రైతులకు ఇబ్బందులు కలుగకుండా వరి ధాన్యం సేకరణ చేపట్టాలి -- జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి


 రైతులకు  ఇబ్బందులు కలుగకుండా వరి ధాన్యం సేకరణ చేపట్టాలి


-- జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి

మంగళగిరి (ప్రజా అమరావతి);

 రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వారి నుండి వరి ధాన్యం సేకరణ సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. 

  మంగళవారం మంగళగిరి మండలం రామచంద్రాపురం గ్రామ పంచాయితీ వద్ద ఉన్న వరి ధాన్య సేకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ శివ నారాయణ శర్మతో కలసి పరిశీలించారు.


 వరి ధాన్యం సేకరణలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అక్కడ ఉన్న రైతులను జిల్లా కలెక్టర్ అడిగారు.


 గ్రామ రైతు భీమి రెడ్డి అంజి రెడ్డి జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ తాను రెండున్నర ఎకరాల్లో వరి పంట పండించడం జరిగిందని, ఒక ఎకరాకు 32 బస్తాలు కాగా,  ఒక్కొక్క బస్తా 75 కేజీల ప్రకారం వరి ధాన్యాన్ని ఈ సేకరణ  కేంద్రానికి  ఇవ్వడం జరిగిందని తెలిపారు. 


 హమాలీలను, ట్రాన్స్పోర్ట్ కొరకు  ట్రాక్టర్లను రైతులు పెట్టుకున్నారని, వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు అయిన ఖర్చును  చెల్లించడం జరుగుతుందని అగ్రికల్చర్ అధికారిణి శైలజ రాణి జిల్లా కలెక్టర్ కు వివరించారు. 


కొంత మంది ప్రైవేటు వ్యక్తులు 77 కేజీల వరి ధాన్యాన్ని రూ.1150/-  నుండి 1200 /- ల వరకు కొంటామని తెలుపుతున్నట్లు రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

 ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుకు క్వింటాలుకు గ్రేడ్ ఏ రకం రూ.2060/- మరియు సాధారణ రకానికి రూ.2040/- లు ఇస్తున్నందున ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర ఎక్కువగా వుందని, ఇది రైతులకు ఏంతో మేలు కలిగిస్తుందని రైతులు సంతోషాన్ని  వ్యక్తం చేసారు. 


 రైతులు కోసిన వరి ధాన్యాన్ని సమీప ప్రాంతంలో ఆరబెట్టుకోవడానికి అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. 


 ఇందుకు సంబంధించి సచివాలయానికి ఎదురుగా ఉపాధి హామీ పధకం ద్వారా నిర్మించిన గ్రామ పార్క్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించడం జరిగింది. 

వరి ధాన్య సేకరణకు సంబంధించి నిర్వహిస్తున్న రిజిష్టర్లు, రికార్డులను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించడం జరిగింది.


   రైతు నుండి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి ప్రభుత్వం నిర్దేశించిన 21 రోజుల లోపు రైతు ఖాతాలకు నేరుగా చెల్లింపులు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రైతులకు ఈ సందర్భంగా వివరించడం జరిగింది. 

  ఈ కార్యక్రమంలో మంగళగిరి తహశీల్దార్ రామ్ ప్రసాద్, యంపీడీఓ రామ్ ప్రసన్న, అగ్రికల్చర్ అధికారిణి శైలజ రాణి,  మార్కెటింగ్ శాఖ, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

Comments