మహిళల భద్రత,రక్షణకు అత్యదిక ప్రాధాన్యత నిస్తున్న ప్రభుత్వం

 *మహిళల భద్రత,రక్షణకు అత్యదిక ప్రాధాన్యత నిస్తున్న ప్రభుత్వం*


*•తాడేపల్లి మైనర్ బాలికను హత్య చేసిన నిందితుని గంటలోపే అదుపులోకి తీసుకున్న పోలీసులు*

*రాష్ట్ర  హోమ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ మంత్రి  తానేటి వనిత*

                                                                   

అమరావతి, ఫిబ్రవరి 14 (ప్రజా అమరావతి):  రాష్ట్రంలోని మహిళల భద్రత, రక్షణకు జగనన్న ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నట్లు రాష్ట్ర హోమ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.  నిందితులు ఎంతటివారైనా సరే తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు.  మంగళవారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో  మంత్రి  పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 12 వ తేదీ అర్థరాత్రి  గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక మైనర్ బాలికపై నేరచరిత్ర ఉన్న  వ్యక్తి దాడిచేసి హత్యచేయడం ఎంతో దురదృష్టకరమైన విషయమన్నారు. మధ్యం మత్తులోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడటం జరిగిందని, గంజాయి మత్తు ఇందుకు ఏమాత్రం  కారణం కాదని ఆమె తెలిపారు.  వ్యక్తిగత  గొడవలే ఈ హత్యకు  కారణమని  ఆమె  స్పష్టం చేశారు.  ఈ దుర్ఝటనపై ప్రభుత్వం వెంటనే స్పందించడం వల్ల నిందితుని ఒక గంటలోపే పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు పంపడం జరిగిందన్నారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వెంటనే ప్రకటించడం జరిగిందని ఆమె తెలిపారు.  అయితే ఈ దురదృష్టకర సంఘటనను ఆధారంగా చేసుకుని ప్రదాన ప్రతిపక్ష పార్టీకి చెందిన పలువురు నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవాలు లేవని ఆమె ఖడించారు. 

                                                                                                                                                                                        రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బాధ్యతలను చేపట్టినప్పటి నుండి  రాష్ట్రంలో మహిళల భద్రతకు, రక్షణకు, సాధికారతకు అధిక ప్రాధాన్యత నిస్తూ పలు వినూత్న కార్యక్రమాలను, పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.  రాష్ట్రంలోని మహిళల భద్రతకు, రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దిశా చట్టాన్ని రూపొందించి కేంద్రం ఆమోదానికి పంపడం జరిగిందన్నారు. అదే విధంగా ఆపదలో నున్న మహిళలను వెంటనే రక్షించేందుకు దిశా యాప్ ను కూడా అమల్లోకి తేవడం జరిగిందని,  ఇప్పటి వరకూ  1.30 కోట్ల మంది  మహిళలు ఈ  యాప్ ను తమ స్మార్టు ఫోన్లలోకి డౌన్ లోడ్ చేసుకోవడం జరిగిందన్నారు. తొమ్మిది వందలకు పైబడి మహిళలు ఈ యాప్ ద్వారా ఇప్పటికే  రక్షణ పొందడం జరిగిందని తెలిపారు.   తప్పు ఎవరు చేసినా..ఎలాంటి వారు చేసినా.. ఎటు వంటి పక్షపాతం చూపకుండా  24 గంటల్లోపే తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. పోలీస్ శాఖ పనితీరుకు ఇదే నిదర్శనమని ఆమె అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి స్నేహపూర్వక పోలీస్ విధానాన్ని, జీరో ఎఫ్.ఐ.ఆర్. విధానాన్ని అమల్లోకి తేవడమే కాకుండా నేడు టూరిస్టు పోలీస్ స్టేషన్లను కూడా  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగిందని ఆమె తెలిపారు.  దేశ, విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల భద్రత, రక్షణకు ఈ టూరిస్టు పోలీస్ స్టేషన్లు ఎంతగానో దోహదపడతాయని ఆమె ఆకాంక్షించారు. 

                                                                                                                                                                           రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణా పై జగనన్న ప్రభుత్వం  ఉక్కుపాదం మోపిందని,  రెండు లక్షల కేజీల గంజాయిని పట్టుకోవడమే కాకుండా ఏజన్సీలో గంజాయి సాగును  పూర్తిగా నియంత్రించడం జరిగిందని ఆమె తెలిపారు. గంజాయి సాగుపై ఆధారపడిన  గిరిజన రైతులను  ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసుకునే విధంగా మళ్లించడం జరిగిందని ఆమె తెలిపారు.  రాష్ట్రంలో   నాటు సారా తయారీని కూడా పూర్తిగా  నియంత్రించడం జరిగిందని, అందుకై  అదిక మొత్తంలో బెల్లం వ్యాపార చేసే వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆమె తెలిపారు.

                                                                                                                                                                                          రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మహిళల భద్రత, రక్షణ, సాధికారత అంశాలకు  జగనన్న ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తూ పలు వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ  ప్రధాన ప్రతి పక్ష నాయకులు ఏదో విధంగా పలు ఆరోపణలు చేయడమే పరిపాటి అయిందని ఆమె వాపోయారు. గతంలో వారి హయాంలో మహిళకు ఏమాత్రం భద్రత లేకపోవడమే కాకుండా దోషులకు శిక్షలు పడకుండా కొమ్ముకాసేవారని, కాని ప్రస్తుతం అటు వంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవని, తప్పుచేసిన వారు ఎటు వంటి వారైనా 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటూ నిందితులకు శిక్ష విధించడం జరుగుతున్నది మంత్రి తెలిపారు. 

                                                                                                                                                                                         రాష్ట్ర హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి  హరీష్ కుమార్  గుప్తా, డి.ఐ.జి. సి.ఎం.త్రివిక్రమ వర్మ, ఎస్.పి. అనిల్ పులిపాటి ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

                                                                                                                                                                              

Comments