చంద్రబాబు అవకాశం ఇస్తే కైకలూరు నుండి పోటీకి సిద్ధం.

 *- చంద్రబాబు అవకాశం ఇస్తే కైకలూరు నుండి పోటీకి సిద్ధం* 


 *- మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు* గుడివాడ, ఫిబ్రవరి 27 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అవకాశం ఇస్తే ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. కైకలూరులో జడ్పీ మాజీ చైర్మన్ దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కైకలూరు నియోజకవర్గంతో పిన్నమనేని కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. తన తండ్రి దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు రెండుసార్లు, తాను మూడుసార్లు ముదినేపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యామన్నారు. ముదినేపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న మండవల్లి, ముదినేపల్లి మండలాలపై పూర్తి అవగాహన కల్గివున్నామన్నారు. మండవల్లి సమితి అధ్యక్షుడిగా పనిచేసిన దివంగత కోటేశ్వరరావు లంక గ్రామాల్లో ప్రజలకు ఎనలేని సేవలందించారన్నారు. కొల్లేరు లంక గ్రామాల్లో పిన్నమనేని కుటుంబానికి మంచి పట్టు ఉందని తెలిపారు. ముఖ్యంగా కైకలూరులో రంగం అభివృద్ధికి కృషి చేసిన వారిలో దివంగత కోటేశ్వరరావు ఒకరని గుర్తుచేశారు. తన తండ్రి దగ్గర నుండి ముదినేపల్లి నియోజకవర్గానికి సేవ చేసుకునే అవకాశం లభించిందన్నారు. అప్కాబ్ చైర్మన్ గా ఉన్న సమయంలో కైకలూరు నియోజకవర్గంలోని రైతాంగానికి తనవంతు సేవలందించానని తెలిపారు. కైకలూరు నియోజకవర్గంతో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఇక్కడి నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్ళామన్నారు. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను కూడా వివరించామన్నారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాలతో ఉన్న సన్నిహిత సంబంధాలను తెలియజేశామన్నారు. కైకలూరు నియోజకవర్గంలోని రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు. గ్రామగ్రామాన ఉన్న పిన్నమనేని అభిమానులు, అనుచరులతో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ముదినేపల్లి అసెంబ్లీ రద్దయిందన్నారు. రద్దయిన ముదినేపల్లి నియోజకవర్గంలోని మండవల్లి, ముదినేపల్లి మండలాలు కైకలూరు అసెంబ్లీలో చేరడంతో ఇక్కడి నుండి టీడీపీ తరపున పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్నామన్నారు. కైకలూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జయమంగళ వెంకటరమణ పార్టీని వీడడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కైకలూరు సీటును కేటాయిస్తే పోటీ చేయడం జరుగుతుందని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు తెలిపారు.

Comments