పిల్లలకు మనమివ్వగలిగే ఆస్తి చదువులే...


మదనపల్లె, అన్నమయ్య జిల్లా (ప్రజా అమరావతి);


*జగనన్న విద్యా దీవెన.*


*పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ – క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపులు.*


*జూలై – సెప్టెంబరు 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ.694 కోట్లను అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


*మీలో ఒకడిగా.. మీవాడిగా... మీతో..* 

దేవుడి దయతో మనందరి ప్రభుత్వం, మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ ప్రభుత్వం అధికారం చేపట్టి ఈరోజుకి సరిగ్గా మూడున్నర సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా మీలో ఒకడిగా, మీ వాడిగా, ఈ రోజు నాతో సమయం పంచుకునేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వా, తాతకు, సోదరుడికి, స్నేహితుడికీ, ప్రతి పాపకు, బాబుకు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.


*పిల్లలకు మనమివ్వగలిగే ఆస్తి చదువులే...*


పిల్లలకు మనమివ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువులే. పేద కుటుంబాలు ఆ పేదరికం నుంచి బయటకు రావాలన్నా, ఆ కుటుంబాల తలరాతలు మారాలన్నా అది సాధ్యమయ్యేది ఎప్పుడంటే.. చదువనే అస్త్రం ఆ పిల్లల చేతుల్లోకి వచ్చినప్పుడే. తమ కుటుంబాల పేదరికం కారణం వల్ల ఏ ఒక్క పాప, బాబు... చదువులకు అవరోధం కాకూడదని మంచి ఆలోచన, మంచి మనస్సుతో, ఒక సామాజిక బాధ్యతతో అప్పట్లో ఆ ప్రియతమ నేత, దివంగత నాయకుడు రాజశేఖరరెడ్డి గారు (నాన్నగారు) మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చారు. ప్రతిపేదవాడి జీవిత చరిత్ర మార్చాలని తపనపడ్డారు.


అలాంటి ఆ గొప్ప పథకాన్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ నీరుగార్చుతూ వచ్చాయి. అరకొరగా ఫీజులిస్తూ.. అవి కూడా సంవత్సరాల తరబడి బకాయిలు పెడుతూ చివరికి ఈ పథకాన్ని కూడా మొత్తంగా నీరుగార్చే కార్యక్రమం చేశాయి.


*నా పాదయాత్రలో కళ్లారా చూశాను...*

అలాంటి పరిస్థితులు నా కళ్లారా నా 3648 కిలోమీటర్ల సాగిన నా పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలో చూశాను. వారు చెప్పిన గాధలను నా చెవులారా విన్నాను. ఆ రోజు నేనన్నాను. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పిన మాటలు... నాకు గుర్తున్నాయి.


*మార్పు దిశగా అడుగులు...* 

అందుకే అధికారంలోకి వచ్చిన  తర్వాత ఆ పరిస్థితులును అన్నింటినీ మార్చే అడుగులు మన ప్రభుత్వంలో పడ్డాయి. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న విద్యా దీవెన పేరుతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంటే వందశాతం ఫీజులన్నింటినీ కూడా మీ ప్రభుత్వం నేరుగా భుజస్కందాలపై మోస్తుంది. మూడున్నర సంవత్సరాలుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇదొక్కటే కాకుండా. .దీంతో పాటు పిల్లలు బాగుండాలని,ఆ చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు, వాళ్ల హాస్టల్‌ ఖర్చులు కోసం పిల్లలు ఇబ్బంది పడకూడదని సంవత్సరానికి రూ.20వేలు వరకు ప్రతి పాపకు, పిల్లాడికి మేలు జరిగేలా జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని కూడా తీసుకొచ్చాం.


*విద్యావ్యవస్ధలో సంస్కరణలు....*

ఆంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి బిడ్డా పోటీ ప్రపంచంతో నిలవాలని, గెలవాలనే మంచి ఆలోచనతో మొత్తం విద్యావ్యవస్ధలోనే సంస్కరణలు తీసుకొచ్చాం. వాటిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ పూర్తి రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పేదవర్గాల పిల్లలు పెద్ద చదువులు చదువుకోవడం ఒక హక్కుగా వాళ్లు పొందగలిగే పరిస్థితిని తీసుకువచ్చాం. ఈ దిశగా అడుగులు వేస్తూ.. గతంలో చంద్రబాబునాయుడు గారి ప్రభుత్వం కాలంలో 2017–18, 2018–19కు సంబంధించి రూ.1778 కోట్లు  బకాయిలు పెడితే వాటిని కూడా మనందరి ప్రభుత్వం చిరునవ్వుతోనే స్వీకరించి చెల్లించాం.


*మూడున్నరేళ్లలో రెండు పథకాలకే రూ. 12 వేల కోట్లు పైగా...* 

ఈ మూడున్నర సంవత్సరాల కాలంలోనే కేవలం జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా రూ.9052 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా రూ.3349 కోట్లు పిల్లల చదువులకు ఏమాత్రం ఇబ్బంది రాకూడనే ఉద్ధేశ్యంతో .. చంద్రబాబు ప్రభుత్వంలో పెట్టిన బకాయిలు సైతం తీరుస్తూ... కేవలం ఈ రెండు పథకాలకు రూ.12,401 కోట్లు ఖర్చుపెట్టాం. 


*11.02 లక్షల మంది పిల్లలకు రూ.694 కోట్ల లబ్ది జరిగేలా...*

ఇవాళ అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గత త్రైమాసికం అంటే 2022 జూలై నుంచి సెప్టెంబరు వరకు సంబంధించిన మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంటే... జగనన్న విద్యా దీవెన డబ్బును 11.02 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరేలా రూ.694 కోట్లు పిల్లల తల్లుల ఖాతాల్లోకి నేరుగా బటన్‌ నొక్కి జమ చేస్తున్నాను.


*జవాబుదారీతనం పెరిగేలా..*

సంస్కరణలో భాగంగా మార్పులు తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తున్నాం. కాలేజీల్లో జవాబుదారీ తనం పెరిగే విధంగా, వసతులపై ఆ తల్లులు కాలేజీలను ప్రశ్నించే విధంగా వారికి హక్కులు కల్పిస్తూ.. ఆ పిల్లల చదువులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ పెరిగేలా చేస్తూ నేరుగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నాం. తల్లుల సాధికారతకు పట్టం కడుతూ ఆర్ధిక సాయం నేరుగా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తూ గొప్ప సంస్కరణకు నాంది పలికాం.

ఇక్కడ మరో విషయం చెప్పాలి. పిల్లలు చదవాలి. పిల్లల చదువులు కొరకు ప్రభుత్వం పెట్టే ఏ ఖర్చైనా కూడా నేను దాన్ని ఖర్చుగా భావించను. అది నేను నా పిల్లలకిచ్చే ఆస్తిగా భావిస్తాను.


*గొప్పగా చదవండి- మీ చదువులకి నేను పూచీ..*

ప్రతి చిట్టి చెల్లెమ్మకు, తమ్ముడికీ చెప్తున్నాను మీరు గొప్పగా చదవండి. మీ చదువులకి పూచీ నేనున్నాను. ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ చెప్తున్నా.. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఫర్వాలేదు అంతమందినీ చదివించండి. ఎంతమంది ఉన్నా వారిని  మీ అన్న చదివిస్తాడని భరోసా ఇస్తున్నాను.


తల్లులందరికీ ఇంకొక చిన్న విజ్ఞప్తి. ఈ రోజు నేను బటన్‌ నొక్కిన వెంటనే నేరుగా మీ ఖాతాల్లోకి పడుతున్న డబ్బును కాలేజీల ఫీజలు కొరకు అక్కడికి వెళ్లి, పిల్లలు ఎలా చదువుతున్నారో విచారణచేసి వారం, పదిరోజుల్లోపల ఆ డబ్బును కాలేజీలకు కట్టమని విజ్ఞప్తి చేస్తున్నాను. 

విద్యారంగంలో మార్పులు.. నాలుగు మాటల్లో.. 

విద్యారంగం మీద మన ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపిస్తుంది, ఈమూడున్నర సంవత్సరాల కాలంలో ఏరకమైన శ్రద్ధ చూపిస్తుంది, తీసుకొచ్చిన మార్పులేంటన్నది నాలుగు మాటలు మీకు వివరిస్తాను.


పిల్లల చదువుతోనే ఇంటింటా పేదల తలరాతలను మార్చాలని, వారి ఇంట వెలుగులు నింపాలని మంచి సంకల్పంతో ఇవాళ గవర్నమెంట్‌ బడుల రూపురేఖలు అన్నీ మారుస్తున్నాం. పునాదులు బలంగా ఉండాలని పోటీ ప్రపంచంలో మన పిల్లలు నిలదొక్కుకునే పరిస్థితి రావాలని బడులలో మొత్తం ఇంగ్లిషు మీడియం తీసుకొచ్చాం. సీబీఎస్‌ఈ సిలబస్‌ తీసుకొచ్చాం. బడుల రూపురేఖలు మారుస్తున్నాం. ఈ నిర్ణయంతో పాటు చదివించే తల్లులకు అండగా, తోడుగా నిలుస్తూ మీ పిల్లలను మీరు బడులకు పంపించండి. బడులకు పంపిస్తూ ప్రోత్సహిస్తున్నందుకు జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా మీకు తోడుగా ఉంటాం. ఇలాంటి జగనన్న అమ్మఒడి అనే పథకం ఒక్క మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలో లేదు.

 

ఇవికాక పిల్లల చదువుల విషయంలో సంస్కరణలు తీసుకొస్తూ.. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, మన బడి నాడు–నేడు, సీబీఎస్‌ఈ సిలబస్,  బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, బైజూస్‌తో ఒప్పందం, 8వతరగతి పిల్లలకు ట్యాబులు, డిజిటల్‌ క్లాస్‌రూములు వీటన్నింటితో స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం.


*పెద్ద చదువులు కోసం..* 

మన పిల్లలు ఇబ్బంది పడకూడదని జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెనతో వీటితోనే సరిపెట్టకుండా, మొత్తం ఉన్నత విద్యలో కరిక్యులమ్‌ అంతా కూడా జాబ్‌ ఓరియెంటెడ్‌గా మార్పులు చేస్తూ వచ్చాం. ఇవాళ మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... డిగ్రీలు చదివేటప్పుడే ఇంటర్న్‌షిప్‌ కోర్సులను మాండేటరీ చేశాం. ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ విత్‌ క్రెడిట్‌ ట్రాన్స్‌ఫర్‌ తీసుకొచ్చాం. ఆన్‌లైన్‌లో కూడా మంచి కోర్సులు ఎక్కడున్నాయా అని వెదికిపట్టుకుంటున్నాం. వాటిని కూడా మన పిల్లలకు నేర్పిస్తూ.. వాటికి కూడా క్రెడిట్‌ ట్రాన్స్‌ఫర్‌ కింద అనుమతులు ఇస్తున్నాం.

మైక్సోసాప్ట్, ఆమోజాన్‌ వెబ్‌ సర్వీసెస్, సేల్స్‌ ఫోర్స్‌ లాంటి ప్రఖ్యాత గాంచిన సంస్ధలందరితో సర్టిఫైడ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులును మన పిల్లలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. వీటన్నింటితో విద్యారంగాన్ని ఉపాధికి చేరువగా తీసుకునిపోతున్నాం.  ఇవాళ ఈ మూడున్నర సంవత్సరాలకాలం పాలనలో నేను గర్వంగా చెప్తున్నాను.. ఇవన్నీ ఎంత గొప్పగా జరుగుతున్నాయంటే.. మూడున్నర సంవత్సరాల కాలంలో ఇన్ని పథకాలుతో తీసుకొస్తున్న మార్పు వెనుక రాష్ట్రంలో పిల్లలందరి భవిష్యత్‌ పట్ల, మనందరి ప్రభుత్వం తీసుకుంటున్న బాధ్యత కనిపిస్తుంది.


*మూడున్నరేళ్లలో విద్యమీద ఖర్చు రూ.55 వేల కోట్లు..*

ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఈ పథకాల మీద మీ జగనన్న ప్రభుత్వం చేస్తున్న ఖర్చు... రూ.55వేల కోట్లు. 


*జగనన్న అమ్మఒడి ద్వారా..*

ఈ పథకం ద్వారా రూ.19,617 కోట్లు ఖర్చు చేస్తే.. జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.9051 కోట్లు, జగనన్న వసతి దీవెన ద్వారా మూడున్నర సంవత్సరాల్లో రూ.3349 కోట్లు, జగనన్న విద్యా కానుక ద్వారా మరో రూ.2368 కోట్లు ఖర్చు చేశాం.

ఎనిమిదో తరగతి పిల్లలకు  ఉపాధ్యాయులకు ట్యాబులు ఇచ్చేందుకు మరో రూ.685 కోట్లు ఈ డిసెంబరులో ఖర్చు చేయబోతున్నాం.

జగనన్న గోరుముద్ద ద్వారా మరో రూ.3239 కోట్లు, పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా మొదటి ఫేజ్‌లో రూ.3669 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశాం. ఈ సంవత్సరం నాడు–నేడు ఫేజ్‌ 2 కింద మరో రూ.8వేలు కోట్లు ఖర్చు చేయబోతున్నాం.

వైఎస్సార్‌ సంపూర్ణపోషణం కోసం మరో రూ.4895 కోట్లు, శానిటరీ నేప్‌కిన్స్‌ అందించే స్వేచ్చ అనే కార్యక్రమం కోసం మరో రూ.32 కోట్లు ఖర్చు చేస్తూ... వెరసి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలోనే ఈ పథకాల కోసం విద్యారంగంలో చేసిన ఖర్చు రూ.55వేల కోట్లు. 


ఇంత ధ్యాసపెడుతున్నాం కాబట్టే... మనందరి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఏటా మూడులక్షల మంది పిల్లలు డిగ్రీ పట్టాలు అందుకుంటే అందులో 37 వేల మందికి మాత్రమే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి గతంలో చూసేవాళ్లం. 

మొన్న 2021–22 మన ప్రభుత్వంలో గతేడాది గమనిస్తే క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా 85 వేల మంది పిల్లలకు ఉద్యోగాలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా వస్తున్నాయి. 37 వేల ఉద్యోగాలు ఎక్కడ ? ఈ రోజు  ఏడాదికి 85వేల మందికి క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అన్నది ఒక్కసారి గమనించండి. 


*ఇక చివరిగా... ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి రెండు మాటలు చెపుతాను.* 

అక్షరాలు రాయడం, అక్షరాలు చదవడం మాత్రమే విద్యకు పరమార్ధం కాదు. తనకు తానుగా ప్రతిపాప, ప్రతిబాబు ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే శక్తిని ఇవ్వగలగడమే విద్యకు పరమార్ధం అని చెప్పి ప్రపంచ ప్రఖ్యాత ఫిజిసిస్ట్‌ ఆల్బర్ట్‌ ఐన్‌స్టైన్‌ చక్కగా డిఫైన్‌ చేశాడు.

ఈ రోజు రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే.. కొరవడిన అటువంటి ఆలోచనా శక్తి, కొరవడిన అటువంటి వివేకం ప్రతిపక్షాలకు ఎప్పటికైనా రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.


పేదల పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదవడానికి వీల్లేదని వాదించే మనుషులు  సంస్కారాలు మారాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. నా వారు మాత్రమే బాగుపడాలని కోరుకునే మనస్తత్వం నుంచి మనుషులంతా ఒక్కటే అన్న మానవతావాదంతో కూడిన జ్ఞానం వీరందరికీ రావాలని దోవుడని కోరుకుంటున్నాను.


*ప్రతిపక్షాలు ఎలా ఉన్నాయంటే..* 

ఫలానా ప్రాంతంలో.. ఫలానా పొలాల్లో.. ఫలానా రేటుకు నా భూములు అమ్మకునేందుకు మాత్రమే ఒక రాజధానికి కట్టాలన్న ఆలోచన నుంచి వీళ్లందరూ బయటపడేలా వీరికి ఆ దేవుడి జ్ఞానాన్ని, బుద్దిని పంచిపెట్టాలని కోరుకునే పరిస్థితి ఇవాళ ఉంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు రాజధానిలో ఇళ్ల స్ధలాలు ఇస్తామంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని, డెమొగ్రాఫిక్‌ ఇంబేలన్స్‌ వస్తుందని వాదించే మెదళ్లను మార్చగల చదువులు, జ్ఞానం, మంచి ఆలోచనలు ఇలాంటి వారికి రావాలని, ఇవ్వాలని దేవుడుని కోరుకుంటున్నాను.


*పెత్తందార్ల దుష్ప్రచారం....*

నవరత్నాల పాలనతో పేదలకు మనందరి ప్రభుత్వం మంచి చేస్తుంటే.. దాన్ని జీర్ణించుకోలేక, పేదలు బాగుపడ్డం తట్టుకోలేక, ఈ పెత్తందార్లు అంతా కలిసి దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్‌ బటన్‌ నొక్కడం మొదలుపెట్టి ప్రజలకు మంచి జరిగితే.. వీళ్లకు పుట్టగతులుండవని.. జగన్‌ బటన్‌ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందట? ఇదే రాష్ట్రం వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమెరికా అట ? ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ నిస్సిగ్గుగా అడ్డుకునే కార్యక్రమం చేస్తున్న వీరికి ఇంగితజ్ఞానం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను.


ౖ*రైతులు, పిల్లలు, మహిళలకు బాబు దగా....*

రైతులను మోసం చేసిన బాబు ఇవాళ వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు. పిల్లలకు అన్యాయం చేసిన చంద్రబాబు ఈరోజు ఎడ్యుకేషన్‌ గురించి మాట్లాడుతున్నాడు. అక్కచెల్లెమ్మలకు ద్రోహం చేసిన ఈ బాబు.. దగా చేసిన బాబు, ఇవాళ మహిళాసాధికారత గురించి మాట్లాడుతున్నాడు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలను అవమానించి అన్యాయం చేసిన బాబు ఈరోజు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు.


*ఇదేమి ఖర్మరా బాబూ ?* 

ఇలాంటి వాళ్లు ఈరోజు లెక్చర్లు దంచుతుంటే.. రాష్ట్ర ప్రజలంతా ఇదేమి ఖర్మరా బాబూ ? అని అనుకుంటున్నారు. 

ఇలాంటి కుళ్లిపోయిన పెత్తందారీ మనస్తత్వం ఉన్న బాబు, దత్తపుత్రుడు, ఈనాడు,ఆంధ్రద్యోతి, టీవీ 5లు చేస్తున్న దుష్ప్రచారాలకు నేను మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను.

దయచేసి వీరి మాటలు నమ్మనే నమ్మొద్దు. 


*మీకు మంచి జరిగింగా లేదా ఒక్కటే కొలమానం..*

కేవలం ఒక్కటే కొలమానంగా తీసుకొండి. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నదే ఒక్కటే కొలమానంగా తీసుకొండి. 

మీ ఇంట్లో మంచి జరిగితే జగనన్నకు తోడుగా ఉండండి. ఇవాళ మనం యుద్ధం చేస్తున్నది మంచి వాళ్లతో కాదు..  రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నాం. ఈ రోజు చెడిపోయి ఉన్న రాజకీయ వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నాం. అందరూ ఇది గుర్తుపెట్టుకొండి.


ఇంతక ముందు కూడా ఇటువంటి ప్రభుత్వమే ఉండేది. ఇంతకముందు కూడా రాష్ట్రానికి ఒక బడ్జెట్‌ ఉండేది. మరి అప్పుడు పాలకులు ఎందుకు జగన్‌ మాదిరిగా నేరుగా బటన్‌ నొక్కి.. మా బ్యాంకు ఖాతాల్లోకి ఎందుకు డబ్బులు వచ్చేటట్టుగా మంచి చేయలేకపోయారన్నది ఆలోచన చేయండి. 


*గజదొంగల ముఠా– దుష్ట చతుష్టయం...*

కారణం అప్పుడున్న గజదొంగల ముఠా. ఆ గజదొంగల ముఠాకు దుష్టచతుష్టయం అని పేరు. అందులో ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, చంద్రబాబు.

ఈ గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అనే పద్ధతిలో దోచేసేవారు. అందుకే ఆ రోజు బటన్లు లేనూ, నొక్కేవారూ లేరు. ప్రజలకు నేరుగా మంచి జరగాలని చేసే ఆలోచనలు లేవు.

వాళ్లు చేస్తున్న దౌర్భాగ్యపు రాజకీయాలను కూడా ఎవ్వరూ రాయరు, ఎవ్వరూ చూపరు, ఎవ్వరూ ప్రశ్నించేవారు కూడా లేరు.

అటువంటి రాజకీయాలతో ఈరోజు యుద్ధం చేస్తున్నాం.

ఇవాళ మీ బిడ్డ ఇటువంటి పత్రికలను నమ్ముకోలేదు, టీవీఛానెళ్లనూ నమ్ముకోలేదు. దత్తపుత్రుడినీ అంతకన్నా నమ్ముకోలేదు. 


*మీ బిడ్డ దేవుడ్ని, మిమ్నిల్నే నమ్ముకున్నాడు...*

 మీ బిడ్డను నమ్ముకున్నది ఎవరైనా ఉన్నారంటే.. దేవుడిని నమ్ముకుంటాడు, ఆ తర్వాత మిమ్నలను నమ్ముకున్నాడు. 


మీ బిడ్డకు పొత్తు ఎవరితో ఉంటుందంటే.. అది మీతోనే ఉంటుంది. మీ బిడ్డకు వీళ్ల మాదిరిగా టీవీఛానెళ్లు తోడుగా ఉండకపోవచ్చూ, వీళ్ల మాదిరిగా పేపర్లు అండగా ఉండకపోవచ్చు, దత్తపుత్రుడి లాంటి వాడు తోడు ఉండకపోవచ్చు.. కానీ మీ బిడ్డకు నిజాయితీ ఉంది. మీ బిడ్డ ఏదైతే చెబుతాడో అది చేసి చూపిస్తాడు.

ఆ రకంగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశాం. దాన్ని ఒక భగవద్గీతగానూ, ఖురాన్‌గానూ, బైబిల్‌గానూ భావించాను.



*98 శాతం హామీలను అమలు చేశాం ఆశీర్వదించండి.*

ప్రభుత్వంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో 98 శాతం హామీలను పూర్తిగా అమలు చేసిన తర్వాతనే మీ బిడ్డ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ మీ ఇంటి గడపవద్దకు వచ్చి మీకు ఈ మంచి అంతా మీకు జరిగిందా చెల్లమ్మా ? అని అడుగుతున్నారు. అలా అడుగుతూ మీ బిడ్డ ప్రభుత్వాన్ని దీవించమని మీ అందరి ఆశీస్సులు కూడా తీసుకుంటున్నారు.


తేడా గమనించండి. గతంలో  ఎన్నికలప్పుడు మాట ఇచ్చేవారు. ఇచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేవారు. ఎందుకు ఇలా చేశావని అడిగివారూ లేరు, చూపించేవారూ లేరు. చివరికి రాసేవారూ లేరు. అలాంటి పరిస్థితి నుంచి రాజకీయాల్లోకి ఇవాల మొట్టమొదటిసారిగా జవాబుదారీతనం తీసుకొచ్చింది మీ బిడ్డే. 

ఇలాంటి మీ బిడ్డను, మీ ప్రభుత్వాన్ని దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వానికి ఉండాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను.



*ఇక చివరిగా..* 

కాసేపటి క్రితం నా సోదరుడు, ఎమ్మెల్యే నవాజ్‌ మదనపల్లి అభివృద్ధికి కొన్ని కార్యక్రమాలు అడిగారు. మెడికల్‌ కాలేజీ ఇప్పటికే మంజూరు చేశాం. ఇది కూడా శంకుస్ధాపనకు అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఈ నెలలోనే పనులు మొదలవుతున్నాయి. అదేవిధంగా అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో నీళ్లు పడాలంటే రెండువేల అడుగులు లోతుకు పోతే తప్ప తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని మార్చాలన్న తపనతో  వాటర్‌ గ్రిడ్‌ కోసం.. రూ.1800 కోట్లు మంజూరు చేసాం. ఇందులో మదనపల్లెకే రూ.400 కోట్లు వస్తుంది. మున్సిపాల్టీ అభివృద్ధి కోసం రూ.38 కోట్లు ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మొలకలచెరువు నుంచి మదనపల్లె ఎన్‌హెచ్‌ రోడ్డుకు రూ.400 కోట్లతో, మదనపల్లె– తిరుపతి ఎన్‌హెచ్‌ రోడ్డుకు మరో రూ.1600 కోట్లతో మంజూరు ఇప్పించాం. మీ అందరి కోరిక మేరకు మదనపల్లె బీటీ కాలేజీ కూడా ప్రభుత్వంలో విలీనం చేశాం. మదనపల్లె టిప్పుసుల్తాన్‌ మసీదు కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నాం. మదనపల్లె నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం రూ.30 కోట్ల ప్రతిపాదనలు ఇచ్చారు. వాటిని కూడాఆమోదిస్తున్నాను. మదనపల్లె టౌన్‌ పరిధిలో 3 బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయి వాటిని పూర్తి చేయడం కోసం మరో రూ.14 కోట్లు అడిగారు . అదీ మంజూరు చేస్తున్నాం. అదే విధంగా బహుదా నదిమీద బ్రిడ్జి కోసం అవసరమైన మరో రూ.7 కోట్లు కూడా ఇస్తున్నాం. వీటి ద్వారా మదనపల్లెకి మంచి జరగాలని కోరుకుంటున్నానంటూ సీఎం ప్రసంగం ముగించారు.

Comments