*- చంద్రబాబును కలిసిన మాజీ ఎమ్మెల్యే రావి*
*- గుడివాడ టీడీపీ సీటుకు లైన్ క్లియర్*
*- నియోజకవర్గ పరిస్థితులపై చంద్రబాబు ఆరా*
*- రావి గ్రాఫ్ పెరగడంపై అధినేత సంతృప్తి*
*- పూర్తి సహకారం ఉంటుందని చంద్రబాబు హామీ*
*- 2024 ఎన్నికల్లో పోటీచేసి ఖచ్చితంగా గెలుస్తా*
*- మీడియాతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి*
మంగళగిరి (గుడివాడ), ఫిబ్రవరి 10 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు కలిశారు. గత పది రోజుల కిందట చంద్రబాబును కలిసేందుకు రావి అపాయింట్మెంట్ కోరారు. ఈ మేరకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో కలవడానికి రావికి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీటును రావికి క్లియర్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. మొదటి నుండి గుడివాడ సీటును చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనిలో భాగంగానే మాజీ ఎమ్మెల్యే రావిని నియోజవర్గ ఇన్చార్జిగా నియమించినట్టు చంద్రబాబు స్వయంగా చెప్పుకొచ్చారు.
చంద్రబాబు ఆదేశాలతో బాడుడే బాదుడు కార్యక్రమం ద్వారా రావి ప్రజల్లోకి వెళ్లారు. రోజుకు ఐదారు గంటల పాటు ప్రజల మధ్యలోనే గడపడంతో ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. తాజాగా నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి కూడా అంతకుమించిన స్పందన వస్తోంది. ఇదిలా ఉండగా చంద్రబాబును కలిసిన రావి గుడివాడ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను పూర్తిగా వివరించారు. చంద్రబాబు దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఇటీవల కాలంలో రావి గ్రాఫ్ బాగా పెరిగినట్టుగా తెలుస్తోంది. మరింత కష్టపడి పని చేయాలని రావిని చంద్రబాబు ఈ సందర్భంగా ఆదేశించారు కూడా. గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానిని ఢీ కొట్టగల సత్తా రావికి ఉందని చంద్రబాబు నిర్ధారణకు వచ్చేసారు. రావి ఆర్థిక పరిస్థితులను కూడా అర్థం చేసుకున్న చంద్రబాబు పార్టీ నుండి కొంత సహకారం అందించడం జరుగుతుందని ఇప్పటికే ప్రకటించారు. దీంతో రావి అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయినట్టుగా టిడిపి శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి.
చంద్రబాబుతో సమావేశం అనంతరం రావి మీడియాతో మాట్లాడారు. గత పది రోజులు కిందట చంద్రబాబు అపాయింట్మెంట్ కోరానని, దీనిలో భాగంగానే ఆయనను కలవడం జరిగిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన భరోసాతో గుడివాడ టిడిపి ఇన్చార్జిగా పనిచేస్తున్నానని తెలిపారు. 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ఖచ్చితంగా గెలుస్తానన్నారు.
ఏం పీకుతారని అంటున్న ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రజలే పీకి చూపిస్తారన్నారు. వైసిపి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి, కొడాలి నానిపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో గ్రూపులు లేవన్నారు. చంద్రబాబు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వాన్ని, కొడాలి నానిని ఓడకొట్టడానికి ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు వంటి అందరి సహకారం తీసుకుంటానన్నారు. ముఖ్యంగా గుడివాడలో కొడాలి నానిని ఓడించేందుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడమే తన లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే రావి చెప్పారు.
addComments
Post a Comment