*క్యాన్సర్ పై సమరానికి సహకరించండి
*
*చికిత్సలో ఏపీ రోల్ మోడల్‌గా నిలుస్తోంది*
*క్యాన్సర్ రోగానికి పూర్తి ఉచితంగా వైద్యం అందిస్తున్న రాష్ట్రం మాదే*
*వైద్య ఆరోగ్య రంగాన్ని జగనన్న సమూలంగా మార్చేస్తున్నారు*
*ఏపీలో ప్రజల అభిప్రాయాలు తీసుకోండి*
*రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని*
*ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో ఢిల్లీలో భేటీ*
*నాట్ హెల్త్ ఇండియా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం*
*ఏపీలో వైద్య ఆరోగ్య రంగం ఆదర్శవంతం అంటూ ఆయా కంపెనీల కితాబు*
*ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి అమితాశక్తి*
క్యాన్సర్ రోగానికి సంబంధించి వైద్యం అందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత దేశంలోనే ఎంతో ఆదర్శవంతంగా పనిచేస్తున్నది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఏపీలో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి కమిటీని నాట్ హెల్త్ ఇండియా సంస్థ రౌండ్ టేబుల్ సమావేశం కోసం ఆహ్వానించింది. ఈ మేరకు ఢిల్లీలో సోమవారం ఏపీ నుంచి వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి కమిటీ ప్రపంచస్థాయి సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైంది. ఏపీ నుంచి మంత్రి విడదల రజినితోపాటు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీఎస్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఎస్ ఆర్ ఎల్ డయాగ్నోస్టిక్స్, పాత్‌కిండ్ డయాగ్నొస్టిక్స్, హెల్తైన్స్, ప్రో ట్రైబ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పాత్, పాలీ మెడిక్యూర్ లిమిటెడ్, ఆర్థర్ డిలైట్, మెడికా బజార్ లాంటి అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నాట్ హెల్త్ ఇండియా ఉన్నతాధికారులు హాజరయ్యారు.
*క్యాన్సర్ పై కలిసి యుద్ధం చేద్దాం*
ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ తమ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలందరికీ వైద్యం అత్యంత వేగంగా, ఉచితంగా, సులువుగా అందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్ రోగం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. అందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక ఆస్పత్రులు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఉన్న ఆస్పత్రుల్లో క్యాన్సర్ వైద్యం అందేలా ప్రత్యేక వసతులు, మందులు, సిబ్బంది, పరికరాలు.. ఇలా అన్నీ అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్యం అందిస్తున్నామన్నారు. ఎంత ఖర్చయినా సరే ప్రభుత్వమే భరించేలా ముఖ్యమంత్రి జగనన్న నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
*టెక్నాలజీ వినియోగంలో ఏపీ ముందంజ*
డిజిటల్ టెక్నాలజీ వైద్య సేవలను మరింత సులభతరం చేస్తున్నదని, ఈ విషయంలో తాము ఎంతో ముందు ఉన్నామని మంత్రి తెలిపారు. రోగ నిర్థారణ, చికిత్స, నిరంతర సంరక్షణ విషయంలో విజువల్ టెక్నాలజీని ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్నదని చెప్పారు. వీడియోలు, థర్మల్, ఎక్స్-రేలు, అల్ట్రాసౌండ్, ఎంఆర్ ఐ , సిటీ స్కాన్... ఇలా అన్ని అంశాల్లో కృత్రిమ మేథస్సును వినియోగించుకునేలా చూడాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ఈహెచ్ ఆర్ రికార్డులను బలోపేతం చేయడం, ప్రతి వ్యక్తి డేటాను భద్రపరిచి ఉంచే విషయంలో ఏపీకి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
*రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం*
రాష్ట్రవ్యాప్తంగా 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 8500 కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో గిరిజనుల ప్రాంతాల్లో రెండు వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నతస్థాయి వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 10032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, 1100కుపైగా పీహెచ్‌సీలు నిర్మిస్తున్నామని వివరించారు. సెకండరీ, టెర్షియరీ వైద్య విభాగాలను గతంలో ఎప్పుడూ, ఎక్కడా కనివినీ ఎరుగని విధంగా బలోపేతం చేస్తున్నామని వివరించారు. మొత్తంమీద వైద్య వసతుల కల్పనకు ఏపీలో 16వేల కోట్ల రూపాయలకుపైగా నిధులను జగనన్న ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు.
*భాగస్వామ్యం అవసరం*
రాష్ట్రంలో పెద్ద ఎత్తున వైద్య సదుపాయాలు కల్పిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సంబంధమైన సంస్థల సాయం తమకు ఎంతో అవసరమని చెప్పారు. వైద్య పరికరాలు, మందులు, అత్యాధునిక సాంకేతిక సేవల అవసరం తమ రాష్ట్రానికి ఇప్పుడు ఎంతో ఉందని వివరించారు. ఆయా సంస్థలు ముందుకొచ్చి తగినంత సహాయ సహకారాలు అందించాలని కోరారు. వైద్యులు, వైద్య సిబ్బందికి ఆధునిక నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలని సూచించారు. సంస్థలు, ప్రభుత్వం ఉమ్మడి కార్యాచరణ చేపడితే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ మేరకు వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆయా సంస్థల సేవలను వినియోగించుకోవడం.. అనే అంశాలపై ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు.
*ఏపీకి సేవలు అందిస్తాం..*
సమావేశానికి హాజరైన నాట్ హెల్త్ ఇండియాతో పాటు ఆయా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ ఏపీలో అందుబాటులోకి తీసుకొస్తున్న నూతన వైద్య కళాశాలలకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. పరికరాలు, మందులు, సాంకేతిక సేవలు అందించే విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. సిబ్బంది శిక్షణలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
addComments
Post a Comment