దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా శ్రీబాలాజి క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం

    తిరుపతి

  23 డిసెంబరు  (ప్రజా అమరావతి);


దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా శ్రీబాలాజి క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం- దసరాలో ముఖ్యమంత్రి ఈ ఆసుపత్రిని ప్రారంభించడానికి సిద్ధం చేయండి


-  పేదల ఆరోగ్యంపై సిఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ


- క్యాన్సర్ తో ఏ ఒక్కరూ మరణించకూడదని సిఎం లక్ష్యం


-  భవనాల డిజైన్లు, పరికరాలు, యంత్రాల ఏర్పాటుకు గడువు నిర్ణయించుకుని పని చేయండి


-  శ్రీ బాలాజి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజి ( క్యాన్సర్ ఆసుపత్రి) నిర్మాణ ప్రగతి సమీక్షలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి వెల్లడి


     ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశంతో  దేశంలోనే  అత్యుత్తమ చికిత్సలు అందించే వసతులతో తిరుపతిలో  శ్రీబాలాజి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజి (క్యాన్సర్ ఆసుపత్రి) నిర్మిస్తున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. వచ్చే ఏడాది దసరాలో ముఖ్యమంత్రి  ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.

       టీటీడీ ఆధ్వర్యంలో  స్విమ్స్ కు అనుబంధంగా అత్యుత్తమ సదుపాయాలు, చికిత్సలు అందించేలా నిర్మిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రి ప్రగతిపై స్విమ్స్ లో శుక్రవారం ఆయన ప్రముఖ వైద్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. పేద పిల్లలు గుండె వ్యాధులతో చనిపోకుండా ఉండాలనే లక్ష్యంతో తిరుపతి లో చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి నిర్మించాలని తనను ఆదేశించినట్లు చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో ఈ ఆసుపత్రి పేదలకు గొప్ప వైద్య సేవలు అందిస్తుందని ముఖ్యమంత్రి విశ్వసించారని ఆయన అన్నారు. ఆలోచన వచ్చిన నాలుగు నెలల్లోనే తమ వెంట పడి తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి హృదయాలయం ఏర్పాటు చేయించి సిఎం గారే ప్రారంభించారన్నారు. ఇప్పటిదాకా వెయ్యి మందికి పైగా పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసి వారికి కొత్త జీవితం ప్రసాదించారని చైర్మన్ సుబ్బారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ లో  చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేనందువల్ల తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోనే ఆసుపత్రి నిర్మించాలని ముఖ్యమంత్రి తమను ఆదేశించారని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 350 కోట్ల వ్యయంతో సకల సదుపాయాలతో దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించే చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు.  అలాగే బర్ద్ లో ఉచితంగా గ్రహణమొర్రి, కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసేలా ఏర్పాటు చేశారన్నారు. ఈ ఆపరేషన్ల వేగం పెంచేలా తరచూ తమకు ఆదేశాలు జారీచేశారన్నారు.

      క్యాన్సర్ తో రాష్ట్రంలో ఏ ఒక్కరూ మరణించకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలో తిరుపతి, గుంటూరు-విజయవాడ మధ్య, విశాఖపట్నం లో క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని సిఎం నిర్ణయించారన్నారు. ఇందుకోసం  క్యాన్సర్ చికిత్సల ప్రముఖ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును సలహాదారుగా నియమించారన్నారు. శ్రీవారి ఆశీస్సులతో మొదటి ఆస్పత్రి తిరుపతిలో నిర్మించాలని నిర్ణయించినట్లు శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. స్విమ్స్  అనుబంధంగా శ్రీబాలాజి క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకున్నట్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన ఆర్కిటెక్చర్లు, క్యాన్సర్ నివారణకు వివిధ మార్గాల్లో పనిచేస్తున్న ప్రముఖులు, వైద్యులు, అధికారులకు చైర్మన్ వివరించారు. ప్రస్తుతం స్విమ్స్ లో ఉన్న భవనాన్ని క్యాన్సర్ ఆసుపత్రికి అవసరమైన విధంగా మార్పులు చేయడం,   యంత్రాలు, వైద్య పరికరాలు సమకూర్చుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన డిపిఆర్ తయారు చేసి సమర్పించాలని చైర్మన్ కోరారు.  క్యాన్సర్ పై అవగాహన కల్పించడం, తొలిదశలోనే గుర్తించడం, ఉత్తమ చికిత్సలు అందించి ప్రాణాలు కాపాడటం అనే అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్విమ్స్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆసుపత్రి భవనాలు, ఇంజినీరింగ్ పనులు, డిజైన్ల ఖరారు లాంటి అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసి దసరాకు ఆసుపత్రి ని ప్రారంభిచేలా వర్క్ ప్లాన్ చేయాలని జేఈవో శ్రీమతి సదా భార్గవికి సూచించారు. మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి అందిస్తామని జేఈవో తెలిపారు.

    ఆసుపత్రి భవనాలకు సంబంధించి ఢిల్లీ ,చెన్నై నగరాలకు సంబంధించిన కన్సల్టెంట్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పనులు పూర్తి చేయడానికి గడువు విధించుకుని  చేపట్టాలని చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా ఆదేశించారు.

     రాష్ట్ర ప్రభుత్వ (కాంప్రహెన్సివ్ క్యా న్సర్ కేర్) సలహాదారు పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, వైద్య ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ నవీన్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణ, క్యాన్సర్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ జయచంద్ర తో పాటు పలువురు వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.


Comments