ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రావి.

 *- ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రావి* 


 *- భీమిలిలో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగాలు* 

 *- వేపాడను అత్యధిక మెజార్టీతో గెల్పించాలని పిలుపు* భీమిలి/ విశాఖ. ఫిబ్రవరి 28 (ప్రజా అమరావతి): ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా భీమిలి నియోజకవర్గంలో కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి కోరాడ రాజబాబు, ఇతర పార్టీ ముఖ్య నేతలతో కలిసి కే. నగరపాలెం పంచాయతీ పరిధిలో ఓటర్లను కలిశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వేపాడ చిరంజీవిరావుకు మద్దతు ఇవ్వాలని అభ్యర్ధించారు. అలాగే భీమునిపట్నంలోని సెయింట్ యాన్స్ ఎయిడెడ్ స్కూల్ టీచర్లను కలిశారు. వేపాడకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెల్పించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని పట్టభద్రులతో మాజీ ఎమ్మెల్యే రావి మమేకమయ్యారు. వేపాడకు ఓటు వేసి శాసనమండలిలో తమ గొంతును వినిపించేందుకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఓటర్లను ఆకట్టుకునేలా మాజీ ఎమ్మెల్యే రావి ప్రసంగాలు కొనసాగాయి. అనంతరం రావి మాట్లాడుతూ విద్యావంతులు, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి వేపాడ చిరంజీవిరావు అని అన్నారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన వేపాడను చట్టసభల్లోకి ప్రవేశించేలా తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించిందన్నారు. వేపాడను అభ్యర్ధిగా ఎంపిక చేయడం చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. రాష్ట్రంలో డీఎస్సీ, ఏపీపీఎస్సీ వంటి పెద్ద నోటిఫికేషన్లను విడుదల చేయడం లేదన్నారు. విద్యార్థి లోకమంతా ఎంతో అసంతృప్తిగా ఉందన్నారు. ఉపాధ్యాయులైతే ప్రతి నెలా 1వ తేదీన కనీసం జీతాలివ్వాలని అడిగే పరిస్థితికి వచ్చేశారన్నారు. ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చిన వేపాడకు ఉపాధ్యాయుల సమస్యలన్నీ తెలుసని అన్నారు. వేపాడ వంటి వ్యక్తులు ఎగువ సభకు వెళ్తేనే నిరుద్యోగ గ్రాడ్యుయేట్ లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయన్నారు. ఉద్యోగం చేస్తున్నపుడు కొంత డబ్బును పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంటారని, రిటైర్డ్ అయిన తర్వాత ఆ మొత్తాలను సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రతినెలా సకాలంలో జీతాలు అందక ఉద్యోగులు ఈఎంఐలను చెల్లించలేకపోతున్నారన్నారు. సీపీఎస్ ను రద్దు చేయకపోవడం వల్ల యువ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయన్నారు. రాష్ట్రానికి మంచి పరిశ్రమలు రావడం లేదన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటిపై అవగాహన కల్గివున్న వేపాడను ఎగువ సభకు పంపాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. నిరుద్యోగ గ్రాడ్యుయేట్ లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రైవేట్ రంగంలో ఉపాధి కోసం ఎదురుచూస్తున్న ఓటర్లందరూ తమ మొదటి ప్రాధాన్యతా ఓటును వేపాడకు వేసి అత్యధిక మెజార్టీతో గెల్పించాలని పిలుపునిచ్చారు. వేపాడను గెల్పిస్తే అందరి వాణిని శాసనమండలిలో వినిపించే అవకాశం ఉంటుందని చెప్పారు. క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదలయ్యేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడం జరుగుతుందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా వేపాడ కృషి చేస్తారని మాజీ ఎమ్మెల్యే రావి తెలిపారు.

Comments