గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా 100వ రోజుకు చేరింది



నెల్లూరు, డిసెంబర్ 30  (ప్రజా అమరావతి): రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వినూత్నంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా 100వ రోజుకు చేరింద


ని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  పేర్కొన్నారు. 


శుక్రవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం  నరుకూరు గ్రామంలో  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించిన  మంత్రికి గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.  


తొలుత గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా 100 కేజీల కేక్ ను కట్ చేసిన మంత్రి, భారీగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ   అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వినూత్నంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా తెలుసుకోవడం, అందకపోతే కారణాలు తెలుసుకొని అర్హులందరికీ అందించడమే ధ్యేయంగా ప్రతి గడపకు వెళుతున్నామన్నారు. మూడేళ్ల పాలన పూర్తయిన తర్వాత ప్రజల వద్దకు తామంతా ధైర్యంగా వెళ్లేలా ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. దీంతో ఏ గడపకు వెళ్లిన తమకు ప్రజల నుంచి అపూర్వస్పందన లభిస్తుందని, ఇదే తమ ప్రభుత్వ చిత్తశుద్ధిపాలనకు నిదర్శనం అన్నారు. చెప్పిన హామీలన్నిటిని తూచా తప్పకుండా ముఖ్యమంత్రి అమలు చేశారన్నారు. జనవరి ఒకటి నుంచి 250 రూపాయలు పెంచి 2750 రూపాయలు సంక్రాంతి కానుకగా అందచేస్తున్నట్లు చెప్పారు.  అర్హత ఒకటే ప్రామాణికంగా ఎటువంటి దళారులు, నాయకులు లేకుండా నేరుగా  సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల అభివృద్ధి, సమగ్రంగా సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. 


ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హేమలత, ఎంపీపీ స్వర్ణలత, జడ్పిటిసి శేషమ్మ, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


Comments