మీకు అండగా నిలిచేందుకే యువగళం పాదయాత్ర!


కుప్పం -యువగళం పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు నారా లోకేష్ ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఆయా వర్గాల వారికి లోకేష్ ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. లోకేష్ ను కలిసిన వివధ వర్గాల వారి వివరాలు...

మీకు అండగా నిలిచేందుకే యువగళం పాదయాత్ర!

మీ తరుపున పోరాడతా... ధైర్యంగా ఉండండి

నిరుద్యోగ జేఏసి సభ్యులకు లోకేష్ అభయం

కుప్పం (ప్రజా అమరావతి): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మమల్ని నమ్మించి మోసం చేశారని నిరుద్యోగ యువతీయువకులు లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా కుప్పంలో పర్యటిస్తున్న లోకేష్ ను శుక్రవారం మధ్యాహ్నం నిరుద్యోగ జెఎసి నేతలు కలిశారు. జగన్ అధికారంలోకి వచ్చాక 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేస్తానని ఎన్నికలకు ముందు అన్నారని, ప్రతి ఏటా డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీచేస్తానని చెప్పారని, 6,500 పోలీసు ఉద్యోగాలు భర్తీచేస్తానని హామీలు గుప్పించారన్నారు. అయితే అవేమీ నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి లోకేష్ సమాధానమిస్తూ మీ సమస్యలన్నీ నాకు తెలుసు. మీకు అండగా ఉండటానికే నేను యువ గళం పాదయాత్ర ప్రారంభించాను... మనోస్థైర్యం కోల్పోవద్దు... మీకు అండగా నేనుంటా...మీ సమస్యలపై పోరాడతానంటూ భరోసా ఇచ్చి ముందుకు సాగారు.

అన్యాయంగా ఇళ్లు కూల్చేశారయ్యా...!-పంట ధ్వంసంచేసి భూమి లాక్కున్నారు

-లోకేష్ ఎదుట బాధిత మహిళల ఆవేదన

కుప్పం: ఎన్టీఆర్ హౌసింగ్ లో భాగంగా టిడిపి హయాంలో ఇచ్చిన ఇంటిని అన్యాయంగా కూల్చేసారు... అంటూ కుప్పంకు చెందిన దళిత మహిళ శ్యామల లోకేష్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. యువగళం తొలిరోజు పాదయాత్రలో బాధిత మహిళ శ్యామల వైసిపి సైకోల కారణంగా తాము ఏవిధంగా ఇబ్బందులు పడుతున్నది యువనేత ఎదుట గోడు వెళ్లబోసుకుంది. చెరువు పోరంబోకు అంటూ ఇల్లు తొలగించారు...అధికారులు వచ్చి ఇంట్లో సామాన్లు బయట పడేసి,  తన్ని బయటకి గెంటేశారు అంటూ ఆవేదన వ్యక్తంచేసింది. టిడిపి అధికారం వచ్చిన తరువాత అక్కడే ఇళ్లు కట్టించి దగ్గరుండి గృహప్రవేశం చేయిస్తా... ధైర్యంగా ఉండమ్మా అంటూ లోకేష్ భుజం తట్టారు. మరో బాధిత మహిళ ధనమ్మ తమ బాధ తెలియజేస్తూ తమకున్న 17 సెంట్ల కొద్దిపాటి భూమిలో జొన్న పంట వేసుకుంటే ధ్వంసం చేశారు, ఇంటిని కూల్చేశారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం, ఉన్నట్టుండి అధికారులు వచ్చి ప్రభుత్వ భూమి అంటూ పంటను ధ్వంసం చేశారని తెలిపింది. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని లోకేష్ ధనమ్మకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసిపి సైకోల దురాగతాలకు ఈ సంఘటనలు అద్దంపడుతున్నాయని లోకేష్ పేర్కొన్నారు.

చంద్రన్న బిడ్డను చూడాలనే చంటిబిడ్డతో వచ్చా!5నెలల  పాపతో లోకేష్ ను కలసిన మహిళ:- హుసేన్ బి, కుప్పం మండలం, సోడిగానిపల్లె.

చంద్రన్న మాకు దేవుడులాంటోడు... ఆయన బిడ్డ పాదయాత్ర చేస్తున్నారని తెలిసి ఎలాగైనా చూడాలని 5నెలల చంటిబిడ్డతో వచ్చా. జగన్ చెప్పేవన్నీ మోసపు మాటలని తేలిపోయింది. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు వైసీపీ నేతలు చెప్పినోళ్లకే పరిమితం. కులాలు, మతాలు,పార్టీల వారీగా ఎత్తిపట్టి అసలైన పేదలను పథకాలకు దూరం చేస్తున్నారు. చంద్రన్న పాలనలో ఎప్పుడూ ఇలా చేయలేదు.


లేనిమీటరుకు బిల్లు ఎక్కువొచ్చిందని అమ్మఒడి ఆపేశారు! :-మల్లప్పగారి గోపాల్, సుద్దలకుప్ప గ్రామం, వి.కోట మండలం.

నేను ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని. కూలీ పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అమ్మఒడి పథకం పెట్టిన కొత్తలో ఇచ్చారు. కానీ గతేడాది నుండి ఆపేశారు. అదేమని ప్రశ్నిస్తే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని తీసేశామన్నారు. నా ఇంటికి కనీసం మీటరు కూడా లేదు. లేని మీటరుకు బిల్లు ఎక్కువ రావడమేంటి?  ఇద్దరు ఆడపిల్లల్ని చదివించుకోవాలి. నిబంధనల పేరుతో పథకాలు తొలగిస్తున్నారు అని లోకేష్ కు వివరించారు.

శ్మశానంలో సెంటు భూమి ఇచ్చి వెనక్కి తీసేసుకున్నారు:- -దిగువింటి పుష్ప, కుప్పం మండలం, అమిగానిపల్లి 

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్మశానంలో సెంటు స్థలం ఇచ్చింది. స్మశానంలో ఏం చేసుకోవాలని అడిగినందుకు మరో చోట ఇస్తామని చెప్పి పట్టా వెనక్కి తీసుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా మళ్లీ పట్టించుకోవడం లేదు. జగన్ పాదయాత్రలో మాయమాటలు చెప్పి... అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. ప్రజల కోసం లోకేష్ బాబు చేపట్టిన పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం.

Comments