జిల్లా పోలీస్ అధికారులు సమర్థవంతంగా నేరాలను కట్టడి చేశారు:జిల్లా ఎస్పీ

 బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం - బాపట్ల  (ప్రజా అమరావతి);


బాపట్ల జిల్లా ఎస్పీ గారి క్యాంపు కార్యాలయ సమావేశ మందిరము నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశములో జిల్లా పరిధిలో 2022 సంవత్సర కాలములో జరిగిన సంఘటనలు, కార్యక్రమాల గురించి, పోలీస్ వారు సాధించిన విజయాలు గురించి వివరించిన బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ .,*  


*జిల్లా పోలీస్ అధికారులు సమర్థవంతంగా నేరాలను కట్టడి చేశారు:జిల్లా ఎస్పీ


*


*రోడ్డు ప్రమాదాలను ప్రదమర్థంతో పోలిస్తే ద్వితీయార్థంలో గణనీయంగా తగ్గించగలిగాము: జిల్లా ఎస్పీ గారి*


*2023 సంవత్సర వార్షిక కేలండర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ గారు*  


ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు గత సంవత్సరంలో జరిగిన కేసుల గురించి మరియు ప్రస్తుత సంవత్సరం ఆ కేసులో ఉన్న పురోగతి గురించి వివరిస్తూ, 2021 సంవత్సరం చివరి ఆరు నెలలను, 2022 వ సంవత్సరం మొదటి ఆరు నెలలను, మరియు 2022 వ సంవత్సరం చివరి ఆరు నెలలు ఒకదానితో ఒకటి పోల్చి, గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసుల దర్యాప్తులో, నేర నియంత్రణలో మరియు శాంతి భద్రతల  పరిరక్షణలో ఎటువంటి పురోగతి సాధించాము అనే వాటిని అంకెలతో సహా, శాతాలతో సహా వివరించడం జరిగినది. 


*హత్య నేరాలు:*

2021 ద్వితీయార్ధంలో 12 హత్యలు, 2022 ప్రధమార్ధంలో 28 హత్యలు జరిగితే 2022 ద్వితీయార్ధంలో 12 హత్యలు జరిగాయి. దీనిని బట్టి చూస్తే 2022 ప్రధమార్ధంతో పోలిస్తే  57.14 % నేరాలు తగ్గాయి.


*ఉద్దేశపూర్వకంగా చేయని హత్యలు:*

2021 ద్వితీయార్ధంలో 3 కేసులు, 2022 ప్రధమార్ధంలో 2 కేసులు నమోదు అవ్వగా 2022 ద్వితీయార్ధంలో 1 కేసు నమోదు అయినది, దీనిని బట్టి చూస్తే 2022 ప్రధమార్ధంతో పోలిస్తే 50% నేరాలు తగ్గాయి. 


*హత్య ప్రయత్నాలు:*

2021 ద్వితీయార్ధంలో 21 కేసులు, 2022 ప్రధమార్ధంలో 21 కేసులు నమోదు అయితే 2022 ద్వితీయార్ధంలో 14 కేసులు నమోదు అయినవి. దీనిని బట్టి చూస్తే 2022 ప్రధమార్ధంతో పోలిస్తే  ౩౩.౩౩ % నేరాలు తగ్గాయి.


*కిడ్నప్ లు:*

2021 ద్వితీయార్ధంలో 20 కేసులు, 2022 ప్రధమార్ధంలో 16 కేసులు నమోదు అయితే 2022 ద్వితీయార్ధంలో 9 కేసులు నమోదు అయినవి. దీనిని బట్టి చూస్తే 2022 ప్రధమార్ధంతో పోలిస్తే 43.75 %  తగ్గాయి.


*అత్యాచార ఘటనలు:*

2021 ద్వితీయార్ధంలో 35 కేసులు, 2022 ప్రధమార్ధంలో 35 కేసులు నమోదు అయితే 2022 ద్వితీయార్ధంలో 16 కేసులు నమోదు అయినవి దీనిని బట్టి చూస్తే 54.28%  తగ్గాయి.


*అల్లర్లు:*

2021 ద్వితీయార్ధంలో 05 కేసులు, 2022 ప్రధమార్ధంలో 06 కేసులు నమోదు అవ్వగా 2022 ద్వితీయార్ధంలో 02 కేసులు నమోదు అయినవి దీనిని బట్టి చూస్తే 66.66% అల్లర్లు తగ్గాయి.


*తీవ్ర ఘాత నేరాలు:* 

2021 ద్వితీయార్ధంలో 51 కేసులు, 2022 ప్రధమార్ధంలో 44 కేసులు నమోదు అవ్వగా 2022 ద్వితీయార్ధంలో 14 కేసులు నమోదు అయినవి దీనిని బట్టి తీవ్ర ఘాత నేరాలు 68.18% తగ్గాయి.


*సాధారణ ఘాత నేరాలు:*

2021 ద్వితీయార్ధంలో 459 కేసులు, 2022 ప్రధమార్ధంలో 490 కేసులు నమోదు అవ్వగా 2022 ద్వితీయార్ధంలో 400 కేసులు నమోదు అయినవి దీనిని బట్టి సాధారణ ఘాత నేరాలు 18.36% తగ్గాయి.  


*చీటింగ్ కేసులు:* 

2021 ద్వితీయార్ధంలో 143 కేసులు, 2022 ప్రధమార్ధంలో 102 కేసులు నమోదవ్వగా 2022 ద్వితీయార్ధంలో 82 కేసులు నమోదైనవి దీనిని బట్టి చీటింగ్ కేసులు 19.60% తగ్గాయి. 


*మహిళల పట్ల జరిగిన నేరాలు:* 

2021 ద్వితీయార్ధంలో 432 కేసులు, 2022 ప్రధమార్ధంలో 427 కేసులు నమోదవ్వగా 2022 ద్వితీయార్ధంలో 328 కేసులు నమోదైనవి దీనిని బట్టి కేసులు 23.18% తగ్గాయి. 


*ప్రాపర్టీ కి సంబందించిన నేరాలు:* 

డబ్బు కోసం హత్య చేసే కేసులు, దోపిడీ, బందిపోటు నేరాలు, రాత్రి సమయంలో జరిగిన దొంగతనాలు, పగలు సమయంలో జరిగిన దొంగతనాలు మరియు సాదారణ దొంగతనాల విషయంలో  2021 ద్వితీయార్ధంలో ౩౦౦ కేసులు, 2022 ప్రధమార్ధంలో 291 కేసులు నమోదవ్వగా 2022 ద్వితీయార్ధంలో 283 కేసులు నమోదైనవి దీనిని బట్టి అన్ని కేసులలో పోల్చి చూసుకుంటే 04.43% ప్రాపర్టీ నేరాలు తగ్గాయి.


దొంగతనాలకి సంబందించిన కేసులలో 2021 వ సంవత్సరంలో 433 కేసులు నమోదు అవ్వగా వాటిలో 252 కేసులను చేదించడం జరిగినది. 2022 వ సంవత్సరంలో 539 కేసులు నమోదు అవ్వగా వాటిలో 343 కేసులను చేదించడం జరగగా గత సంవత్సరం తో పోలిస్తే 6.64% దొంగతనం కేసుల చేదన పెరిగింది. 


*సిసి కెమెరాలు:* 

 నేరాలను ఛేదించడానికి, నేరాలను అదుపు చెయ్యడానికి సిసి కెమెరాలు ఎంతగానో దోహద పడతాయి. 2022 ప్రధమార్ధనికి 453 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడి వుండగా, ద్వితీయార్ధంలో 208 సీసీ కెమెరాలు కొత్తగా ఏర్పాటు చేసినారు, ప్రస్తుతం  జిల్లాలో మొత్తం 661 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగినది. 


*పోక్సో కేసులు:*

బాపట్ల జిల్లా ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 51 పోక్సో కేసులు నమోదైనవి. ప్రస్తుత కేసులు మరియు గతంలో విచారణలో వున్న కేసులను సమర్ధవంతంగా దర్యాప్తు చేసి, 85 కేసులలో విచారణ పూర్తి చేయడం జరిగినది 31 కేసులలో విచారణ జరుగుతున్నది.


*వివిధ కేసులలో శిక్ష విధించబడిన ముద్దాయిలు* 

2022లో మొత్తం 1341 కేసులలో ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా పోలీస్ అధికారులు చర్యలు తీసుకున్నారు.   వాటిలో హత్య కేసులలోని 8 మందికి యావజ్జీవ కారాగార జైలు శిక్ష, రేప్ మరియు పోక్సో కేసులలో 1 జీవిత ఖైదు, ఇద్దరికీ 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష, ఇద్దరికీ 5సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించడం జరిగినది. ఇతర కేసులలో 1327 మందికి ఐదు సంవత్సరాలు, అంతకంటే కంటే తక్కువ శిక్ష పడినది.  


*రోడ్డు ప్రమాదాలు:* 

రోడ్డు ప్రమాదాలలో నమోదైన కేసులను పరిశీలించగా  2021 ద్వితీయార్ధంలో 346 రోడ్డు ప్రమాదాలలో 116 మంది మరణించగా, 368 మందికి గాయాలు అయినవి , 2022 ప్రధమార్ధంలో 390 రోడ్డు ప్రమాదాలలో 162 మంది మరణించగా, 388 మందికి గాయాలు అయినవి, 2022 ద్వితీయార్ధంలో 254 రోడ్డు ప్రమాదాలు సంభవించగ వాటిలో 101 మంది మరణించగా, 278 మందికి గాయాలు అయినవి, జిల్లా పోలీస్ అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న పటిష్ట చర్యల వలన 2022 సంవత్సరం ప్రధమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలో మరణాల శాతం 37.65 % తగ్గాయి, గాయపడి వారి సంఖ్య 28.35% నికి తగ్గింది.


*E- చలానాలు:* 

ఈ-చలానాలను పరిశీలించగా 2021 లో 1,08,817 చలానాలకు 1,75,58,510/- అపరాధ రుసుము విధించగా, 2022 లో 1,20,026 చలానాలకు 2,58,13,700/- అపరాధ రుసుము విధించడం జరిగింది వృద్ది 47 శాతం ఉంది.


*డ్రంక్ & డ్రైవ్ కేసులు:* 

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పరిశీలిస్తే 2020 లో 308 కేసులలో న్యాయస్థానం లో రూ:5,35,000/- జరిమానా విధించగా, 2021లో 173 కేసులలో న్యాయస్థానం లో రూ:6,15,300/- జరిమానా విధించగా, 2022లో  1135 కేసులలో న్యాయస్థానం లో రూ: 14,00,050/- జరిమానా విదించగ, కేసుల నమోదులో వృద్ది  556 % శాతంగా వుండగా, జరిమానా విషయంలో  127.50 % వృద్ది శాతంగా వుంది.


*లోక్- అదాలత్ లో పరిష్కరించబడిన కేసులు:* 

2020లో లోక్ ఆదాలతా లో మొత్తం 1945 కేసులు పరిస్కారం జరగగా, 2021లో 4709 కేసులు పరిస్కారం చెయ్యగా, 2022లో 12095 కేసులు పరిస్కారం చెయ్యడం జరిగింది.


*విచారణ దశలో వున్న కేసుల దర్యాప్తులో పురోగతి:* 

విచారణ దశలో ఉండే కేసులో వివరాలను పరిశీలించగా 2021 లో ప్రారంభంలో 3802 కేసులు వుండగా 7396 కేసులు రిపోర్ట్ అవ్వగా మొత్తం కేసులలో 6856 కేసుల దర్యాప్తు ముగించడం జరిగింది, 2022 సం. ప్రారంభంలో 4342 కేసులు విచారణ దశలో ఉండగా కొత్తగా 6704 కేసులు నమోదవ్వగ వాటిలో 7341 కేసులు విచారణ పూర్తి చేసినారు,  కేసులలో విచారణ 66.40 % గా వుంది.


*174 CR.P.C (అసాధారణ మరణాలు) కేసులు:* 

అసాధారణ మరణాలుకి సంబందించిన కేసులు పరిశీలించగా 2021 లో 764 కేసులు రిపోర్ట్ అవ్వగా మొత్తం కేసులలో 515 కేసుల దర్యాప్తు ముగించడం జరిగింది, 67.40 % కేసులలో విచారణ విచారణ ముగించడం జరిగింది. 2022 లో 639 కేసులు రిపోర్ట్ అవ్వగా మొత్తం కేసులలో 488 కేసుల దర్యాప్తు ముగించడం జరిగింది, 76.36 % కేసులలో విచారణ విచారణ ముగించడం జరిగింది.


*మిస్సింగ్ కేసులు:* 

మిస్సింగ్ కేసులు పరిశీలించగా 2021 లో 506 కేసులు రిపోర్ట్ అవ్వగా వాటిలో 334 కేసులు చేదించడం జరిగినది, 66 % కేసులలో దర్యాప్తు ముగించడం జరిగింది. 2022 లో 577 కేసులు రిపోర్ట్ అవ్వగా వాటిలో 394 కేసుల చేదించడం జరిగింది, కేసుల దర్యాప్తు 68.28 % ముగించడం జరిగింది.


*నాటు సార నియంత్రణలో తీసుకున్న చర్యలు:*

నాటు సారాకి సంబంధించి 2020లో పరిశీలిస్తే 70 కేసులు రిపోర్టు అవ్వగా 673 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని 700 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసినారు, 2021 లో పరిశీలిస్తే 34 కేసులు నమోదయి 341 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని 530 లీటర్ల బెల్లపు ఉటను  ధ్వంసం చేసినారు.

 2022 సంలో నూతన జిల్లాగా బాపట్ల ఏర్పడినప్పటి నుండి జిల్లా ఎస్పీ గారు నాటు సారా పై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో నాటు సారాను కూకటివేళ్లతో పికించి వేయాలని ఉద్దేశంతో జిల్లా పోలీస్ మరియు సబ్ అధికారులతో నాటు సార స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహింపజేసి నాటు సారా తయారీ, విక్రయాలకు పాల్పడే వారిపైన మరియు నాటు సారా తయారీకి అవసరమైన ముడి సరుకులు విక్రయించే వ్యాపారులపై మొత్తం 187 కేసులు నమోదు చేసి 814.55 లీటర్ల నాటు సారాను, 11030 కేజీ ల నల్ల బెల్లం సీజ్ చేసి, 16,898 లీటర్ల బెల్లపు ఊట ను ధ్వంసం చేసినారు. తరచూ నాటుసారా తయారీ క్రయ విక్రయాలకు పాల్పడే 13 మందిపై  పిడి చట్టం ప్రయోగించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది.

అంతేకాకుండా ఆపరేషన్ పరివర్తన 2.0 లో భాగంగా నాటు సారానే జీవనాధారంగా జీవిస్తున్న 64 కుటుంబలకు ప్రత్యామ్నాయ జీవనాధారం చూపించాలన్న ఉద్దేశంతో పశువులను కొనుగోలుకు, పాల డైరీ, టిఫిన్ సెంటర్ లు, కిరాణా షాపులు, కూరగాయలు కొట్టులు  ఏర్పాటు చేసుకోవడానికి, ఆటోలు, కుట్టు మిషన్లు కొనుగోలు చేసుకోవడానికి  బ్యాంకుల ద్వారా 68,70,000/- రుణాన్ని మంజూరు చేయించి వారిని నాటుసారా కాసే జీవన విధానం నుండి ప్రత్యామ్న్యాయ మార్గం చూపించడం జరిగినది. 


బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో ప్రాణాలకు తెగించి 20 మందిని కాపాడిన జిల్లా పోలీసులు.

బాపట్ల జిల్లాలో సుమారు 74 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉన్నది. బాపట్ల జిల్లాలో సూర్యలంక బీచ్, రామాపురం బీచ్, వాడరేవు ప్రసిద్ధి చెందినవి ఇక్కడ మెరైన్ పోలీసులతో పాటు స్థానిక పోలీసుల ఔట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి, సముద్రంలో నిర్దిష్ట లోతును దాటి యాత్రికులు సముద్రంలోకి వెళ్లకుండా ఎర్రజెండాలను ఏర్పాటు చేయడం జరిగింది. యాత్రికుల రాకపోకలను గమనించేందుకు వాచ్ టవర్లను ఏర్పాటు చేయడం జరిగింది, మునిగిపోతున్న పర్యాటకులను అత్యవసరంగా రక్షించేందుకు గజ ఈతగాళ్లను నియమించడం జరిగింది, సముద్రంలో గస్తీ కోసం ప్రైవేట్ బోట్లను కూడా వినియోగించడం జరుగుతుంది, ఏప్రిల్ 2022 నుండి ఇప్పటివరకు జరిగిన వివిధ ఘటనలో సూర్యలంక బీచ్ తో పాటు వాడరేవు రామాపురం బీచ్లలో సుమారు 20 మందికి పైగా వ్యక్తులను పోలీసులు ప్రాణాలకు తెగించి రక్షించారు. 


*మహిళా పోలీస్ డ్యూటీ ట్రాకర్*

జిల్లాలోని మహిళా పోలీసులు సమర్థవంతంగా పనిచేసేందుకు, వారి విధులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా గూగుల్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉంచడానికి మహిళా పోలీస్ డ్యూటీ ట్రాకర్ అనే వెబ్ సైట్ ను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన జిల్లాలో ఏర్పాటు చేసి రాష్ట్ర మొత్తానికి ఆదర్శంగా నిలవడం జరిగినది. దీని ద్వారా రియల్ టైం సమాచారాన్ని అధికారులు అందరూ తెలుసుకునే విధంగా గ్రామస్థాయిలో జరిగే అనేక రకాల అస్తి తగాదాలు, కుటుంబ వివాదాలు, ఇతర నేరాలు గురించిన సమాచారం, అసాంఘిక కార్యకలాపాలు లాంటివి జరగకుండా చర్యలు తీసుకోవడం  జరుగుతుంది. 


*మహిళా పోలీస్ పబ్లిక్ అవేర్నెస్ బుక్ లేట్:*

ఇటీవల కాలంలో నానాటికి పెరిగిపోతున్న ఆన్లైన్ నేరాలు, ఓటీపీ నేరాలు, ఆధార్ కార్డు సంబంధించిన నేరాలు, క్రెడిట్ కార్డు నేరాల గురించి, కేవైసీ మోసాల గురించి, ప్రైజ్ మనీ మోసాల గురించి ప్రజలకు అవగాహనా కల్పించడానికి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల గురించి విద్యార్ధులకు అవగాహనా కల్పించడానికి, రహదారి భద్రత నియమాల గురించి, దిశ యాప్ ఉపయోగాల గురించి, బాల్య వివాహాలు నిరోధకం చట్టం గురించి, ఇలా అనేక విషయాలలో జిల్లా ప్రజలకు సులబంగా అర్ధమైయే విదంగా విస్తృత అవగాహన కల్పించు నిమిత్తం ఒక పుస్తక రూపంలో ప్రచురించి జిల్లాలోని అన్ని పాఠశాలలలో, గ్రంథాలయాలలో, ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలలో, పోలీస్ స్టేషన్ లలో అందుబాటులో వుంచడం జరిగింది. ముఖ్యముగా మహిళా పోలీసుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం కొరకు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. 


జిల్లా ఎస్పి  సమావేశంలో వార్షిక నివేదిక గురించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను విభజన చేయగా   2022వ సంవత్సరం ఏప్రిల్ 4వ తేది ఏర్పడిన నూతన బాపట్ల జిల్లాకు మొట్టమొదటి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని,  బాధ్యతలు తీసుకున్న సమయంలో పోలీస్ శాఖకు అనేక సవాళ్ళు ఉన్నాయని, ఒకవైపు మౌలిక సదుపాయాలపై దృష్టి పెడుతూ, మరోవైపు సిబ్బందికి సంక్షేమాన్ని ఇస్తూ, అదే విధంగా జిల్లా ప్రజలకు శాంతిభద్రతలను అందించడంలో వెనుకంజ వేయకుండా ముందుకు సాగినట్లు తెలిపారు. పేకాట, కోడిపందాలు, మట్కా, జూదం, నాటు సారా వంటి అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా నాటు సారా వినియోగం రవాణా తయారీ పెద్ద సంఖ్యలో తగ్గించి, నాటు సారా విచ్చల విడిగా తయారు చేసే గ్రామాలను నాటు సారా రహిత గ్రామాలుగా తయారు చేశామన్నారు. మహిళలకు భద్రత కల్పించడం పై ప్రత్యేక దృష్టి సారించింది వారిచే దిశ యాప్ లను గణనీయంగా డౌన్లోడ్ చేపించామన్నారు, దిశ యాప్ వినియోగం గురించి  ప్రజలకు అవగాహన కల్పనకు అనేక వినూత్న కార్యక్రమాలు  చేపట్టామన్నారు. గ్రామీణ స్థాయిలో ఒంటరి మహిళలను గుర్తించి వారికీ రక్షణ కల్పించడం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేశామని, ప్రతి పోలీస్ స్టేషన్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించామన్నారు, ప్రజలకు పోలీసు సిబ్బందికి మధ్య సత్సంబంధాలు మెరుగుపడేందుకు అనేక కార్యక్రమాలను, విజిబుల్ పోలీసింగ్ ను ముందుకు తీసుకు వచ్చామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని  ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయడానికి ప్రయత్నించామని, ప్రజలందరూ ఈ స్పందన కార్యక్రమం వల్ల లబ్ది పొంది ఎంతో మంది సమస్యలను పరిష్కారం చేశామన్నారు. ముఖ్యంగా సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి నెల మూడవ శుక్రవారం గ్రీవెన్స్ డే గా నిర్వహించి సిబ్బంది యొక్క వ్యక్తిగత, శాఖపరమైన పరమైన సమస్యలను సావధానంగా విని వాటిలో కొన్నిటిని తక్షణమే పరిష్కరించడం జరిగిందని, మరికొన్ని సమస్యలను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించేయమన్నారు.  బాపట్ల జిల్లలోని సముద్ర తీర ప్రాంతంలో బీచ్ లు ఉండడం వల్ల విహార యాత్రకు వచ్చే వారి తాకిడి ఎక్కువగా వుంటుందన్నారు. వారికి రక్షణ కల్పించడం కోసం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతగానో కృషి చేశామని, మెరైన్ సిబ్బందితో కలిసి సంయుక్తంగా పనిచేస్తూ ఇప్పటివరకు సముద్రంలో మునిగిపోతున్న 20 మంది ప్రాణాలను కాపాడగలిగామని ఈ విషయాల గురించి చర్చించుకున్నప్పుడల్లా పోలీస్ శాఖకు ఎంతో గర్వంగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా పోలీసు శాఖలో మరణించిన సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకు, వారి పిల్లలకు ప్రభుత్వం తరఫున రావాల్సిన ప్రయోజనాల విషయంలో ముందుండి స్పందించామని, వారికున్న సమస్యలను పరిష్కరించామని వారికి మేమున్నామని భరోసా కల్పిస్తూ అండదండగా ఉన్నామని తెలిపారు. అదేవిధంగా జిల్లా ఏర్పడిన తర్వాత మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా ఏఆర్ కార్యాలయం, MT కార్యాలయం, సిబ్బంది కొరకు వాటర్ ప్లాంట్, పెరేడ్ గ్రౌండ్, సిసిఎస్ పోలీస్ స్టేషన్, కాన్ఫరెన్స్ హాల్ లాంటి అనేక సదుపాయాలను ఒకదాని తర్వాత ఒకటి ఏర్పాటు చేశామని తెలిపారు. సంవత్సరం అంతంలో చేసిన పనితీరును పరిశీలించి చూసుకోవటం మరియు గత సంవత్సరంతో పోల్చి చూసుకోవడంతో మెరుగైన ఫలితాలు పొందడం వలన ఎంతో ఆనందంగా ఉన్నదని, ఈ ప్రగతిని బట్టి చేసిన శ్రమ కూడా మరచిపోతున్నామని, పోలీస్ శాఖలో ఉద్యోగం చేయటమే ఎంతో అదృష్టం అని, నేరుగా ప్రజలకి సేవ చేసుకునే భాగ్యం దొరికినట్లేనని అందులోనూ నూతన జిల్లాలో ప్రధమంగా ఎస్పీగా పనిచేసి ప్రజలకు సేవ చేయడం, శాంతి భద్రతలు పరిరక్షంచడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, దీనిలో జిల్లా సిబ్బంది యొక్క సహకారం జిల్లా పోలీసు అధికారులు సహకారం ఎంతైనా ఉన్నదని, బాపట్ల జిల్లాలోని ప్రతి పోలీస్ సిబ్బంది ఒక కుటుంబం గా ఉంటూ డిపార్ట్మెంట్ యొక్క పేరును కాపాడేందుకు పనిచేస్తున్నారని తెలిపారు.  

 ఇప్పటి వరకు మీడియా మిత్రులు బాపట్ల జిల్లా పోలీస్ వారికి ఎంతో సహరించారని, పోలీస్ శాఖకు సంబందించిన ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరువ చేసి ప్రజలకు మరియు పోలీస్ శాఖకు వారధి లాగా పనిచేశారని, మీ సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాము.

 నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించడానికి జిల్లా పోలీస్ వారు ఎల్లప్పుడూ ముందుంటామని తెలుపుతున్నాము.

 గౌరవ డిజీపీ గారు చెప్పినట్లుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరింతగా కష్టపడాలనే విధంగా మా పోలీస్ అధికారులు నుండి చివరి స్థాయి కానిస్టేబుల్ వరకు ప్రజలకు సేవచేయడానికి మేము కష్టపడుతున్నాము.

 బాపట్ల జిల్లా ప్రజలకు ఎస్పీ నుండి ఎస్సై స్థాయి వరకు అందరూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలుపుతున్నాము.

 వినూత్న కార్యక్రమాలు చేపట్టడంలో మరియు సాంకేతికతను వినియోగించుకోవడంలో మేము ఎల్లప్పుడూ ముందుంటాము.

  బాపట్ల జిల్లా ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ నూతన సంవత్సరంలో మీరు, మీ కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో గడపాలని మనసపూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.


అనంతరం వార్షిక బాపట్ల జిల్లా పోలీస్ 2023 సం క్యాలెండర్ ను జిల్లా ఎస్పీ  ఆవిష్కరించారు.


అనంతరం సమావేశానికి హాజరైన పాత్రికేయ మిత్రులకు బహుమతులు అందజేశారు.


  ఈ కార్యక్రమములో జిల్లా అదనపు ఎస్పీ పి.మహేష్ ,  DCRB డిఎస్పీ లక్ష్మయ్య , బాపట్ల డిఎస్పి ఏ శ్రీనివాస రావు , చీరాల డిఎస్పి పి శ్రీకాంత్ , రేపల్లె డిఎస్పి టి. మురళీకృష్ణ , ఏ ఆర్ - డి ఎస్ పి ప్రేమ్ కుమార్ , ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ , సిసిఎస్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ  మరియు ఇతర పోలీస్  అధికారులు పాల్గొన్నారు.

Comments