తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పామాయిల్ సాగుపై రైతులు మొగ్గు చూపి మంచి లాభాలు పొందాలినెల్లూరు, నవంబర్ 19 (ప్రజా అమరావతి): తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పామాయిల్ సాగుపై రైతులు మొగ్గు చూపి మంచి లాభాలు పొందాల


ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. 

 శనివారం సాయంత్రం పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంలో జాతీయ ఆహార భద్రత మిషన్ - ఆయిల్ ఫామ్ పథకంలో భాగంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మంత్రి మొక్కలు నాటి పామాయిల్ సాగును ప్రారంభించారు. పామాయిల్ మొక్కలకు ఎంతో డిమాండ్ ఉన్నప్పటికీ మంత్రి ప్రత్యేక చొరవతో తూర్పుగోదావరి జిల్లా నుంచి జిల్లాకు తెప్పించి సబ్సిడీపై రైతులకు అందజేయడం పట్ల రైతులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు. 

 ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతుల ధోరణిలో మార్పు రావాలని, అధిక లాభాలను ఇచ్చే వాణిజ్య పంటలపై దృష్టి పెట్టాలన్నారు. సాధారణంగా వేసే పంటలకు ప్రత్యామ్నాయంగా పామాయిల్ పంటను సాగు చేయాలని, ఒక ఎకరాకు సుమారు నాలుగు లక్షల వరకు లాభం వస్తుందని మంత్రి వివరించారు. ఈ మొక్కలను  రైతులకు సబ్సిడీపై అందజేస్తున్నామని, స్వదేశీ మొక్కలకు  20వేలు, విదేశీ మొక్కలకు రూ. 29వేలు ఒక హెక్టార్ కు రాయితీ లభిస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి తీసుకొచ్చిన విప్లవాత్మమైన మార్పులతో అన్నదాతకు అన్ని విధాల మేలు జరుగుతుందన్నారు. త్వరలోనే డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నామని, 50 శాతం సబ్సిడీతో రైతులకు డ్రోన్లు అందిస్తామని, దీంతో మందు పిచికారి సమయంలో వ్యవసాయ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయన్నారు. నానో యూరియాను రైతులకు పరిచయం చేశామని, మరో 12 రకాల కొత్త వరి వంగడాలను ప్రవేశపెట్టామని, వీటికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఇప్పటికే ఉచిత పంటల బీమా కింద 6,500 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి విడుదల చేశారని చెప్పారు. వైయస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా రైతులకు అవసరమైన పరికరాలను వారికి నచ్చిన డీలర్ల వద్ద, వారికి నచ్చిన పరికరాలను కొనుగోలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించడంతోపాటు రాయితీ నగదును వారి ఖాతాలకు జమ చేస్తున్నట్లు చెప్పారు. రైతుకు అన్ని విధాల అండగా ఉంటూ వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్క రైతు కూడా పామాయిల్ మొక్కల సాగు పట్ల ఆసక్తి చూపి అధిక లాభాలు పొందాలని, రైతులకు అన్ని విధాల ప్రోత్సాహకం అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. 

 అనంతరం  సబ్సిడీపై పామ్ ఆయిల్ మొక్కలకు సంబంధించిన  మంజూరు పత్రాలను, తైవాన్ స్ప్రేయర్లను రైతులకు మంత్రి అందించారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీ సుబ్బారెడ్డి, ఏపీఎంఐపీ పిడి శ్రీ శ్రీనివాసులు, తాసిల్దార్ ప్రసాద్, వ్యవసాయ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 


Comments