కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ ఉపయోగకరమైనది




విజయవాడ (ప్రజా అమరావతి);


*కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ ఉపయోగకరమైనది


*

*బడ్జెట్ లో ఏపీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం*

*రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు అనువుగా బడ్జెట్ లో కొన్ని నిర్ణయాలు*

*ప్రతి రాష్ట్రానికి రోడ్లు, రైల్వే, ఎయిర్ పోర్టులు, పోర్టులు తదితర అంశాల్లో ప్రయోజనం*

*ఆర్థిక లోటు తగ్గడం శుభ పరిణామం*

*వ్యక్తిగత పన్ను రాయితీల ప్రకటనపై హర్షం.. పన్నుదారులకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడి*

*నర్సింగ్ కాలేజీలు, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు, ఐటీడీఏ, ఆక్వాకల్చర్, గృహనిర్మాణం, ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు వంటివి రాష్ట్రానికి ఉపయోగపడే  అంశాలు* ..

*పంప్ స్టోరేజ్ విధానంలో ప్రపంచానికే ఏపీ రోల్ మోడల్*

*అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానం* - *రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


దేశంలోని అన్ని రాష్ట్రాలతో నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సలహాలు, సూచనలను కేంద్రం పరిగణలోకి తీసుకోవడంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్  కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం విజయవాడ బందర్ రోడ్డులోని ఆర్ అండ్ బి బిల్డింగ్ 5వ అంతస్తులో నిర్వహించిన మీడియా సమావేశంలో  కేంద్ర బడ్జెట్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న అనంతరం  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రస్తుత పరిస్థితికి ఉపయోగపడే విధంగా ఉందన్నారు. బడ్జెట్ లో పేర్కొన్న ఆదాయపు పన్ను శ్లాబ్‌ రేట్లు ఊరటనిచ్చాయని, వ్యక్తిగత పన్నురాయితీల నిర్ణయంపై ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన కొన్ని విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని బడ్జెట్ లో పొందుపర్చడం హర్షించదగిన పరిణామమన్నారు. ఏపీ ప్రభుత్వ సూచనలు అన్ని రాష్ట్రాలకు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయన్నారు. 


ఏపీ ప్రతిపాదనను పరిగణించి అర్బన్ ఇన్ ఫ్రా డెవలప్ మెంట్ ఫండ్ దేశ వ్యాప్తంగా ప్రారంభం కావడం గర్వకారణమన్నారు. ఇది ప్రతి రాష్ట్రానికి లాభం చేకూరుస్తుందన్నారు. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో 40 శాతం, కేవలం రొయ్యల ఉత్పత్తిలోనే 60 శాతం గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటి మేతకు సంబంధించిన దిగుమతి సుంకం తగ్గించాలన్న విజ్ఞప్తిని కేంద్రం స్వీకరించినట్లు తెలిపారు. ప్రధానంగా ఏపీ ప్రతిపాదించిన 4 అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించి బడ్జెట్ లో పొందుపర్చిందన్నారు. 


ప్రముఖంగా బడ్జెట్ లో పీఎం ఆవాస్ యోజన నిధులు 66 శాతానికి పెంచడం, కొత్త రైల్వే నిర్మాణానికి పెద్దపీట వేయడం, మూలధనం క్రింద రూ.10 లక్షల కోట్లు కేటాయించడం, దేశవ్యాప్తంగా 157 కొత్త నర్సింగ్ కాలేజీల ఏర్పాటు, యువత, పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నేషనల్ డిజిటల్ లైబ్రరీలు, దేశవ్యాప్తంగా కొత్త ఎయిర్ పోర్టులు, పోర్టులు, హెలిప్యాడ్ ల నిర్మాణం, వ్యవసాయానికి సంబంధించిన కొత్త విధానాలు నేర్చుకునేందుకు ఏర్పాటు చేసిన ఫండ్, ప్రకృతి వ్యవసాయ విధానం, రాష్ట్రంలో అంతర్జాతీయ తరహాలో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు, ఏకలవ్య స్కూళ్ల ప్రకటన, ఐటీడీఏ, ఆక్వాకల్చర్  వంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ కు ప్రయోజనం చేకూరుస్తాయన్నారు.  నియోజకవర్గానికి ఒకటి చొప్పున  నైపుణ్య కేంద్రాల ఏర్పాటుతో రాష్ట్రానికి సంబంధించిన 50వేల మంది యువతీ యువకుల్లో నైపుణ్యాన్ని వెలికి తీయడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. 


గతేడాది 41.87 లక్షల కోట్లుగా ఉన్న కేంద్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు పెరిగి  45 లక్షల కోట్లకు బడ్జెట్ చేరిందన్నారు. మూలధన వ్యయం(కేపిటల్ ఎక్ప్ పెండిచర్)  సవరించిన అంచనాల ప్రకారం గతేడాది రూ.7.28 లక్షల కోట్లుండగా ఈ సంవత్సరం రూ.10 లక్షల కోట్లకు చేరింది అంటే 2.5 లక్షల కోట్లు మూలధన వ్యయం పెరిగిందన్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లలో ద్రవ్యలోటు 6.4 శాతం నుండి 5.9 శాతానికి తగ్గడం దేశానికి మంచి పరిణామంగా పేర్కొన్నారు. పన్ను ద్వారా వచ్చిన ఆదాయం ప్రస్తుతం రూ. 33.60 లక్షల కోట్లుగా ఉండగా, 2022-23 లో రూ.30.43 లక్షల కోట్లుగా ఉందంటే 3 లక్షల కోట్లు పెరిగిందన్నారు. ఇందులో  ఆంధ్రప్రదేశ్ వాటా 2022-23 ఏడాదికిగానూ 9.15 లక్షల కోట్లు కాగా, ఇప్పుడు అది రూ.10 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారన్నారు. పన్ను, పన్నేతర ఆదాయాలు మొత్తంగా చూస్తే గతేడాది సవరించిన అంచనాల ప్రకారం  రూ.23.48 లక్షల కోట్లు కాగా ఇప్పుడు రూ.26.32 లక్షల కోట్లు అయింది అంటే 3 లక్షల కోట్లు పెరిగిందన్నారు. అప్పు గతేడాది రూ.17.58 లక్షల కోట్లు కాగా ఈ ఏడాది రూ.17.98 లక్షల కోట్లుగా ఉంది అంటే ఇంచు మించు 50 వేల కోట్లు పెరిగిందన్నారు. రాబడి రూ.41.90 లక్షల కోట్లు కాగా ఈ సారి 45 లక్షల కోట్లు అన్నారు.ఖర్చుల్లో కొన్ని రంగాల్లో కేటాయింపులు తక్కువగా, మరికొన్నింటిలో ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎరువులు, యూరియా, బియ్యం, గోధుమలు సబ్సిడీకి కేటాయింపులు తగ్గాయని, వ్యవసాయానికి కేటాయింపులు తగ్గించి, రోడ్లు, రైల్వేలకు పెంచారని మంత్రి తెలిపారు. పెట్రోల్, డీజిల్ మీద 7వేల కోట్లు ఖర్చు తగ్గిందన్నారు. విద్యకు రూ.13 వేల కోట్లు, విద్యుత్ కు రూ.25 వేల కోట్లు కేటాయింపులు పెరిగాయన్నారు. కోవిడ్ విపత్తు వల్ల కేంద్రం, రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేయడం వల్ల గతేడాది కన్నా రూ.లక్షా 20వేల కోట్లు అధికంగా వడ్డీ పెరిగిందన్నారు. రోడ్లు, రవాణా కేటాయింపులు 3.90 లక్షల కోట్ల నుండి 5.17 లక్షల కోట్లకు పెరగడం హర్షణీయమన్నారు. గ్రామాల్లో పనికి ఆహార పథకానికి సంబంధించిన ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు తగ్గగా, జల్ జీవన్ మిషన్లో రూ.15వేల కోట్లకు కేటాయింపులు పెరిగాయన్నారు. కేంద్ర బడ్జెట్ లో స్టార్టప్ లకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక ఫండ్ కేటాయించడం జరిగిందన్నారు. వ్యవసాయానికి సంబంధించిన అప్పు 20 లక్షల కోట్లుగా బడ్జెట్ లో పొందుపరచడం జరిగిందన్నారు. హౌసింగ్ స్కీమ్ (పీఎంఆవాస్ యోజన) దాదాపు 66 శాతం పెంపుదలతో 79 వేల కోట్లకు చేరిందన్నారు. ప్రధానంగా వ్యవసాయం, పౌర సరఫరాలకి కేటాయింపులు తక్కువగా, రోడ్లు, రవాణా, మౌళిక వసతులకు కేటాయింపులు ఎక్కువగా ఉన్నాయన్నారు.


ప్రతి ఒక్కరి అభివృద్ధే లక్ష్యంగా 'సప్తరుషులు'పేరుతో 7 ముఖ్యమైన రంగాలకు ప్రాధాన్యతనిచ్చే నేపథ్యంతో 2023-24 కేంద్ర బడ్జెట్ రూపకల్పన చేశారన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రతి ఒక్కరికి సంబంధించిన అభివృద్ధి, చివరి వరకు అభివృద్ధి కార్యక్రమాలు కేటాయింపులు లేక ఆగిపోవడం, రోడ్లు, రైల్వేలు, టెలి కమ్యూనికేషన్లు, దేశశక్తిని వెలికి తీయడం, కాలుష్య రహితమైన సౌర, వాయు, గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్ పై ప్రత్యేక శ్రద్ధ, యువశక్తిని వెలికి తీయడం, ఆర్థిక రంగానికి సంబంధించిన అంశాలతో కూడిన బడ్జెట్ ను రూపకల్పన చేయడం జరిగిందన్నారు.


అప్పర్ భద్ర ప్రాజెక్టుకు  బడ్జెట్ లో మైక్రో ఇరిగేషన్ క్రింద రూ.5,300 కోట్లు కేటాయింపులు చేయడం జరిగిందన్నారు. తుంగభద్ర బేసిన్ అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 


పంప్ స్టోరేజ్ విధానంలో ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభివర్ణించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో అతిపెద్ద పంప్ స్టోరేజ్ యూనిట్ తయారవుతుందన్నారు. రాష్ట్రంలో అనువైన చోట సంబంధిత యూనిట్ లు పెట్టేందుకు స్థలాల పరిశీలన జరుగుతుందన్నారు. వీటిని మరింత అభివృద్ధి చేసేందుకు పాలసీ తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. మొత్తంగా బడ్జెట్ విషయంలో సామాన్య మానవుడి తరపున రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.



Comments