రాష్ట్రంలో మైనింగ్ కార్యకలాపాలు విస్తృతమయ్యాయి



-  గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం

- వందేళ్ళ తరువాత రాష్ట్రంలో సమగ్ర సర్వే జరుగుతోంది

- సీఎం వైయస్ జగన్ గారు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు

- సమగ్ర సర్వే కోసం 3 కోట్ల సర్వేస్టోన్స్ కావాలి

- రాష్ట్రంలోని గ్రానైట్ ఫ్యాక్టరీలకు సర్వేరాళ్ళ తయారీ ఆర్డర్లు

- దీనివల్ల గ్రానైట్ ఫ్యాక్టరీలకు మేలు జరుగుతుంది

- సర్వే అవసరాలకు అనుగుణంగా రోజుకు కనీసం లక్ష స్టోన్స్ అందించాలి 

- గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకుల సమస్యలను కూడా అర్థం చేసుకుంటున్నాం

- సర్వేరాళ్ళ తయారీ రేట్లపై ప్రభుత్వం సమీక్షించి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుంది

- రాష్ట్రంలో మైనింగ్ కార్యకలాపాలు విస్తృతమయ్యాయి


- గత మూడేళ్ళుగా మైనింగ్ రెవెన్యూ గణనీయంగా పెరుగుతోంది

- సీఎం శ్రీ వైయస్ జగన్ చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి

- గనులశాఖ అధికారులు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి


: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


అమరావతి (ప్రజా అమరావతి):


1) రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న భూహక్కు-భూరక్ష కార్యక్రమానికి అవసరమైన సర్వేరాళ్ళను సిద్దం చేసి అందించే ఆర్డర్ ను రాష్ట్రంలోని గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులకు అప్పగిస్తున్నామని రాష్ట్ర గనులు, ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతికశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలోని వందలాది గ్రానైట్ పరిశ్రమలకు పని లభిస్తుందని, దానిపై ఆధారపడిన లక్షలాధి మందికి ఉపాధి మెరుగవుతుందని అన్నారు. 


2) సచివాలయంలో మంగళవారం గ్రానైట్ పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులు,  గ్రానైట్ ఫ్యాక్టరీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వంద సంవత్సరాల తరువాత సమగ్ర భూసర్వే జరుగుతోందని అన్నారు. ఎటువంటి భూవివాదాలు లేకుండా అత్యంత శాస్త్రీయ విధానంలో జరుగుతున్న ఈ సర్వే కోసం దాదాపు 3 కోట్ల సర్వేరాళ్ళు అవసరమని అన్నారు. గ్రానైట్ తో తయారు చేసే ఈ రాళ్ళ ఆర్డర్ లను రాష్ట్రంలోని గ్రానైట్ ఫ్యాక్టరీలకు ఇవ్వడం ద్వారా వారికి పని కల్పించడం, ఆర్థికంగా వారిని బలోపేతం చేయడం ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే పలు జిల్లాల్లో ఫ్యాక్టరీ నిర్వాహకులు ముందుకు వచ్చారని, మరిన్ని ఎక్కువ గ్రానైట్ ఫ్యాక్టరీలు ఈ సర్వేరాళ్ళను తయారు చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు, వారిని ప్రోత్సాహాన్ని అందించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. 


3) మొత్తం దేశంలోనే మన రాష్ట్రంలోనే అత్యంత వేగంగా సమగ్ర భూసర్వే జరుగుతోందని అన్నారు. ఇందుకోసం కనీసం రోజుకు లక్ష సర్వే రాళ్ళు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే గ్రానైట్ లీజుదారుల నుంచి ఉచితంగా ముడిరాయిని సర్వేరాళ్ళ కోసం అందిస్తున్నామని తెలిపారు. అయితే సర్వేరాళ్ళను సిద్దం చేసి అందించడంలో అనుకున్న లక్ష్యంకు అనుగుణంగా ఫ్యాక్టరీలు పనిచేయడం లేదని, అందుకు గల కారణాలను, అడ్డంకులను సమీక్షించేందుకు ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలను స్వీకరిస్తున్నామని తెలిపారు. 


4) గ్రానైట్ లీజుదారుల నుంచి ఉచితంగా అందిస్తున్న ముడిరాయిలో నాణ్యత లేకపోవడం వల్ల రాళ్ళ తయారీలో వ్యయం పెరుగుతోందని, బయటి నుంచి ముడిరాయిని కొనుగోలు చేసి సర్వే రాళ్ళను అందించేందుకు ఫ్యాక్టరీ నిర్వాహకులు సిద్దంగా ఉన్నామంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందుకు గానూ ప్రస్తుతం ఇస్తున్న రేటును పెంచేందుకు ప్రభుత్వం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రానైట్ సర్వేరాళ్ళ రవాణాను కూడా తయారీదారులకే అప్పగించాలని కోరారు. 


5) దీనిపై స్పందించిన మంత్రి గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని, రేటు విషయంలో సహేతుకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే సర్వేరాళ్ళ తయారీదారులకే రవాణా కాంట్రాక్ట్ ను కూడా ఇస్తామని భరోసా ఇచ్చారు.  ప్రభుత్వం ఈ ఏడాది ఆఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా భూసర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, అందుకు అవసరమైన సర్వేరాళ్ళను సిద్దం చేసి అందించాలని కోరారు. 


*లక్ష్యాలకు అనుగుణంగా మైనింగ్ రెవెన్యూ*


6) అనంతరం మైనింగ్ రెవెన్యూపై గనులశాఖ అధికారులతో  మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వైయస్ జగన్ గారు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత గనులశాఖలో పలు సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. ఈ మూడేళ్ళలో గనులశాఖ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూలో పురోగతిని సాధించామని తెలిపారు.  2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 2068 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 2790 కోట్లు మైనింగ్ రెవెన్యూ సాధించామని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.4500 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే రూ. 3414 కోట్లు ఆర్జించడం జరిగిందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం లక్ష్యాన్ని అధిగమించి మొత్తం రూ.5010 కోట్ల రూపాయలను సాధిస్తామని, ఈ అంచనాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు. 


7) రాష్ట్రంలో మైనింగ్ కార్యక్రమాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా నాన్ వర్కింగ్ లీజుల్లో మైనింగ్ కార్యక్రమాలు ఊపందుకున్నాయని అన్నారు. రాష్ట్రంలో 5009 క్వారీ లీజులు ఉండగా వాటిల్లో 2285 లీజుల్లో మైనింగ్ జరుగుతోందని తెలిపారు. మిగిలిన వాటిల్లో కూడా మైనింగ్ ప్రారంభించేలా గనులశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


8) మైనింగ్ రంగంలో ఔత్సాహికులకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఈ-ఆక్షన్ విధానంను ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. దీనిలో భాగంగా మైనర్ మినరల్స్ కు సంబంధించి ఈ రోజు వరకు మొత్తం 505 ఏరియాలకు ఈ-ఆక్షన్ విధానంను వర్తింప చేశామని, దీనిలో 106 ఏరియాలకు లీజుల ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. మరో 110 ఏరియాలకు లీజు ప్రక్రియ దశలో ఉందని, అలాగే 395 ఏరియాలకు లీజుల జారీ ప్రక్రియ ముగింపు దశలో ఉందని వెల్లడించారు. ఈ-ఆక్షన్ పై మైనింగ్ పై ఆసక్తి ఉన్న వారిలో అవగాహన కల్పించేందుకు ఇతర రాష్ట్రాల్లో కూడా రోడ్ షోలను నిర్వహిస్తున్నామని అన్నారు. 

     

9) 2023 మార్చి నాటికి  చాలా మైనింగ్ లీజుల రెన్యువల్స్ గడువు అయిపోతుందని,  వాటిని కూడా రెన్యువల్ చేయాలని అధికారులను ఆదేశించారు. సుమారు 700 వరకు ఇలాంటి లీజులు ఉన్నాయని, వాటిని రెన్యువల్ చేయడం ద్వారా  రూ.150 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని తెలిపారు.


10) ఈ సమావేశంలో గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనులశాఖ సంచాలకులు విజి వెంకటరెడ్డి, గనులశాఖ సంయుక్త కార్యదర్శి డి.రమాదేవి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Comments