కైకలూరు టీడీపీలో అనిశ్చితికి చెక్ పెడుతున్న పిన్నమనేని కుటుంబం

 *- కైకలూరు టీడీపీలో అనిశ్చితికి చెక్ పెడుతున్న పిన్నమనేని కుటుంబం


 *- కష్టకాలంలో కొమ్ము కాస్తున్న బాబాయ్, అబ్బాయ్ లు*

 *- పిన్నమనేని రాకతో కైకలూరు టీడీపీకి పూర్వ వైభవం* 

 *- సీటిస్తే పోటీకి సిద్ధమంటూ పిన్నమనేని సంకేతాలు* 

 *- చంద్రబాబు ఆదేశాల కోసం వర్గమంతా ఎదురుచూపులు* 

 *- పిన్నమనేని గూటికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్న నేతలు* 

 *- పాత, కొత్తతరంతో కళకళలాడుతున్న పిన్నమనేని శిబిరం* 


కైకలూరు /ఏలూరు జిల్లా, ఫిబ్రవరి 20 (ప్రజా అమరావతి): ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అనిశ్చితికి చెక్ పెట్టే దిశగా పిన్నమనేని కుటుంబం పావులు కదుపుతోంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ టీడీపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జయమంగళకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వాన్ని వైసీపీ అధిష్ఠానం కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసేందుకు పిన్నమనేని కుటుంబం నుండి బాబాయ్, అబ్బాయ్ లు పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జిలు సిద్ధమయ్యారు. జడ్పీ మాజీ చైర్మన్ దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు బ్యాగ్రౌండ్ తో రాష్ట్రంలోనే అతిపెద్ద పిన్నమనేని కుటుంబం దాదాపు 14 ఏళ్ళ తర్వాత కైకలూరు నియోజకవర్గం నుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం తెలుగుదేశం పార్టీకి శుభపరిణామంగా చెబుతున్నారు. 2004 ఎన్నికల్లో ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన పిన్నమనేని వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ముదినేపల్లి నియోజకవర్గం రద్దు కావడం జరిగింది. అప్పటి నుండి కైకలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితులు ఏమాత్రం కలిసి రాలేదు. మరోవైపు గుడివాడ రాజకీయాల్లోనూ రాణించలేకపోయారు. పిన్నమనేని కుటుంబంలో ఎమ్మెల్యే స్థాయి నాయకత్వం ఉన్నప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన జిల్లాల విభజన తదితర కారణాలతో 2009 నుండి నామినేటెడ్ పదవులకే పరిమితం కావాల్సి వచ్చింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ రాజీనామాతో తాజాగా కైకలూరు అసెంబ్లీపై పిన్నమనేని కుటుంబం దృష్టి పెట్టింది. కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో పిన్నమనేని కుటుంబానికి మంచి పట్టు కూడా ఉంది. కైకలూరు, కలిదిండి మండలాల్లోనూ పిన్నమనేనికి బలమైన వర్గం కూడా కొనసాగుతూ వస్తోంది. జడ్పీ మాజీ చైర్మన్ దివంగత పిన్నమనేని కోటేశ్వరరావుకు కొల్లేరు లంక గ్రామాలపై ఉన్న పట్టు అంతా ఇంతా కాదు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆ తర్వాత ఆప్కాబ్ చైర్మన్ గా పనిచేసిన పిన్నమనేని వెంకటేశ్వరరావు కూడా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగింది. ఈ పరిస్థితుల్లో పిన్నమనేని రాకతో కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి తిరిగి పూర్వవైభవం రావడం ఖాయంగా కన్పిస్తోంది. పిన్నమనేని కుటుంబంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నేత పిన్నమనేని బాబ్జిలలో ఎవరికి సీటిచ్చినా పోటీకి సిద్ధమంటూ సంకేతాలు కూడా ఇచ్చారు. చంద్రబాబు ఆదేశాల కోసం పిన్నమనేని కుటుంబంతో పాటు పిన్నమనేని వర్గమంతా ఎదురుచూస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఇతర పార్టీల్లో కొనసాగుతున్న నేతలంతా ఒక్కొక్కరుగా పిన్నమనేని గూటికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా పాత తరం నేతలు కూడా వస్తుండడంతో పిన్నమనేని శిబిరం కళకళలాడుతోంది.

Comments