ధాన్యం కొనుగోలు పరిశీలించిన కలెక్టర్, జెసి



*ధాన్యం కొనుగోలు పరిశీలించిన కలెక్టర్, జెసి*



పార్వతీపురం, డిసెంబరు 1 (ప్రజా అమరావతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ గురు వారం స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ పార్వతీపురం మండలం పుట్టురు గ్రామంలో పరిశీలించగా, జాయింట్ కలెక్టర్ కొమరాడ మండలం అర్తాంలో  పరిశీలించారు. క్షేత్రస్థాయిలో కొనుగోలు, రవాణా, నాణ్యత, తేమ పరీక్షలు నిర్వహణ, సిబ్బంది లభ్యత తదితర అంశాలను వివరంగా పరిశీలించారు. అందులో సమస్యలు, నివారణ ఏవిధంగా చేపట్టాలి అనే అంశాన్ని స్వయంగా తెలుసుకున్నారు. సమస్యలను సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు పక్కాగా జరగాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 306 రైతు భరోసా కేంద్రాలు ఉండగా ఏ, బి, సి కేటగిరీలలో 188 రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. ఇందులో పి.ఏ.సి ల ఆధ్వర్యంలో 106, గిరి వెలుగు ఆధ్వర్యంలో 12, జిసిసి ఆధ్వర్యంలో 19, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 4, రైతు ఉత్పాదక సంఘం (ఎఫ్.పి.ఓ) ఆధ్వర్యంలో 47 ఉన్నాయని తెలిపారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నాణ్యతా ప్రమాణాలు చూసే పరికరాలను సరఫరా చేసామని చెప్పారు. రవాణా, హమాలీ లను ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రైతులు గిట్టుబాటు ధరకు మాత్రమే విక్రయించాలని ఆయన సూచించారు. రైతులు అనవసరంగా నష్టపోరాదని జిల్లా కలెక్టర్ సూచించారు.  


ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం. దేవుళ్ల నాయక్, వ్యవసాయ ఎడి వెంకటేష్, వ్యవసాయ అధికారి రేఖ, సిబ్బంది పాల్గొన్నారు.

Comments