరు నగరంలోని అయ్యప్ప గుడి, మాగుంట లేఅవుట్, రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జిలలో నీరు నిలిచి రాకపోకలకు చాలా అంతరాయం కలిగిందని ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించి భవిష్యత్తులో ఇటువంటివి జరక్కుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు.


ప్రధానంగా కావలి ప్రాంతంలో భారీగా వర్షం కురిసి ఇళ్ళ లోకి నీరు వచ్చాయని అక్కడ నీటిని తొలగించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.

దెబ్బతిన్న పంచాయతీ రాజ్, రహదారులు భవనాల రహదారులను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు

దాదాపు మూడు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున కూలికి పోయేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని వారిని ఆదుకోవాలన్నారు. 

వారికి నిత్యావసర సరుకులను పంపిణీ  చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని  సూచించారు

వర్షం తగ్గాక వ్యవసాయ ఉద్యాన శాఖల ద్వారా పంట నష్టం అంచనాలను తయారు చేసేందుకు సిద్ధం కావాలని ,  అవసరమైతే సబ్సిడీపై  విత్తనాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు.

వరద నీరు పంట పొలాల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ఎఫ్ డి ఆర్ పనులను ఆలస్యం చేయకుండా తక్షణమే పూర్తి చేయాలన్నారు.

గ్రామాల్లో ఎక్కడ అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ముఖ్యంగా పారిశుద్ధ్యము సజావుగా జరగాలని,  ఎక్కడ మంచినీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

విద్యుత్ లైన్లు ఎక్కడా కూడా కిందికి జారి మనుషులు గానీ, పశువులు గాని ప్రమాదానికి గురికాకుండా  అన్ని ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టాలన్నారు

ఇళ్లకు విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు.

అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా 

చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

ప్రతి ప్రభుత్వ శాఖ వారి పరిధిలో తాజాగా నష్టం అంచనాలను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ ద్వారా నివేదిక పంపాల్సి ఉంటుందన్నారు.


ఇటీవల ఓవల్ పాఠశాలలో చిన్నారి బాలికపై జరిగిన అత్యాచార సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని జిల్లాల్లో మరెక్కడ  పునరావృతం కారాదని హెచ్చరించారు.  జరిగిన సంఘటనపై లోతుగా విచారించి బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టాలని విద్య, పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు.  సంఘటన జరిగిన పాఠశాలను బ్లాక్ లిస్టులో పెట్టాలని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరల పాఠశాల నిర్వహణకు వారికి ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని సూచించారు.


జిల్లాకు మరోసారి  భారీ వర్ష సూచన ఉన్నందున  జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం అందరూ  అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. 



అంతకుమునుపు జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని మంత్రికి వివరించారు.


జిల్లాలో గత మూడు రోజులుగా సాధారణం కంటే కొంత అధికంగా వర్షపాతం నమోదు అవుతుందన్నారు. గత 24 గంటల్లో 10 మండలాల్లో పది సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదయిందన్నారు. అలాగే గత నాలుగు రోజులుగా 28 మండలాల్లో పది సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదయిందన్నారు. జిల్లాలోని అన్ని చెరువులు 70  శాతం నిండాయన్నారు. 

జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అప్రమత్తం చేశామన్నారు.   కలెక్టరేట్లో 1077 టోల్ ఫ్రీ నెంబర్తో ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేసి తుఫాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామన్నారు.  ఎక్కడైనా రహదారులు గానీ, చెరువులు గానీ దెబ్బతింటే వాటిని 24 గంటల్లో మరమ్మతు చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సిద్ధంగా ఉన్నాయన్నారు. 


మండల ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు సంసిద్ధంగా ఉన్నారన్నారు.  ఇదివరకే  ఇచ్చిన సెలవులను కూడా భారీ వర్షాల కారణంగా రద్దు చేశామన్నారు.  గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని 

ప్రజలను సకాలంలో అప్రమత్తం చేసేందుకు వినియోగిస్తున్నామన్నారు.


ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా లో అంతరాయం కలగకుండా చూస్తున్నామని, మంచి  స్వచ్ఛమైన  త్రాగునీరు అందిస్తున్నామని,  అవసరమైన చోట్ల ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.  అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైనన్ని మందులు  అందుబాటులో ఉంచామన్నారు.  అన్ని ప్రభుత్వ  శాఖలు సహాయక చర్యలు చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. 


నెల్లూరు నగరపాలక సంస్థ, అన్ని మున్సిపాలిటీలలో మురుగునీటి వ్యవస్థను  బాగుపరుస్తున్నామన్నారు.


జిల్లాలోని  జలాశయాలు,

 చెరువులను   జలవనరుల శాఖ సజావుగా నిర్వహిస్తుందన్నారు.  


ఇప్పటివరకు రహదారులు పెద్దగా దెబ్బతినలేదని 

రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. 


సోమవారం సాయంత్రం వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.  అలాగే వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లాలో ఈనెల 19 నుండి 24వ తేదీ వరకు కూడా మరలా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 



సంయుక్త కలెక్టర్ శ్రీ రోణంకి కూర్మానాధ్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అవసరమైన చోట్ల నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రికి వివరించారు.


ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీమతి హిమవతి, ఇన్చార్జి డిఆర్ఓ శ్రీ మలోల, ఆర్డబ్ల్యూఎస్, పంచాయితీ రాజ్, జల వనరుల శాఖ ఎస్ ఈ. లు శ్రీ రంగవర ప్రసాదరావు, శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ కృష్ణమోహన్, డి ఎం హెచ్ ఓ డాక్టర్ పెంచలయ్య, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ సుధాకర్ రాజు, డీఈవో శ్రీ వి ఎస్ సుబ్బారావు, డిపి ఓ శ్రీమతి ధనలక్ష్మి, డిఎస్ఓ శ్రీ వెంకటేశ్వర్లు, ఉద్యాన శాఖ ఏడి శ్రీ సుబ్బారెడ్డి, సిపిఓ శ్రీ సాలెం రాజు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Comments