దేశం యొక్క భవిష్యత్ యువత మీద ఆధారపడి వుంది

 

నెల్లూరు (ప్రజా అమరావతి)!దేశం యొక్క భవిష్యత్ యువత మీద ఆధారపడి వుందని, 


దేశ సమైక్యతను,  సౌబ్రాతృత్వాన్ని  కాపాడటంలో యువత  భాగస్వాములు కావాలని గౌరవ భారత పూర్వపు ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.


స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం వెంకటాచలంలో గల  అక్షర విద్యాలయంలో  గౌరవ భారత పూర్వపు ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడుగారు స్వామి వివేకానంద విగ్రహానికి, సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పుష్పాంజలి గావించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్షర విద్యాలయం విద్యార్థులను ఉద్దేశించి శ్రీ వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ, దేశం యొక్క భవిష్యత్ యువత మీద ఆధారపడి వుందన్నారు. దేశ సమైక్యతను,  సౌబ్రాతృత్వాన్ని  కాపాడటంలో యువత  భాగస్వాములు కావాలన్నారు.  తత్వవేత్త, దేశభక్తి పరాయణుడు స్వామి వివేకానంద గారి  జయంతిని పురస్కరించుకొని ఆ మహనీయుని  చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన  జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు.  అందులో భాగంగా ఈ రోజు మనమంతా  జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు  స్వామి వివేకానంద గారికి ఘనమైన నివాళులు ఆర్పిస్తున్నట్లు శ్రీ వెంకయ్య నాయుడు  తెలిపారు.   నేటి విద్యార్ధులే రేపటి పౌరులని, ప్రతి ఒక్కరూ జాగృతమై లక్ష్యాన్ని నిర్ధేశించుకొని ఆ  లక్ష్యం సాధించేంత వరకు నిరంతరం  కృషి చేయాలని   స్వామి వివేకానంద పిలుపు నిచ్చారని, ఆయన పిలుపును ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకొని స్వామి వివేకానంద గారి సూక్తులను గుర్తు పెట్టుకొని జీవితంలో ఆచరించాలని శ్రీ వెంకయ్య నాయుడు తెలిపారు. నేడు యువత పాశ్చాత్య వ్యామోహం, సినిమా, టీవి రంగంలో వస్తున్న మార్పుల పట్ల ఆకర్షితులై పెడదోవపడుతున్నారన్నారు.   మనమంతా భారతీయులం,  జన్మనిచ్చిన తల్లిని, జన్మ భూమిని, మాతృ భాషను, మాతృ దేశాన్ని గౌరవించాల్సిన భాద్యత  మనందరిపై వుందన్నారు. మన భవిష్యత్ మన  నడవడిక పై ఆధారపడి వుంటుందని, నేడు విద్యార్ధులు టీవీలకు, సెల్ ఫోన్లకు దూరంగా వుండాలని శ్రీ వెంకయ్య నాయుడు విద్యార్ధులకు సూచించారు.    చదువు చెప్పిన గురువును ఎప్పుడు మర్చిపోరాదన్నారు,  పెద్దలను, సమాజంలో ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. ఆలాగే పశు పక్షాధులను సైతం భక్తితో నమస్కరించడం, ప్రకృతిని ఆరాధించడం మర్చిపోరాదన్నారు.  భారతీయ సంస్కృతిని,  మన దేశ ఆధ్యాత్మిక సంపద యొక్క గొప్పతనాన్ని, సనాతన ధర్మం గురించి  చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ప్రపంచానికి  చాటి చెప్పిన మహనీయులు స్వామి వివేకానంద గారని, వారి జీవితాన్ని  పాఠంగా ప్రతిఒక్కరూ చదువుకొని వారి స్పూర్తితో ముందుకు పోవాలని శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు.


ఈ సంధర్భంగా  అక్షర విద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలను శ్రీ వెంకయ్య నాయుడు గారు  ఎంతగానో ఆసక్తిగా తిలకించారు.  అనంతరం సంక్రాంతి పండుగ పురస్కరించుకొని నిర్వహించిన సంక్రాంతి ఉత్సవాల్లో, భోగి మంట కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో  శ్రీ వెంకయ్య నాయుడు గారి సతీమణి శ్రీమతి ఉషమ్మ,అక్షర విద్యాలయం అకడమిక్ డైరెక్టర్  కుముద, ప్రిన్సిపాల్  ప్రియా జాకబ్, అక్షర విద్యాలయం ఉపాద్యాయులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు. 


Comments