*ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ ఆచరణీయం
*
*•* ప్రశంసించిన నైజీరియా దేశ ప్రతినిధులు
*•* ఏపీ విద్యా ప్రగతిని వివరించిన కమీషనర్, ఎస్పీడీ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు
విజయవాడ (ప్రజా అమరావతి);
నైజీరియాలోని కడునా రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ప్రతినిధి బృందం గత రెండ్రోజులుగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వివిధ పాఠశాలలు పర్యటించి, ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ అమలు తీరు తెన్నులు బాగున్నాయని, ఆచరణీయమని ప్రశంసించారు. కడునా స్టేట్ యూనివర్సల్ బేసిక్ ఎడ్యుకేషన్ బోర్డ్ (SUBEB) హ్యూమన్ రిసోర్సెస్ శాశ్వత సభ్యుడు డాక్టర్ క్రిస్టీ అయి అలాడెమెరిన్ ( Dr. Christy Ayi Alademerin,) నేతృత్వంలోని 19 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో కడునా నుండి రాష్ట్ర స్థాయి అధికారులు మరియు నైజీరియా నుండి ఫెడరల్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
శుక్రవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారి అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో ప్రతినిధి బృందంతో సమావేశమై రాష్ట్రవ్యాప్తంగా విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి, వివిధ విద్యా కార్యక్రమాల గురించి వారికి వివరించారు. ప్రతినిధి బృందం నైజీరియాలోని కడునా రాష్ట్రంలో సరైన స్థాయిలో సరైన విద్య కోసం TaRL (Teaching at the right level) నిర్వహిస్తున్న వారి అనుభవాలను కూడా పంచుకుంది. రెండు దేశాలు తమ విద్యావ్యవస్థల గురించి పరస్పరంగా చర్చించుకుని, ఆలోచనలను, అభ్యాసాలను పంచుకున్నాయి.
ఈ ప్రతినిధి బృందం భారతదేశంలో FLN (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరాసీ) అభ్యసనాలను అర్థం చేసుకోవడం, ఉత్తమ అభ్యాసాలను నేర్చుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లల అభ్యాస స్థాయిలను మెరుగుపరచడానికి ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సహకారంతో ప్రస్తుతం 35,000 పాఠశాలల్లో అమలు చేస్తున్న సరైన స్థాయిలో సరైన బోధన (TaRL) కార్యక్రమాన్ని ప్రతినిధి బృందం సందర్శించింది.
*సందర్శించిన పాఠశాలలివే..*
ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం మండలం చంద్రగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జి.కొండూరు మండలంలోని వెళ్టూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, విజయవాడ గ్రామీణ పరిధిలో వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఇబ్రహీంపట్నంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తుమ్మలపాలెం, కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరు మండలంలో ఐలూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులతో, ఉపాధ్యాయులతో ముచ్చటించారు.
ఈ సమావేశంలో సీమ్యాట్ డైరెక్టర్ శ్రీ వి.ఎన్.మస్తానయ్య గారు, ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి గారు, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment