*సహేళి గ్రూపుల ద్వారా సామాజిక చైతన్యం
*
*మాతాశిశు మరణాల నివారణకు దోహదపేడేలా గ్రూపుల నిర్మాణం
*డెత్ ఆడిట్ రివ్యూలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశాలు
విజయనగరం, ఫిబ్రవరి 07 (ప్రజా అమరావతి) ః జిల్లాలో నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన *సహేళి* గ్రూపుల ద్వారా కొత్తగా పెళ్లైన జంటల్లో సామాజిక చైతన్యం తీసుకురావాలని వారి భవిష్యత్తు ఆరోగ్య పరిస్థితులపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. మండల, గ్రామ స్థాయిల్లో సహేళి గ్రూపులు ఏర్పాటు చేసి వాటిలో నూతన వధూవరులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఇప్పటికే అందుబాటులో సఖి గ్రూపుల సమావేశాల నిర్వహణ సమయంలో సహేళి సమావేశాలను కూడా నిర్వహించాలని చెప్పారు. స్థానికంగా ఉన్న స్త్రీ, శిశు సంక్షేమ, వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని వివాహాం అనంతరం జరిగే పరిణామాలపై, ఆరోగ్య పరిస్థితులపై కొత్త జంటలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు పంపించాలని ఆదేశించారు. వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారికి సూచించారు. గత నాలుగు నెలల్లో జిల్లాలో సంభవించిన మాతాశిశు మరణాలపై కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మంగళవారం డెత్ ఆడిట్ రివ్యూ నిర్వహించారు. మరణాలకు గల కారణాలను ఆయా వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
రివ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ గర్భిణుల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరమని, ప్రమాదాలు జరగక ముందే క్షేత్ర స్థాయిలో ఉండే సిబ్బంది జాగురూకత వహించాలని పేర్కొన్నారు. రవాణా సదుపాయాలు లేని గ్రామాల్లో ఉండే సిబ్బంది ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని చివరి క్షణం వరకు ఆగకుండా కొద్దిగా ముందుగానే పరిస్థితిని అంచనా వేసి గర్భిణులను ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. పౌష్టికాహారం అంగన్ వాడీ కేంద్రాలకు వచ్చి తీసుకొనేలా గర్భిణుల్లో మరింత అవగాహన కల్పించాలని చెప్పారు. చిన్నారులకు అన్నప్రాసన కాస్త ముందుగానే నిర్వహించాలని, ఈ విషయంలో వైద్యుల సలహాలను తప్పకుండా పాటించాలని తల్లిదండ్రులను ఉద్దేశించి కలెక్టర్ అన్నారు. వైద్యారోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి మాతాశిశు మరణాలను తగ్గించాలని సూచించారు.
*చిన్నారులు చనిపోవటంపై కలెక్టర్ విస్మయం*
గత నాలుగు నెలల కాలంలో జిల్లాలో రెండు మాతృ మరణాలు, 16 శిశు మరణాలు సంభవించాయి. అందులో మూడేళ్ల వయసు కలిగిన చిన్నారులు ఇద్దరు, నాలుగేళ్ల బాలుడు ఒకరు అనుకోని ఘటనల్లో చనిపోవటంపై కలెక్టర్ విస్మయం చెందారు. విద్యుదాఘాతంతో ఒకరు, నదిలో మునిగి ఒకరు, బ్రెయిన్ ట్యూమర్‌తో మరొకరు మృత్యువాత పడటంతో విచారం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ప్రమాదకర వస్తువులను దగ్గర ఉంచరాదని ఈ సందర్భంగా కలెక్టర్ హితవు పలికారు. ఇదిలా ఉండగా రాజాం పరిధిలోని జి. ముడిదాం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి నదిలో మునిగి చనిపోవటంపై కలెక్టర్ అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల సహకారంతో విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని డీఎం & హెచ్‌వోను ఆదేశించారు.
*ఉత్తమ వైద్యులకు అవార్డులు ప్రదానం*
ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ లో భాగంగా ఉత్తమ సేవలందించిన వైద్యులకు కలెక్టర్ సూర్యకుమారి అవార్డులను ప్రదానం చేశారు. చల్లపేట పీహెచ్‌సీకి చెందిన డా. టి. సంజయ రాణి, గంట్యాడ పీహెచ్‌సీ నుంచి డా. డి. సీతల్ వర్మ, రాకోడు నుంచి డా. మోపాడ జగదీష్, వేపాడ, బొద్దాం పీహెచ్‌సీల నుంచి డా. టి. లక్ష్మీ ప్రియాంక, బల్లంకి నరేంద్రలు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డా. ఎస్.వి. రమణ కుమారి, డీసీహెచ్ఎస్ డా. గౌరీశంకర్, ఘోషా ఆసుపత్రి ప్రసూతి విభాగం హెచ్.వొ.డి. డా. అరుణా శుభశ్రీ, వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు, ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్ వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment