రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధికి రూ.9225 కోట్లు



రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధికి రూ.9225 కోట్లు


సబ్ ప్లాన్ లో భాగంగా రూ.49710 కోట్ల వ్యయం

అంబేద్కర్ స్ఫూర్తితో ఎస్సీల అభివృద్ధి 

ప్రాంతీయ రాష్ట్రాల సదస్సులో మంత్రి మేరుగు నాగార్జున.

అమరావతి, జనవరి 18 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధికి ఈ ఏడాది రూ.9225.28 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. షెడ్యూల్ కులాల వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో బుధవారం ప్రారంభమైన రెండు రోజుల తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాంతీయ సదస్సులో నాగార్జున పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఎస్సీ సబ్ ప్లాన్ లో భాగంగా జూన్ 2019 నుంచి 2022 డిసెంబర్ దాకా రూ.49,710.17 కోట్లను ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. నవరత్నాల్లో భాగంగా వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా 11.82 మంది ఎస్సీ పెన్షనర్ల కోసం రూ.7950.33 కోట్లను ఖర్చు చేసామని చెప్పారు. అమ్మఒడి పథకం ద్వారా 26.56 లక్షల మంది తల్లులకు రూ.2715.35 కోట్లను  ఖర్చు చేయడం జరిగిందన్నారు. వైయస్సార్ ఆసరా పథకం కింద 33.50 లక్షల మంది లబ్దిదారులకు రూ.2567.63 కోట్లు, వైయస్సార్ చేయూత పథకం కింద 17.89 లక్షల మందికి రూ.3356.41 కోట్లు,  వైయస్సార్ వాహన మిత్ర పథకం కింద 2.44 లక్షల మందికి రూ.243.72 కోట్ల రుపాయలను అందించామని తెలిపారు. జగనన్న తోడు పథకం కింద 3.39 లక్షల మందికి 7.95 కోట్లు, జగనన్న చేదోడు పథకం కింద 48 వేల మందికి రూ.43.98 కోట్లు,  వైయస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 2437 మందికి రూ.5.81 కోట్లు, మత్స్యకార భరోసా పథకం కింద 3283 మందికి రూ.3.28 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం కింద 3.89 లక్షల మంది విద్యార్థులకు రూ.668.995 కోట్లు, జగనన్న విద్యా దీవెన పథకం కింద 4.44  లక్షల మంది విద్యార్థులకు రూ.1755.35 కోట్లు అందించామని చెప్పారు. 2023-24లో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద 60 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.21.55 కోట్లు, వైయస్సార్ కణ్యాణమస్తు పథకం కింద రూ.211.63 కోట్లు  అందించనున్నామని నాగార్జున వివరించారు. నాన్ డీబీటి ద్వారా వైయస్సార్ ఆరోగ్యశ్రీ, జగనన్న గోరుముద్ద, జగనన్న తోడు, వైయస్సార్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ విద్యా కానుక, జగనన్న ఇళ్లు, వైయస్సార్ కంటి వెలుగు, తదితర పథకాల కింద 56.32 మంది లబ్దిదారులకు రూ.28,958.30 కోట్ల రుపాయలను అందించామని వెల్లడించారు. ఎస్సీ వర్గాలకు చెందిన వారి విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా గురుకులాలు, నీట్, జెఇఇ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నామని, స్పోర్ట్స్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద దోషులను శిక్షించడానికి, బాధితులను అవసరమైన సహాయాన్ని అందించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టామని, తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకూ బాధితులకు రూ.148.11 కోట్ల సాయాన్ని అందించామని నాగార్జున చెప్పారు. అలాగే రూ.268.46 కోట్ల రుపాయల వ్యయంతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోషియల్ జస్టిస్ అండ్ ఎంపవర్ మెంట్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నఈ ప్రాంతీయ సదస్సులో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాలతో పాటుగా పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, అధికారులు పాల్గొంటున్నారు.

Comments