అది ముమ్మాటికి వైకాపా వికృత రాజకీయం లో భాగమే : నాదెండ్ల మనోహర్‌

 అది ముమ్మాటికి వైకాపా వికృత రాజకీయం లో భాగమే : నాదెండ్ల మనోహర్‌



అమరావతి (ప్రజా అమరావతి): చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ ఇంటిపై దాడి.. వైకాపా  సర్కారు ఆలోచనా విధానాన్ని మరోసారి బయటపెట్టిందని జనసేన  రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌  విమర్శించారు.మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రైతు సభ నిర్వహించాలనుకోవడమే రామచంద్ర యాదవ్‌ చేసిన నేరమా? అని నిలదీశారు. ఆయనపై దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు మనోహర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

''ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారు.. ఎదిరించి నిలబడితే ఆస్తులు ధ్వంసం చేస్తారా? ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు పెట్టుకోవడమే నిషిద్ధమా? రామచంద్ర ఇంటిపై వైకాపా మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇది ముమ్మాటికీ వైకాపా వికృత రాజకీయంలో భాగమే. ప్రశ్నించేవారు లేకుండా చేసుకునే కుట్రలో భాగంగానే ఇలా దాడులకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యం ప్రసాదించిన విలువలు, వాక్‌ స్వాతంత్ర్యంపై జరిగిన దాడిగానే జనసేన భావిస్తోంది. ఇలాంటివి పునరావృతం కాకుండా అందరూ దాడిని ఖండించాలి'' అని నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు..


ఏం జరిగిందంటే..


గత ఎన్నికల్లో జనసేన తరఫున చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి పోటీ చేసిన పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ రైతుల సమస్యలపై సదుంలో తలపెట్టిన రైతుభేరిని అనుమతి లేదంటూ ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. ఇంతలో వైకాపాకు వ్యతిరేకంగా సభ తలపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం రాత్రి వైకాపా కార్యకర్తలు పుంగనూరు పట్టణం కొత్తిండ్లు ఎల్‌ఐసీ కాలనీలో రామచంద్ర యాదవ్‌ కొత్త ఇంటికి వెళ్లి విధ్వంసం సృష్టించారు. కర్రలు, రాళ్లతో తలుపులు, అద్దాలు పగలకొట్టి లోపలకు వెళ్లి, ఫర్నిచర్‌ను విరగకొట్టారు. ఆవరణలోని ఆరు కార్లను ధ్వంసం చేశారు. రామచంద్ర ఓ గదిలో ఉండి ప్రాణాలతో బయటపడ్డారు. తమ నాయకుడు సదుం వెళ్లకుండా పుంగనూరులోని ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించి అడ్డుకున్న పోలీసులు.. వైకాపా శ్రేణులు ఇంత విధ్వంసానికి దిగినా కళ్లప్పగించి చూస్తుండిపోయారని రామచంద్ర మద్దతుదారులు మండిపడ్డారు.

Comments