*- ఐదు కోట్ల మంది ప్రజల కోసమే నారా లోకేష్ పాదయాత్ర*
*- యువగళంతో రాష్ట్రంలో యువతకు భరోసా*
*- ప్రజలంతా భావి నాయకుడిని ఆశీర్వదించండి*
*- మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పిలుపు*
*- గుడివాడలో యువగళం పోస్టర్ల ఆవిష్కరణ*
గుడివాడ, డిసెంబర్ 30 (ప్రజా అమరావతి): ఐదు కోట్ల మంది ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో యువగళం పోస్టర్లు, ప్రచార చిత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రావి విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 1.50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం నుండి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. యువగళం పేరుతో 400 రోజుల పాటు దాదాపు 4వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే యువత శక్తి సామర్ధ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. యువగళం ద్వారా రాష్ట్రంలోని యువతకు నారా లోకేష్ నాయకత్వం వహించనున్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 6లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. 17 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయన్నారు. ప్రస్తుతం యువత నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోందన్నారు. యువతలో భరోసాను నింపేందుకు యువగళం పాదయాత్ర దోహదపడుతుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ యువత సమస్యలపై తెలుగుదేశం పార్టీ అనేక పోరాటాలు చేసిందన్నారు. పాదయాత్ర చేయడం ద్వారా యువతను నారా లోకేష్ ఏకతాటి పైకి తీసుకురానున్నారని తెలిపారు. రాష్ట్రంలోని యువత ఆలోచనలను నిజం చేసే శక్తి నారా లోకేష్ కు మాత్రమే ఉందని గుర్తుచేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ప్రస్తుతం "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమం కూడా అంతకు మించిన స్థాయిలో ప్రజల్లోకి చేరువ అయిందని అన్నారు. యువగళం పాదయాత్ర కూడా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా విజయవంతం కానుందని తెలిపారు. 400 రోజుల పాటు నారా లోకేష్ ప్రజల మధ్యలోనే గడపనున్నారని చెప్పారు. పాదయాత్రలో యువతీ యువకులంతా పాల్గొని భావి నాయకుడు నారా లోకేష్ ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్రలో అన్నిరంగాల సమస్యలను నారా లోకేష్ అధ్యయనం చేస్తారని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా అందాయన్నారు. వైసీపీ ప్రజావ్యతిరేక పాలనపై నారా లోకేష్ అవగాహన కల్పిస్తారన్నారు. రాష్ట్రంలో యువత మరింత చైతన్యవంతమైన పాత్ర పోషించనుందని చెప్పారు. యువత అన్నిరంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో చంద్రబాబు హయాంలో ఐటీ రంగాన్ని మరింత ప్రోత్సహించడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని, యువతను అన్నిరంగాల్లో ప్రోత్సహించడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రావి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దింట్యాల రాంబాబు, వాసే మురళి, దానేటి సన్యాసిరావు, గోవాడ శివ, శొంఠి రామకృష్ణ, వసంతవాడ దుర్గారావు, పొట్లూరి వెంకట కృష్ణారావు, అడుసుమిల్లి శ్రీనివాసరావు, పండ్రాజు సాంబశివరావు, పోలాసి ఉమామహేశ్వరరావు, జానీ షరీఫ్, యార్లగడ్డ సుధారాణి, గొర్ల శ్రీలక్ష్మి, అసిలేటి నిర్మల, తులసీరాణి, ఎం ఇస్సాక్, కంచర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment