మామ స్థానం నుంచి కోడలు పోటీ.. డింపుల్‌ యాదవ్‌ అభ్యర్థిత్వం ఖరారు...!

 *మామ స్థానం నుంచి కోడలు పోటీ.. డింపుల్‌ యాదవ్‌ అభ్యర్థిత్వం ఖరారు...!


*


లఖ్‌నవూ (ప్రజా అమరావతి): సమాజ్‌వాదీ పార్టీ(SP) వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌(Mulayam Singh Yadav) ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీగా మారిన మైన్‌పురీ(Mainpuri) లోక్‌సభా స్థానం నుంచి.. ఎస్పీ అభ్యర్థిగా ఆయన కోడలు, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌(Dimple Yadav) బరిలోకి దిగనున్నారు. ఎస్పీ గురువారం ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ స్థానానికి డిసెంబరు 5న ఉప ఎన్నిక నిర్వహించి, డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నారు.


వాస్తవానికి ఈ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా ములాయం మనవడు, మాజీ ఎంపీ తేజ్ ప్రతాప్‌ యాదవ్‌ను పోటీలోకి దించుతారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగాయి. కానీ, చివరకు డింపుల్‌ యాదవ్‌ను ఖరారు చేశారు. మామ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా పార్టీ ఆమెకు ఈ అవకాశం కల్పించినట్లు సమాచారం. మైన్‌పురీ 1996 నుంచి సమాజ్‌వాదీకి కంచుకోటగా ఉంది. అఖిలేశ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కర్హల్ అసెంబ్లీ స్థానం కూడా ఇదే లోక్‌సభ నియోజకవర్గంలో ఉంది. ఇదిలా ఉండగా.. 44 ఏళ్ల డింపుల్‌ యాదవ్‌ గతంలో 2012 ఉప ఎన్నికలో, 2014 సాధారణ ఎన్నికలో కన్నౌజ్‌ పార్లమెంట్‌ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. 2019లోనూ అక్కడినుంచే పోటీ చేసి.. భాజపా అభ్యర్థి సుబ్రత్ పాఠక్ చేతిలో ఓటమిపాలయ్యారు.


ఐదు దశాబ్దాలపాటు ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ములాయం సింగ్‌ యాదవ్‌(82).. అక్టోబరు 10న కన్నుమూసిన విషయం తెలిసిందే.

Comments