*- చంద్రబాబు ఆదేశాలతో గన్నవరం చేరుకున్న మాజీ ఎమ్మెల్యే రావి*
*- పోలీసుల హౌస్ అరెస్ట్ ల వలయాన్ని చేధించారు*
*- టిడిపి శ్రేణులతో కలిసి బైక్ పై గన్నవరం కోర్టుకు*
*- పట్టాభి సహా 11 మంది నేతలను కలిసిన రావి*
*- తాజా పరిణామాలపై గన్నవరం టీడీపీ శ్రేణులతోనూ చర్చ*
గుడివాడ, ఫిబ్రవరి 21(ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాలతో కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మంగళవారం గన్నవరం చేరుకున్నారు. పోలీసుల హౌస్ అరెస్ట్ ల వలయాన్ని చేధించుకుని టీడీపీ శ్రేణులతో కలిసి బైక్ పై చాకచక్యంగా గన్నవరం కోర్టుకు రాగలిగారు. పోలీసులు అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి సహా 11 మంది టీడీపీ నేతలను కలుసుకున్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి, వాహనాలను తగలబెట్టడం, నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడంపై అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని రావి వివరించారు. ఈ పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేశారని తెలిపారు. అలాగే గన్నవరం ఘటనపై చంద్రబాబు బహిరంగ లేఖను కూడా విడుదల చేసినట్టు పట్టాభి, ఇతర టీడీపీ నేతలకు రావి తెలియజేయడం జరిగింది. పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు చెప్పారంటూ వారిలో రావి ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రావి మాట్లాడుతూ పట్టాభి సహా 11 మంది టీడీపీ నేతలను గన్నవరం అదనపు జూనియర్ కోర్టుకు పోలీసులు తరలించారని చెప్పారు. గన్నవరంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు, హింసాత్మక ఘటనలను చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఫర్నీచర్, కంప్యూటర్లు, అద్దాలను పగలగొట్టారని, వాహనాలకు నిప్పంటించారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా ఇంటిపై కూడా దాడులకు తెగబడ్డారన్నారు. కుటుంబ సభ్యులను కూడా ఫోన్లలో బెదిరించారన్నారు. దొంతు చిన్నా ఇంటి దగ్గర ఉన్న వాహనాలు, స్కూటర్లను కూడా తగలబెట్టారన్నారు. పట్టాభిని గన్నవరం పోలీస్ స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారన్నారు. కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో వారంతా ఆందోళనకు గురయ్యారన్నారు. పట్టాభితో పాటు దొంతు చిన్నా ప్రాణాలకు కూడా ముప్పు ఉందని, పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు అండగా ఉంటామని చంద్రబాబు, నారా లోకేష్ లు భరోసా ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దురాగతాలను టీడీపీ శ్రేణులు సమర్ధవంతంగా ఎదుర్కోవడం. జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రావి తెలిపారు. అనంతరం చంద్రబాబు ఆదేశాల మేరకు గన్నవరం టీడీపీ శ్రేణులను కలిశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటామంటూ వారిలో ధైర్యం నింపారు. పట్టాభి సహా 11 మంది టీడీపీ నేతల అరెస్ట్ ల తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై కూడా గన్నవరం టీడీపీ కార్యకర్తలు, నేతలతో మాజీ ఎమ్మెల్యే రావి చర్చించడం జరిగింది.
addComments
Post a Comment