నెల్లూరు (ప్రజా అమరావతి);
జిల్లా ప్రగతి, పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజాప్రతినిధుల ఆలోచనలకు అనుగుణంగా వారి సూచనలు, సలహాలను పరిగణలోనికి తీసుకుంటూ జిల్లాను సమగ్రంగా అభివృద్ది చేసేందుకు అన్నీ చర్యలు
తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్ చక్రధర్ బాబులతో కలసి మైనింగ్, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాలు, హౌసింగ్, ఆర్.డబ్ల్యూ.ఎస్., ఆర్ అండ్ బి., పంచాయతీ రాజ్, ఇరిగేషన్ శాఖల ద్వారా జిల్లాలో చేపడుతున్న పనులు, కార్యక్రమాల అమలు పై క్షుణ్ణంగా సంబంధింత శాఖల అధికారులతో సమీక్షించి ఆయా శాఖల ద్వారా చేపడుతున్న పనులు, కార్యక్రమాలను నిర్దేశించిన గడువులో పూర్తి చేసి జిల్లాను సమగ్రంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి అధ్వర్యంలో జిల్లాకు సంబంధించి వివిధ శాఖలపై సమీక్షించడం జరిగిందన్నారు. ప్రధానంగా రైతులకు సాగునీరు అందించే నేపధ్యంలో ఇటీవల కురిసిన వర్షాల వలన ఎక్కడైనా కాలువలు, చెరువులు దెబ్బతింటే వాటికి మరమ్మత్తులు చేపట్టి సజావుగా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా జిల్లాలో జరుగుచున్న మైనింగ్ కార్యకలాపాల వలన అధిక లోడ్ తో మైనింగ్ రవాణా జరుగుతున్నందున రోడ్లు దెబ్బతినడం, అక్రమ మైనింగ్ వలన ప్రభుత్వ ఆదాయానికి గండి పడటం జరుగు చున్నదని వెంకటగిరి నియోజక వర్గ శాసన సభ్యులు తెలిపిన నేపధ్యంలో జిల్లా కలెక్టర్ గారు సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ వేసి, అక్రమ మైనింగ్ జరగకుండా నిరోధించడం, అధిక లోడ్ తో వచ్చే వాహనాలను నియంత్రించడం, భవిష్యత్తులో ఎక్కడా ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకునేలా ఆ కమిటీ ఇచ్చే సూచనలు, సలహాలను పరిగణలోనికి తీసుకొనేలా నిర్ణయించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల వలన ఎక్కడైనా పంట దెబ్బతింటే పరిశీలించమని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, ఖరీఫ్ సీజన్లో ఎక్కడా ఎరువులు కొరత రాకుండా ముందస్తు ప్రణాళికతో వెళ్లాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. జిల్లాలో దెబ్బతిన్న ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖల రోడ్లను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో వాటి మరమ్మత్తులకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి వివరించారు. మొదటి ఫేజ్ లో చేపట్టిన ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మత్తు పనులు పూర్తి కావడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్నీ మండలాలను నుడా పరిధిలోకి తీసుకురావడం జరిగిందని, జిల్లాలో అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం తోపాటు ఇల్లు నిర్మించే కార్యక్రమం జిల్లాలో జరుగుచున్నవని, ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి త్రాగు నీటి కుళాయిని ఏర్పాటు చేయాలని, దీనికి గాను 7,600 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ రెండు రోజుల క్రిందటే జీఓను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని, అందులో జిల్లాకు సంబంధించి 344 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు. వాటికి సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు చేసేలా ముందస్తుగా ప్రణాళికలను రూపొందించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యతా క్రమంలో ఒక ప్రక్క సంక్షేమ కార్యక్రమాలను, మరో ప్రక్క అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
జిల్లాలో అక్రమ మైనింగ్, అధిక లోడ్ రవాణా వలన రోడ్లు దెబ్బతింటున్నందున అధిక లోడ్ ను నియంత్రించడం, సాగునీటి కెనాల్స్, చెరువుల మరమ్మత్తులు, వివిధ అభివృద్ది కార్యక్రమాల పనులకు సంబంధించిన బిల్లుల పెండింగ్ తదితర పలు సమస్యలను ఈ సమావేశంలో వెంకటగిరి, కావలి , కందుకూరు, ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, శ్రీ మానుగుంట మహిధర్ రెడ్డి, శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా ఎస్. పి. శ్రీ విజయ రావు, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మనాథ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ, తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ శ్రీ టి. బాపిరెడ్డి, నెల్లూరు ఆర్.డి.ఓ శ్రీ మలోల, జిల్లా పరిషత్ సి ఈ ఓ శ్రీ చిరంజీవి, డిఆర్డీఏ, డ్వామా పిడీలు శ్రీ సాంబశివారెడ్డి, శ్రీ వెంకట్రావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీ సుధాకర్ రాజు, ఇరిగేషన్ ఎస్.ఈ శ్రీ కృష్ణమోహన్, ఎస్. ఈ ఆర్.డబ్ల్యూ ఎస్ శ్రీ రంగ వరప్రసాద్, జిల్లా ఉద్యాన శాఖాధికారి శ్రీ సుబ్బారెడ్డి, డిటిసి శ్రీ చందర్, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి శ్రీ వెంకటేశ్వర్లు, డిపిఓ శ్రీమతి ధనలక్ష్మి, ఆర్ అండ్ బి, పంచాయాతీ రాజ్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment