*స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ), ఎక్సైజ్ శాఖపై క్యాంప్ ఆఫీస్‌లో సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్ష*:
*నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలి*
*ఎక్కడా మాదక ద్రవ్యాలు వినియోగం ఉండొద్దు*
*ఆ లక్ష్యంతోనే పోలీస్, ఎక్సైజ్ శాఖలు పని చేయాలి*
*సీఎం శ్రీ వైయస్ జగన్ వెల్లడి*
*ప్రతి కాలేజీ, ప్రతి వర్సిటీలో భారీ హోర్డింగ్స్ పెట్టాలి*
*ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ను బాగా ప్రచారం చేయాలి*
*నార్కొటిక్స్‌పై పూర్తి అవగాహన కల్పించాలి*
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఆదేశం*
*పోలీస్, ఎక్సైజ్, ఎస్‌ఈబీ పూర్తి సమన్వయంతో పని చేయాలి*
*వారంలో ఒకరోజు తప్పనిసరిగా సమావేశం కావాలి*
*వారంలో మరో రోజు పోలీస్ శాఖలో ఉన్నత స్థాయి సమీక్ష*
*ఇక నుంచి రెగ్యులర్‌గా ఈ కార్యక్రమాలు జరగాలి*
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ నిర్దేశం*
*అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలి*
*ఎక్కడా గంజాయి సాగు జరగకుండా చూడాలి*
*వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలి*
*సచివాలయాల మహిళా పోలీస్‌లనూ సమన్వయం చేయాలి*
*వారిని ఇంకా సమర్థంగా వినియోగించుకోవాలి*
*మహిళా పోలీస్‌ల పనితీరు ఇంకా మెరుగుపర్చాలి*
*దిశ చట్టం, యాప్ ఇంకా సమర్థంగా అమలు కావాలి*
*సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్ జగన్*
అమరావతి (ప్రజా అమరావతి);
*ఎస్‌ఈబీ, ఎక్సైజ్ శాఖపై సమీక్ష సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే..*:
*ఈ 4 చాలా ముఖ్యం:*
నార్కొటిక్స్‌తో పాటు, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరి కట్టడం, మరింత సమన్వయంతో సచివాలయాల్లోని మహిళా పోలీస్‌ల పనితీరును మెరుగుపర్చడం, దిశ చట్టం, యాప్‌లను మరింత పక్కాగా అమలు చేసేలా చూడడం.. ఈ నాలుగింటిపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలి.
రాష్ట్రాన్ని నార్కొటిక్స్ రహిత ప్రాంతంగా తీర్చి దిద్దడంలో ఎక్సైజ్, ఎస్‌ఈబీ అధికారులతో పోలీస్ శాఖ మరింత సమన్వయంతో పని చేయాలి. అదే విధంగా దిశ యాప్ వినియోగం, కాల్స్, వేగంగా స్పందించడం వంటి వాటిపై అన్ని చోట్లా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి.
*వారంలో రెండు సమావేశాలు*:
ఇందు కోసం ప్రతి మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించాలి. అక్రమ మద్యం నియంత్రణ దిశలో ఎస్‌ఈబీ. ఎక్సైజ్ అధికారులు తీసుకున్న చర్యలు, గంజాయిసాగు అరికట్టడంపై వంటి వాటిని సమీక్షించాలి. ఆ తర్వాత ప్రతి గురువారం పోలీస్ ఉన్నతాధికారులు సమావేశం కావాలి. జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. నార్కొటిక్స్, అక్రమ మద్యాన్ని అరి కట్టడం, సచివాలయాల మహిళా పోలీసులతో సమన్వయం, దిశ చట్టం, యాప్ ఇంకా సమర్థ వినియోగంపై సమీక్షించాలి. ఇక నుంచి ఇవన్నీ రెగ్యులర్‌గా జరగాలి.
*కాలేజీలు, వర్సిటీల్లో ప్రచారం*:
ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్: 14500తో పాటు, నార్కొటిక్స్ నియంత్రణపై అన్ని కాలేజీలు, యూనివర్సిటీల వద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి. ఎక్కడా, ఏ ఒక్క విద్యార్థి నార్కొటిక్స్ వినియోగించకుండా చూడాలి. రాష్ట్రాన్ని వచ్చే మూడు, నాలుగు నెలల్లో నార్కొటిక్స్ రహిత ప్రాంతంగా తీర్చి దిద్దాలి. అదే లక్ష్యంతో పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు పని చేయాలి. మన యూనివర్సిటీలు, కాలేజీలు.. అన్నీ జీరో నార్కొటిక్స్‌గా ఉండాలి. అదే ఆయా శాఖల లక్ష్యం కావాలి. ఇందు కోసం నెల రోజుల్లో అన్ని కాలేజీలు, వర్సిటీల్లో హోర్డింగ్‌ల ఏర్పాటు పూర్తి కావాలి.
*వాటిని పటిష్టం చేయాలి:*
మహిళా పోలీసులు, దిశ చట్టం, యాప్‌ను ఇంకా పటిష్టం చేయాలి. మహిళా పోలీసుల పనితీరు ఇంకా మెరుగుపర్చడంపై దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో దాదాపు 15 వేల మంది మహిళా పోలీస్‌లు ఉన్నారు. ఇంకా దిశ చట్టాన్ని ఇంకా బాగా అమలు చేయాలి. యాప్ డౌన్‌లోడ్స్ పెరగాలి.
*వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి*:
గంజాయిసాగుదార్లకు వ్యవసాయం, పాడి వంటి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలి. అప్పుడు వారికి శాశ్వత ఉపాధి కల్పించినట్లు కూడా అవుతుంది. గంజాయి సాగుదార్లను మార్చే విధంగా, ‘ఆపరేషన్ పరివర్తన్’ నిర్వహించాలి.
*ఎస్‌ఈబీ ఇంకా సమర్థంగా.*.:
అక్రమ మద్యం గురించి కానీ, పబ్లిక్ ప్లేసెస్‌లో మద్యపానం కానీ.. ఇసుక ఎక్కువ ధరకు అమ్మడం కానీ.. ఇలా దేనిపై ఫిర్యాదు వచ్చినా ఎస్‌ఈబీ అధికారులు వెంటనే స్పందించాలి. తగిన చర్య తీసుకోవాలి. ఆ విధంగా ఎస్‌ఈబీ మరింత సమర్థంగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఎస్‌ఈబీ పరిధి కేవలం లిక్కర్ వరకే కాకుండా నార్కొటిక్స్, గంజాయి, గుట్కాలు.. వంటి వాటి విషయాల్లో కూడా కఠినంగా వ్యవహరించాలి. లోకల్ ఇంటలిజెన్స్‌ను (నిఘా)ను బాగా వినియోగించుకోవాలి.
*ప్రత్యేక గుర్తింపు రావాలి*:
మనం చేసిన పనుల వల్ల అవార్డులు రావాలి. దేశంలో ఎక్కడ మన మాదిరిగా సచివాలయాల్లో మహిళా పోలీసులు లేరు. కాబట్టి వారిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. దాని వల్ల మంచి ఫలితాలు రాబట్టవచ్చు. దేశమంతా మనవైపు చూసేలా మన చర్యలు ఉండాలి. ఆ స్థాయిలో పనితీరు చూపాలి.
*ఆర్వోఎఫ్‌ఆర్ పట్టా భూములు:*
రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలకు 2.82 లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు ఇచ్చామన్న సీఎం, ఆ భూముల అభివృద్ధికి సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో మద్యం విక్రయాలు, అక్రమ మద్యం నియంత్రణ, ఆ దిశలో తీసుకున్న చర్యలు, గంజాయి సాగు ధ్వంసం, ఆ సాగుదార్లపై తీసుకున్న చర్యలు, కేసుల నమోదు.. వంటి అన్నింటిపై సమీక్షలో అధికారులు వివరించారు.
డిప్యూటీ సీఎం (ఎక్సైజ్ శాఖ మంత్రి) కె.నారాయణస్వామి, హోం మంత్రి తానేటి వనిత, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్ర«ధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ, ప్రొహిబిషన్–ఎక్సైజ్ కమిషనర్ వివేక్‌యాదవ్, అడిషనల్ డీజీపీ రవిశంకర్, ఎస్‌ఈబీ డైరెక్టర్ రమేష్‌రెడ్డితో పాటు, పలువురు అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
addComments
Post a Comment