ప్రాజెక్టు పూర్తి చేసేదీ....నిర్వాసితులకు న్యాయం చేసేదీ టీడీపీనే:- చంద్రబాబు నాయుడు*టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు*


*ప్రాజెక్టు పూర్తి చేసేదీ....నిర్వాసితులకు న్యాయం చేసేదీ టీడీపీనే:- చంద్రబాబు నాయుడు*


అమరావతి (ప్రజా అమరావతి):-పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు నేతృత్వంలో పెదఆరవీడు మండల రైతులు చంద్రబాబును కలిశారు. ప్రాజెక్టు నిర్వాసితులైన తమకు వైసిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలని వాళ్ళు తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద తెలుగు దేశం ప్రభుత్వం రూ.12.5 లక్షలు ఇచ్చేందుకు నాడు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. అయితే తాము అధికారంలోకి వస్తే రూ.18 లక్షల ఇస్తామని వైసిపి నేతలు ప్రకటించినప్పటికీ....దాన్ని అమలు చేయలేదని నిర్వాసితులు వాపోయారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు కావస్తున్నా పరిహారం ఇవ్వలేదని అన్నారు. తెలుగు దేశం ప్రభుత్వం వచ్చిన తరువాత మెరుగైన ప్యాకేజ్ ఇవ్వడంతో పాటు కొత్త కట్ ఆఫ్ డేట్ ప్రకారం పరిహారం అందేలా చూడాలని నిర్వాసితులు చంద్రబాబు ను కోరారు. ఈ సందర్భంగా నిర్వాసితులతో టీడీపీ అధినేత మాట్లాడుతూ....ఉమ్మడి ఎపిలో టీడీపీ అధికారంలో ఉన్న సమయం లో ప్రకాశం జిల్లా కరువు ప్రాంత అవసరాలను గుర్తించి తాను వెలిగొండ ప్రాజెక్టుకు తలపెట్టినట్లు తెలిపారు. 2004 తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు సాగలేదని అన్నారు. అయితే 2014 తరువాత మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టర్ల తో ఉన్న ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించి పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు. 2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ప్రాజెక్ట్ లో మిగిలిఉన్న 10 శాతం పనులను కూడా పూర్తి చెయ్యలేకపోయిందని దుయ్యబట్టారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 కే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయ్యేది అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా జగన్ నాశనం చేశాడని...సిఆర్డిఎకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు వసూలు కోసం నేరుగా రావడం రాష్ట్ర దుస్థితికి నిదర్శనం అన్నారు. ఒకప్పుడు తెలంగాణలో భూముల రేట్లు తక్కవ ఉండేవి...ఇప్పుడు వైసిపి పాలనలో ఎపిలో భూముల రేట్లు పడిపోయి తెలంగాణలో రేట్లు పెరిగాయని అన్నారు. ఇప్పటికీ రాజధాని విషయంలో లేని అధికారం ఉందని చెపుతూ జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు కు నాడు శంకుస్థాపన చేసింది తానేనని...మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆపనులను పూర్తి చేసి ప్రాజెక్ట్ ను ప్రారంభించేదీ తామేనని చంద్రబాబు నాయుడు అన్నారు. నిర్వసితులకు మెరుగైన ప్యాకేజ్ ఇవ్వడంతో పాటు వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

Comments