కైకలూరు నుండి పోటీ చేయాలన్న ఆసక్తిని చంద్రబాబుకు తెలియజేశాం

 *- కైకలూరు నుండి పోటీ చేయాలన్న ఆసక్తిని చంద్రబాబుకు తెలియజేశాం


 *- పిన్నమనేని కుటుంబంలో ఎవరికిచ్చినా పోటీ చేస్తాం* 

 *- సీనియర్ టీడీపీ నేత పిన్నమనేని పూర్ణవీరయ్య(బాబ్జి)* 


గుడివాడ, ఫిబ్రవరి 27 (ప్రజా అమరావతి): ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయాలన్న ఆసక్తిని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు తెలియజేశామని సీనియర్ టీడీపీ నేత పిన్నమనేని పూర్ణ వీరయ్య (బాబ్జి) తెలిపారు. కైకలూరులో పిన్నమనేని కోటేశ్వరరావు మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యశిబీరం అనంతరం పిన్నమనేని బాబ్జి మీడియాతో మాట్లాడారు. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును కలవడం జరిగిందన్నారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఆసక్తిని కూడా తెలియజేశామన్నారు. గత కొద్దిరోజుల కిందట కైకలూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జయమంగళ వెంకటరమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. ప్రస్తుతం కైకలూరు నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితి నెలకొందని చెప్పారు. పిన్నమనేని కుటుంబానికి కైకలూరు నియోజకవర్గంతో దశాబ్దాల తరబడి ఎంతో సన్నిహిత సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు. తన తాత, జడ్పీ మాజీ చైర్మన్ దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు మండవల్లి సమితి నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారన్నారు. ముదినేపల్లి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు. 30 ఏళ్ళ పాటు జడ్పీ చైర్మన్ గా పనిచేశారన్నారు. తన బాబాయ్, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు కూడా మూడుసార్లు ముదినేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు. ముదినేపల్లి నియోజకవర్గం పరిధిలో మండవల్లి, ముదినేపల్లి మండలాలు ఉండేవన్నారు. ఈ నియోజకవర్గం రద్దు కావడంతో ఈ రెండు మండలాలు కైకలూరు నియోజకవర్గంలో చేరాయన్నారు. దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు హయాం నుండి మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో తమ కుటుంబానికి మంచి పట్టు ఉందన్నారు. 50 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు అనేక పదవులను చేపట్టారని, కైకలూరు, కలిదిండి మండలాల్లో ఆయన చేసిన సేవలకు గాను ఇప్పటికీ ఇక్కడి ప్రజలు గుర్తుంచుకునే ఉన్నారన్నారు. ప్రతి గ్రామంలోనూ పిన్నమనేని కుటుంబానికి అభిమానులు, సానుభూతిపరులు ఉన్నారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే కైకలూరు నియోజకవర్గం నుండి తిరిగి రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావుతో కలిసి చంద్రబాబుకు వివరించామన్నారు. చంద్రబాబు నిర్ణయం మేరకు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత 1994లో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అప్పటి నుండి ప్రతి అడుగు మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావుతోనే నడవడం జరిగిందన్నారు. 2004 వరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, మంత్రిగా బాధ్యతలు చేపట్టారని, ఆప్కాబ్ చైర్మన్ గా కూడా పనిచేశారన్నారు. కైకలూరు టీడీపీ సీటును పిన్నమనేని వెంకటేశ్వరరావుకు కేటాయించినా ఆయన గెలుపు కోసం పనిచేస్తానన్నారు. తనకిచ్చినా కైకలూరు సీటును గెల్చుకుని చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని పిన్నమనేని బాబ్జి తెలిపారు.

Comments