20 ఏళ్ళుగా గుడివాడకు కొడాలి నాని చేసిందేమీ లేదు

 *- 20 ఏళ్ళుగా గుడివాడకు కొడాలి నాని చేసిందేమీ లేదు* 


 *- ఒక్క అవకాశం నాకివ్వండి* 

 *- దుర్మార్గాలు, దోపిడీలను అరికడతా* 

 *- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి* 


గుడివాడ, ఫిబ్రవరి 13 (ప్రజా అమరావతి): గత 20 ఏళ్ళుగా గుడివాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కొడాలి నాని చేసిందేమీ లేదని కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం గుడివాడ పట్టణం 8వ వార్డు పెద్దవీధిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పన్నుల రూపంలో ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ప్రజలకు వివరించారు. ముందుగా వార్డు మహిళలు మాజీ ఎమ్మెల్యే రావికి హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు. వార్డు ప్రజలు పూలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రావి మీడియాతో మాట్లాడుతూ గత నాలుగేళ్ళుగా గుడివాడ నియోజకవర్గానికి జగన్మోహనరెడ్డి, ఎమ్మెల్యే కొడాలి నాని ఏం చేశారని ప్రశ్నించారు. కొడాలి నానిని 20 ఏళ్ళుగా గుడివాడ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తున్నారని, ఏ ఒక్క కుటుంబానికి న్యాయం చేయలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయలేదన్నారు. అధికారం వస్తే అభివృద్ధి చేస్తానని మాయ మాటలు చెబుతూ వచ్చాడన్నారు. మంత్రిగా మూడున్నరేళ్ళ కాలంలో ఏమీ చేయలేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గుడివాడ పట్టణ ప్రజలకు 10వేల టిడ్కో ఇళ్ళను మంజూరు చేయడం జరిగిందన్నారు. 95 శాతం ఇళ్ళ నిర్మాణాలు పూర్తయ్యాయని, కొద్దిరోజుల్లో లబ్ధిదారులు ఇళ్ళలోకి వెళ్ళే సమయంలో దురదృష్టవశాత్తూ తెలుగుదేశం ప్రభుత్వం మారిందన్నారు. గత నాలుగేళ్ళ కాలంలో మిగతా 5 శాతం ఇళ్ళ నిర్మాణాలను పూర్తిచేసి ఉంటే లబ్ధిదారులు ఇళ్ళలో ఉండేవారన్నారు. దుర్మార్గులకు సంపాదన తప్ప రెండో పని లేకుండా పోయిందన్నారు. గుడివాడ పట్టణంలోని వార్డుల్లో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 8వ వార్డులో మంచినీటి రిజర్వాయర్ ను నిర్మించారని, పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇవ్వలేని చేతగాని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమని, గతంలో అనేక పనులు జరిగాయన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దోపిడీలన్నింటినీ అరికడతానని హామీ ఇచ్చారు. నామినేటెడ్ పదవులు ఇస్తామంటూ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకునే ఉంటారన్నారు. టీడీపీ విజయం కోసం నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రావి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ బాధపడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలంతా మాజీ ఎమ్మెల్యే రావికి మద్దతుగా నిలిచి గెలిపించాలని దింట్యాల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళాధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి, వార్డు అధ్యక్షుడు తేనెల ఏడుకొండలు, వడ్డాది నాగరాజు, పిన్నింటి పండుబాబు, పార్టీ నేతలు ముళ్ళపూడి రమేష్ చౌదరి, డాక్టర్ గోర్జి సత్యనారాయణ, పోలాసి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Comments