అంబేద్కర్ జయంతి రోజునే 125 అడుగుల విగ్రహావిష్కరణ



అంబేద్కర్ జయంతి రోజునే 125 అడుగుల విగ్రహావిష్కరణ


అన్ని పనులను మరింత వేగవంతం చేయండి

సుందరీకరణ పనులు కూడా నిర్ణీత సమయానికే పూర్తి చేయండి

అధికారులకు మేరుగు నాగార్జున ఆదేశాలు

విగ్రహ నిర్మాణ పనులను సమీక్షించిన రాష్ట్ర మంత్రులు

అమరావతి, జనవరి 25 (ప్రజా అమరావతి): ఏప్రిల్ 14న జరిగే అంబేద్కర్ జయంతి రోజున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అన్ని ఏర్పాట్లు వేగవంతం చేయాలని  రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, అంబేద్కర్ విగ్రహనిర్మాణ కమిటీ ఛైర్మెన్ మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన పనుల్లో ఎక్కడా అలసత్వం జరగకుండా పనులను పటిష్టంగా పర్యవేక్షించాలని కోరారు.

సచివాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంత్రి మేరుగు నాగార్జున తో పాటుగా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్షించగా, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సమావేశంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, 268 కోట్ల రుపాయలతో ప్రతిష్టాతంకగా చేపడుతున్న విగ్రహ నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులను నిర్ణీత సమయాల్లోపుగానే పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఎక్కడ కూడా ఆలస్యం జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత ముహూర్తానికే విగ్రహావిష్కరణ జరగాల్సిందేనని స్పష్టం చేసారు. అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని ఇటీవల సమీక్షించిన సందర్భంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సూచనలను, ఇచ్చిన ఆదేశాలను అధికారులు గుర్తుంచుకోవాలని కోరారు. ఒకవైపు విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతుండగానే మరోవైపున విగ్రహ ప్రాంతానికి చేరుకొనే రహదారులు, ప్రహారీ, లోపలివైపున పాదచారులు నడయాడేందుకు అంతర్గత రోడ్లు, విగ్రహ ప్రాంగణం చుట్టూ సుందరీకరణ పనులను కూడా పూర్తి చేయాలని సూచించారు. దీనికి సంబంధించి పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి మార్గనిర్దేశాలు చేసుకోవాలని కోరారు. హరియాణ లో జరుగుతున్న విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించడానికి మంత్రుల బృందం ఫిబ్రవరి మొదటివారంలో మరోసారి ఢిల్లీకి వెళ్తుందని నాగార్జున వెల్లడించారు. అందరితో మాట్లాడి ఈ కార్యక్రమానికి సంబంధించిన తేదీలను ఖరారు చేస్తామన్నారు. కాగా ఇప్పటికే విజయవాడకు చేరుకుంటున్న విగ్రహం విడి భాగాలను ప్రతిష్ఠించడానికి చర్యలు చేపట్టాలని కూడా నాగార్జున సూచించారు. కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లే సమయానికి విగ్రహ నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి మొత్తాన్ని విగ్రహ నిర్మాణ సంస్థకు చేరవేయాలని కోరారు. ఏపీఐఐసి అధికారులు విగ్రహ నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా పనులను మరింత పటిష్టంగా పర్యవేక్షించాలని సూచించారు. ఈ సంర్భంగానే ఏపీఐఐసీ అధికారులు విజయవాడలోని స్వరాజ్ మైదానినికి చేరుకున్న విగ్రహం విడిభాగాలు, ఇప్పటి వరకూ జరిగిన నిర్మాణ పనులను మంత్రులకు పిపిటీ రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సోషియల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.జయలక్ష్మి, డైరెక్టర్ కాటి హర్షవర్ధన్, ఏపీఐఐసి ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్ ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments