వెనుకబడిన వర్గాలు కాదు - వెన్నుముక వర్గాలు..


వినుకొండ, పల్నాడు జిల్లా (ప్రజా అమరావతి);


*రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న కానుక... జగనన్న చేదోడు.*

*వరుసగా మూడో ఏడాది జగనన్న చేదోడు.*

 

*రాష్ట్ర వ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ.330.15 కోట్ల ఆర్ధిక సాయాన్ని పల్నాడు జిల్లా వినుకొండలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


చిక్కటి చిరునవ్వులతో చెరగని ఆప్యాయతలతో ఆత్మీయతలను పంచిపెడుతున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికి, స్నేహితుడుకి ముందుగా మీ బిడ్డ చేతులు జోడించి పేరు, పేరుగా హృదయపూర్వక కృతజ్ఞతలు. 

వినుకొండలో ఈరోజు దేవుడి దయతో, మీ అందరి చల్లనిదీవెనలతో మరో మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.


*వెనుకబడిన వర్గాలు కాదు - వెన్నుముక వర్గాలు..*


వెనుకబడిన కులాలు, వర్గాలను వెన్నుముక కులాలుగా మారుస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ.. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని, సంక్షేమ పథకాల్లో ప్రతి పథకాన్నీ ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద కుటుంబానికి మేలు చేసేలా మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ మేలు చేస్తూ వచ్చింది. ఇచ్చిన మాటను అమలు చేసే విషయంలో భాగంగా ఇవాళ ఇక్కడ సొంత షాపు ఉన్న ప్రతి రజక సోదరుడికి, ప్రతి నాయీ బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.10వేల ఆర్ధిక సాయం చేస్తూ..జగనన్న చేదోడు పథకాన్ని తీసుకువచ్చాం. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో వరుసగా ఇవాళ ఇచ్చే ఈ సహాయంతో మూడో ఏడాది అమలు చేస్తూ... 3.30 లక్షల మందికి మంచి చేస్తూ... రూ.330 కోట్లు బటన్‌ నొక్కి వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తున్నాం.


*మూడేళ్లలో రూ.927 కోట్లు బదిలీ...*

ఈ రోజు ఇస్తున్న రూ.330 కోట్లతో కలుపుకుని ఇప్పటివరకు నా టైలర్‌ సోదరులు, అక్కచెల్లెమ్మలకు, హెయిల్‌ సెలూన్లు నడుపుకుంటున్న అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు, ఇస్త్రీ దుకాణాలు పెట్టుకున్న అక్కచెల్లెమ్మలకు మూడేళ్లలలో రూ.927 కోట్లు నేరుగా వారి అకౌంట్లలో బటన్‌ నొక్కి జమ చేశాం. ఎక్కడా వివక్ష లేని, లంచాలకు తావులేని వ్యవస్ధ ద్వారా ఈ సహాయం అంతా పారదర్శకంగా గ్రామ స్ధాయిలో అందుతుంది. 

ఈ 43 నెలల కాలంలోనే కేవలం ఈ బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి చేర్పించిన సొమ్ము 1,92,938 కోట్ల రూపాయలు.

దేవుడి దయతో ఇది జరుగుతోంది. మూడున్నర సంవత్సరాల కాలంలోనే డీబీటీ ద్వారా ఎటువంటి దళారులు, వివక్ష, మధ్యవర్తులు లేకుండా బటన్‌ నొక్కడం ద్వారామాత్రమే ఇది జరుగుతుంది.

ఇక గోరుముద్ద, ఇళ్ల స్ధలాలు, విద్యాకానుక లాంటి నాన్‌ డీబీటీ పథకాలను కూడా లెక్కవేస్తే.. రూ.3 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం.


*గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా...*

బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలుకు సంబంధించి..

జగన్‌ నోటినుంచి మొట్టమొదట అనే మాట నా బీసీలు, నా ఎస్సీలు, ఎస్టీలు, నా మైనార్టీలు నా వాళ్లు అని మీ జగన్‌ అనని రోజు లేదు. ప్రతి రోజూ ప్రభుత్వం వీళ్ల మంచి కోసమే ఉంది. వర్గాలుగా తీసుకుంటే రైతన్నలకు, అక్కచెల్లమ్మలకు, అవ్వాతాతలకు, చదువుకుంటున్న పిల్లల వరకు ఎవరిని తీసుకున్నా, ఏప్రాంతాన్ని తీసుకున్నా, ఏగ్రామాన్ని తీసుకున్నా కూడా ప్రతి గడపకూ ఇంతకముందు ఏ ప్రభుత్వం చేయని విధంగా దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలుతో మీ బిడ్డ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.


*జగనన్న చేదోడు ద్వారా....*

జగనన్న చేదోడు ద్వారా ఈ రోజు ప్రయోజనం పొందుతున్న వారిలో నా నాయీ బ్రాహ్మణ కుటుంబాలు, అక్కచెల్లెమ్మలు 47,533 మంది అయితే రజక సోదరులు, అక్కచెల్లెమ్మలు 1,14,661 మంది అయితే టైలర్‌ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు 1,67,951 మంది కలిసి మొత్తం 3.30 లక్షల మంది కుటుంబాల్లో ఈ రోజు సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి.


*ఏపీ దేశంలో నెంబర్‌వన్‌....*

ఈ సందర్భంగా మీతో ఒక్క విషయం చెప్పాలి. ఈ రోజు మన రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా జీడీపీ ప్రకారం పెరుగుదల 11.43 శాతంతో మొదటి స్ధానంలో ఉన్నాం.  అన్ని రాష్ట్రాలలో కన్నా మీ బిడ్డ ప్రభుత్వం 11.43 శాతం గ్రోత్‌ రేటుతో దేశానికే ఆదర్శంగా పరిగెడుతోంది. మీ బిడ్డ అంటే గిట్టని వాళ్లు, మీ బిడ్డ అంటే నచ్చని వాళ్లు జగన్‌ మాదిరిగా పరిపాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పి అబద్దాలు చెప్తున్న నేపధ్యంలో ఒక్కసారి ఆలోచన చేయండి. 

వాళ్ల హయాంలో ఎన్నడూ జరగని విధంగా మీ బిడ్డ హయాంలో దేశానికే దిక్సూచిగా రాష్ట్రం ఎందుకు పరుగెడుతుందంటే.. కారణం ప్రతి రంగాన్ని చేయిపట్టుకుని నడిపించగలిగితేనే ఆ రంగాలు పరుగులుపెడతాయి. గ్రోత్‌ రేట్‌ వస్తుంది. ప్రతి కుటుంబం బాగుపడుతుంది.


*రైతుల మొహాల్లో చిరునవ్వు – రైతు భరోసా...*

62 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న పరిస్థితులు. అలాంటి వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే 50 శాతం మంది రైతులకు కేవలం 1.25 ఎకరాలు మాత్రమే ఉన్న పరిíస్దితి. అంటే అర హెక్టార్‌ కూడా లేని పరిస్థితి. ఒక హెక్టార్‌ వరకు ఉన్న రైతులు ఎంతమంది అని చూస్తే.. 70 శాతం మంది రైతులు ఉన్నారు. దాదాపుగా కోటిమందికి పైగా ఉన్న వీళ్లందరికీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం క్యాలెండర్‌ ఇచ్చి సాగులో అడుగు ముందుకు పడేసరికి.. జగనన్న దగ్గర నుంచి వైయస్సార్‌ రైతు భరోసా వస్తుందన్న నమ్మకం  వారికుంది కాబట్టే.. రైతన్నలు ముందుకు అడుగులు వేయగల్గుతున్నారు. 

1.25 ఎకరాలు అంటే అరహెక్టారు భూమి కూడా లేని ఈ 50 శాతం మంది రైతులు రూ.13,500 వైయస్సార్‌ రైతు భరోసా ద్వారా 80 శాతం పంటలకు 80 శాతం ఖర్చు పూర్తిగా అందుతుంది కాబట్టి రైతన్నల మొహాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. సాగులో వేగం కనిపిస్తోంది. ఆ రైతన్నలకు ప్రతి గ్రామంలోనే ఇంటి దగ్గర రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకేలు)ను పెట్టి ప్రతి పంటనూ, ప్రతి ఎకరాను ఇ–క్రాపింగ్‌ చేసి ప్రతి రైతును చేయిపట్టుకుని నడిపిస్తున్నాం.


*సీజన్‌ ముగియకమునుపే ఇన్‌పుట్‌ సబ్సిడీ...*

రైతులకు వరదలు వంటి ఏ కష్టం వచ్చినా ఆ సీజన్‌ ముగియకమునుపే వారికి ఇన్‌పుట్‌ సబ్సిడీ వస్తుంది. గతంలో అయితే రైతన్నలకు ఇన్సూరెన్స్‌ అందని పరిస్థితులు ఉంటే నేడు ఉచితంగా ఇన్సూరెన్స్‌ చేయించి ప్రతి రైతన్నకు, ప్రతి ఎకరాకు మంచి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.


*పొదుపు సంఘాలు– గత ప్రభుత్వంలో మోసం...*

గత ప్రభుత్వ హయాలంలో కోటిమందికి పైగా పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేస్తే.. ఆ అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలన్నీ కూడా  ఏ గ్రేడ్, బి గ్రేడ్‌ నుంచి దిగజారి సీ గ్రేడ్, డీ గ్రేడ్‌కు పడిపోయి ఏకంగా 18 శాతం ఎన్‌పీఏల గానూ అవుట్‌ స్టాండింగ్‌లు గానూ నిలబడిపోయాయి.


*అక్కచెల్లెమ్మలకు ఆసరాగా...*

అటువంటి కోటి మంది అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ... మీ అన్న ప్రభుత్వం వైయస్సార్‌ ఆసరా, సున్నావడ్డీ అందిస్తూ అడుగులు ముందుకు వేయించాం.

అందుకే అక్కచెల్లెమ్మలు సున్నావడ్డీ, ఆసరా వంటి పథకాల ద్వారా అభివృద్ధి వైపు పయనిస్తున్నారు. గతంలో 18 శాతం ఎన్‌పీఏలు, అవుట్‌ స్టాండింగ్‌లగా ఉన్న గ్రూపులు ఇవాళ పాయింట్‌ ఐదు శాతానికి (0.5) లోపే ఉన్నారు అంటే ఏస్ధాయిలో పరుగెడుతున్నారో ఆలోచన చేయండి. గతంలో సీ, డీ గ్రేడ్‌గా ఉన్న సంఘాలన్నీ ఇవాళ ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌లగా చలామణీ అవుతున్నాయి. 


*స్వయం ఉపాధికి చేయూత...*

రాష్ట్రంలో ఎవరిమీదా ఆధారపడకుండా స్వయంగా వాళ్ల కష్టం మీదనే ఆధారపడి బ్రతుకున్న కుటుంబాలు దాదాపు 55 లక్షలకు పై చిలుకు ఉన్నాయి. వీళ్లందరికీ ఉద్యోగాలు ఉండవు. స్వయంగా వాళ్ల కాళ్లమీద వాళ్లే నిలబడి బ్రతుకుపోరాటంలో అడుగులు ముందుకు వేస్తున్నారు. నాలుగు అడుగులు వేస్తే బయట కిరణా షాపుల్లోనూ, రోడ్డు పక్కన వ్యాపారం చేస్తూ, తోపుడు బండ్ల మీద దోశెలు వేస్తూనో, కూరగాయలు అమ్ముకుంటూనో కనిపిస్తారు. వీళ్లు ఎవరిమీదా ఆధారపడరు. ఇలాంటి 27 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు.. క్రమం తప్పకుండా ప్రతి ఏటా అదే అక్కచెల్లెమ్మకు చేయూత నిచ్చి ప్రభుత్వం నడిపిస్తుంది కాబట్టే రాష్ట్రం పరుగులు పెడుతుంది. 


*అమూల్‌ లాంటి దిగ్గజ సంస్ధల సహకారంతోనూ..*

అమూల్, ఐటీసీ, రిలయెన్స్, పీ అండ్‌ జీ, హిందుస్తాన్‌ లీవర్‌ లాంటి సంస్ధలతో అక్కచెల్లెమ్మలకు వ్యాపారం చేసేందుకు అడుగులు ముందుకు వేయించాం. బ్యాంకులను కలిపి అక్కచెల్లెమ్మలకు చేయూత నివ్వగలిగాం కాబట్టి ఇవాళ రాష్ట్రం పరుగెడుతోంది. 


*15 లక్షల మందికి జగనన్న తోడు...*

ఈ రోజు జనగన్న తోడు ద్వారా 15 లక్షల మంది రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న తోపుడు బండ్ల వారందరికీ కూడా రూ.10 వేలు వడ్డీ లేకుండా ఆదుకున్నాం. కాబట్టే రాష్ట్రం వేగంగా పరుగెడుతోంది.

మత్స్యకారభరోసా ద్వారా 1.20 లక్షల మంది కుటుంబాలకు అండగా నిలబడ్డాం. నేతన్న నేస్తం ద్వారా దాదాపు 82 వేల కుటుంబాలుకు తోడుగా నిలబడ్డాం. వాహనమిత్ర ద్వారా సొంతంగా ఆటో, టాక్సీలు నడుపుకుంటున్న 2.75 లక్షల కుటుంబాలకు తోడుగా, అండగా మేమున్నామంటూ భుజం తట్టి నిలబెట్ట గలిగాం.  కాపునేస్తం ద్వారా 3.56 లక్షల కుటుంబాలు అండగా నిలబడ్డాం. చేదోడు ద్వారా 3.30 లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ కుటుంబాలకు తోడుగా నిలబడ్డాం.


*ఈబీసీ నేస్తం.*

ఈబీసీ నేస్తం ద్వారా మరో 4 లక్షల కుటుంబాలకు అండగా నిలబడ్డాం. వీళ్లందరూ కూడా వాళ్ల కాళ్ల మీద నిలబడుతూ.. వాళ్ల ఉద్యోగాలు వాళ్లే  స్వయంగా చేసుకుంటున్న వీళ్లంతా కూడా నిలబడగలిగారు.


కోవిడ్‌లాంటి మహమ్మారిని కూడా ఎదురించి వీళ్లు నిలదొక్కుకోగలిగారు కాబట్టి.. ఈ రోజు రాష్ట్రం 11.43 శాతం అభివృద్ది రేటుతో అడుగులు ముందుకు వేస్తుంది.


*30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు..*

ఏకంగా 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఆ అక్కచెల్లెమ్మల పేరుతో 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్‌ చేయించి, 20 లక్షల ఇళ్లను వేగంగా నిర్మిస్తున్నారంటే... అందులోనుంచి సిమెంట్, స్టీల్‌ వినియోగం, కార్మికులకు ఉపాధి ఇవన్నీ వెరసి రాష్ట్రం 11.43 శాతం గ్రోత్‌ రేట్‌తో  వేగంగా దూసుకుపోతుంటే.. గిట్టని వాళ్లు,నచ్చని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంటున్నారు.


*ఆలోచన చేయండి*

*గత పాలనకూ– మన పాలనకూ తేడా..*

గతంలో కూడా పాలకులను చూశాం. ముఖ్యమంత్రి స్ధానంలో ఒక ముసలాయన్ను చూశాం. అప్పుడూ ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు. ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌. గతం కన్నా మీ బిడ్డ చేస్తున్న అప్పుల గ్రోత్‌ రేట్‌ తక్కువే. 

అయితే గతంలో ఎందుకు బటన్లు  లేవు ?. గతంలో రూ. 1.92 లక్షల కోట్లు ఎందుకు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రాలేదు ? ఆలోచన చేయండి ? 

గతంలో ఇవన్నీ ఎందుకు జరగలేదు ? మీ బిడ్డ పాలనలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయో ఆలోచన చేయండి? 


కారణం మీ బిడ్డ పరిపాలనలో కేవలం బటన్లు మాత్రమే ఉన్నాయి. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు.నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు. నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాలలోకి డబ్బులు వస్తున్నాయి.


*కేస్ట్ వార్ కాదు - క్లాస్‌ వార్‌* 

నేను నా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, నా నిరుపేద పేద వర్గాలనే నమ్ముకున్నాను. ఈరోజు రాష్ట్రంలో జరిగేది కేస్ట్‌ వార్‌ కాదు.. (కులాల మధ్య యుద్ధం కాదు), క్లాస్‌ వార్‌ జరుగుతుంది. పేద వాడు ఒకవైపు ఉంటే పెత్తందార్లు మరోకవైపు ఉండి ఈ యుద్ధం జరుగుతుంది.

మాట ఇస్తే మాట మీట నిలబడే మీ బిడ్డ ఒకవైపు ఉంటే... వెన్నుపోట్లు, మోసాలు మరోవైపు ఉండి ఈ రోజు యుద్ధం జరగబోతుంది.

ఇలాంటి యుద్ధంలో మీ బిడ్డకు నమ్మకం అంతా కేవలం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు తప్ప ఏవీ లేవు.


*సింహంలా మీ బిడ్డ ఒక్కడే.....*

మీ బిడ్డకు పొత్తుల్లేవు, వాళ్లమీదా వీళ్లమీదా నిలబడడు, ఆధారపడడు. మీ బిడ్డ ఒక్కడే. సింహంలా మీ బిడ్డ ఒక్కడే నడుస్తాడు. తోడేళ్లందరూ ఒక్కటవుతున్నారు. కానీ మీ బిడ్డకు భయం లేదు. కారణం మీ బిడ్డ మిమ్మల్ని ఆదేవుడ్ని నమ్ముకున్నాడు కాబట్టి భయం లేదు.


*మీ అందరి దీవెనలుతో....* 

మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని, ఇంకా మంచి చేసే రోజులు, పరిస్థితులు రావాలని, మన స్కూళ్లు బాగుపడాలని, మన పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదువులు చదవాలని గొప్పగా కలలు కన్న మీ బిడ్డ.. కలలన్నీ నెరవేరాలని, ఆసుపత్రుల రూపురేఖలు మారాలని,  ఆసుపత్రికి వెళితే డాక్టర్‌ లేని పరిస్థితి లేకుండా, రాకుండా పోవాలని, వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని... మీ బిడ్డకు బలాన్నివ్వాలని ఆ దేవుడ్ని  కోరుతున్నాను.


వైద్య రంగంలోనూ, చదువుల రంగంలోనూ, వ్యవసాయరంగంలోనూ, అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడే విషయంలోనూ, గవర్నెన్స్‌ రంగంలోనూ మీ బిడ్డ తీసుకొచ్చిన  ఈ మార్పులకు దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఇంకా మంచి చేసే ఆలోచన, పరిస్థితిలు ఇవ్వాలని, మీ చల్లని దీవెనలు కోరుకుంటున్నాను.


*చివరిగా...*

కాసేపటి క్రితం ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడు ఈ నియోజవర్గానికి సంబంధించి చాలా మంచి జరుగుతోంది. ఇంకా మంచి చేసేందుకు బొల్లాపల్లి మండంలో 20 గ్రామాలకు తాగునీటి వ్యవస్ధ కోసం సీపీడబ్ల్యూఎస్‌ స్కీం కింది రూ.12 కోట్లు ఖర్చయ్యే పథకాలకు మంజూరు అడిగారు. శాంక్షన్‌ చేస్తున్నాం. 50 పడకల సీహెచ్‌సీను రూ.15 కోట్లతో 100 పడకల సీహెచ్‌సీ గా మార్పు చేయాలని అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నాను. వెంటనే పనులు ప్రారంభిస్తాం. అలాగే వినుకొండలో ముస్లిం మైనార్టీ కాలేజీ అడిగారు. రూ.10 కోట్లతో అది కూడా మంజూరు చేస్తున్నాను. దేవుడు ఆశీస్సులతో మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని, మనసారా కోరుకుంటూ బటన్‌ నొక్కి చేదోడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని సీఎం ప్రసంగం ముగించారు.

Comments