శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించాలి

 శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించాలి*



*: కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి*


*విశేషంగా ఆకట్టుకున్న సౌండ్ అండ్ లైట్/ మల్టీమీడియా షో*




పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), నవంబర్ 22  (ప్రజా అమరావతి):


భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 97వ జయంతోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైట్/ మల్టీమీడియా షోని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా, జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, తదితరులు ప్రారంభించారు. ముందుగా ముఖ్య అతిధులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆహూతులను సౌండ్ అండ్ లైట్/ మల్టీమీడియా షో విశేషంగా ఆకట్టుకుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైట్/ మల్టీమీడియా షోని తిలకించి ప్రతి ఒక్కరూ పరవశించిపోయారు. చప్పట్లతో కరతాళధ్వనులు చేశారు.*


ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వంద సంవత్సరాల జయంతోత్సవాలను అద్భుతంగా నిర్వహించుకోవడం కోసం ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టాలన్నారు. స్వామి వారి ఆశీస్సులతో కేంద్ర ప్రభుత్వం తరఫున తాము కూడా ఇందులో భాగస్వామ్యం అవుతామన్నారు. స్వామి శత జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేలా చూడాలన్నారు.


ఇప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 97వ జయంతోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. భారతదేశ ప్రధానమంత్రి  నరేంద్ర  మోడీ   ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫున సౌండ్ అండ్ లైట్/ మల్టీమీడియా షోని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ఇందుకోసం 4.25 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని  తెలిపారు. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో బాబా వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు.


ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, కేంద్ర నెహ్రూ యువకేంద్రం (ఎన్ వై కెఎస్) వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, పుడా చైర్మన్ లక్ష్మీనరసమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ ఓబులపతి, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, ఇంచార్జి డిఆర్ఓ భాగ్యరేఖ, ఆర్డీవోలు తిప్పేనాయక్, రాఘవేంద్ర, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ మంత్రులు గీతారెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ లు, విద్యార్థినీ విద్యార్థులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Comments