*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
*పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా*
*విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి*
• పాఠశాల విద్యాశాఖ కమీషనర్& ఎస్పీడీ శ్రీ ఎస్.సురేష్ కుమార్
• పాఠశాలల్లో క్రీడాభివృద్ధికి కృషి చేయాలి
• స్కూల్ గేమ్స్ కార్యదర్శుల కార్యశాల & ఎగ్జిక్యూటీవ్ సమావేశం
• కార్యదర్శి పదవిలో మహిళలకు 33శాతం ప్రాధాన్యం
• జిల్లాలో ఒక పాఠశాలను ‘స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ఎంపిక చేయాలి
అమరావతి (ప్రజా అమరావతి);
పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడలను సమర్థవంతంగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు అన్నారు. గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో 66వ అండర్ 14,17,19 జిల్లాల స్కూల్ గేమ్స్ కార్యదర్శుల కార్యశాల మరియు ఎగ్జిక్యూటీవ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు శక్తి సామర్థ్యాల పరీక్ష నిర్వహించి ‘ఖేలో ఇండియా ఫిట్ నెస్’ యాప్ నందు వివరాలు నమోదు చేయాలని అన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు కనీసం రెండు ఆటల్లో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పాల్గొనేలా వ్యాయమ ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు.
క్రీడల్లో ఆసక్తిగల విద్యార్థులను గుర్తించి వారికోసం పాఠశాల తరగతుల అనంతరం కూడా ప్రతి రోజూ రెండు గంటల సమయం అదనంగా కేటాయించాలని, విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని కోరారు. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి పాఠశాలలో క్రీడలు నిర్వహించేలా బాధ్యత వహించాలని అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఉద్యోగంగా కాకుండా ఒక తపస్సులా భావించి విద్యార్థులను ఉన్నత స్థాయిలో ఎదిగేలా నిరంతర కృషి చేయాలని అన్నారు.
*కార్యదర్శి పదవిలో మహిళలకు 33 శాతం ప్రాధాన్యం*
బాలికలకు శిక్షణ ఇచ్చినతర్వాత వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ విద్యార్థినులు తిరిగి ఇంటికి వెళ్లేవరకు మహిళా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని అన్నారు. స్కూల్ గేమ్స్ కార్యదర్శుల పదవిలో మహిళా వ్యాయామ ఉపాధ్యాయులకు 33శాతం ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో జరుగుతున్న పోటీల్లో పూర్తి నైపుణ్యం గల క్రీడాకారులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ అనుభవజ్ఞులైన వ్యాయామ ఉపాధ్యాయులు ఆరోపణలు, పక్షపాతం లేకుండా, పారదర్శకంగా, చిత్తశుద్ధిగా వ్యవహరించి ఎంపిక చేయాలని ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, సమైక్యంగా ఉండి క్రీడలు నిర్వహించాలని అన్నారు.
*రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించాలి*
రాష్ట్ర స్థాయిలో అండర్ 14, 17, 19 అంతర్ జిల్లాల బాలబాలికల పోటీలను అన్ని జిల్లాల్లో నిర్వహించాలని కమీషనర్ అన్నారు. ఈ రాష్ట్రస్థాయి పోటీలు డిసెంబరు నెలఖారుకల్లా పూర్తి చేసి జాతీయస్థాయి పోటీలకు టీములను సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రాథమిక పాఠశాల నుంచి జూనియర్ కళాశాలల వరకు అవసరమైన క్రీడా పరికరాలు అందేలా చర్యలు తీసుకుంటామని, క్రీడాభివృద్ధికి కోసం అవసరమైన నిధులు మంజూరు చేస్తామని అన్నారు. జాతీయ స్థాయిలో మంచి కంపెనీలతో ఒప్పందం చేసి అవసరమైన నాణ్యమైన క్రీడా పరికరాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఒక పాఠశాలలను ‘స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ఎంపిక చేసి విద్యార్థులకు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అంతర్ జిల్లాలు, జాతీయ స్థాయి పోటీలు క్రీడల నిర్వహణ మార్గదర్శకాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
వివిధ స్థాయుల్లో జరుగుతున్న పోటీల్లో పాల్గొన్న బాలబాలికలకు ప్రపథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు పరచడంలో కమీషనర్ గారి కృషి ఉందని, తద్వారా క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందని అన్ని జిల్లాల కార్యదర్శులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో సమగ్ర శిక్షా అదనపు రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు , పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీమతి పి.పార్వతి , పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ (సర్వీసులు) శ్రీ మువ్వా రామలింగం , రాష్ట్ర స్కూల్ గేమ్స్ సెక్రటరీ శ్రీ జి.భానుమూర్తిరాజు , అసిస్టెంట్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ డా. ఎం.మనోహర్ , ఆర్ఐపీ (రీజనల్ ఇన్సెపెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) ఎస్.కె.మహబూబ్ బాషా, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment