అంతర్జాతీయ ప్రమాణాలతో బాపు మ్యూజియంను తీర్చిదిద్దాం.. -- కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి..


విజయవాడ (ప్రజా అమరావతి);

** అంతర్జాతీయ ప్రమాణాలతో బాపు మ్యూజియంను తీర్చిదిద్దాం.. 

-- కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి.. 


సాంస్కృతిక వారసత్వ సంపద మరియు తెలుగు వారియొక్క ఔన్నత్యమును ఇనుమడింపచేసే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో బాపు మ్యూజియంను తీర్చి దిద్దారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు నార్త్ ఈస్టరన్ రీజియన్ డెవలప్ మెంట్  శాఖా మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అన్నారు. 

విజయవాడ లోని బాపు మ్యూజియంను మంగళవారం మంత్రి సందర్శించి మ్యూజియంలో ఉన్న వారసత్వ సాంస్కృతిక సంపదను, పురాతన వస్తువులను మంత్రి పరిశీలించారు.  ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బాపు మ్యూజియంలో సాంకేతికత జోడించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుచేసిన డిజిటల్ ఇంటరాక్టివ్ డిస్ ప్లే టెక్నాలజీస్ ద్వారా మన చరిత్రను మనం తెలుసుకోవచ్చునని అన్నారు.  మన మూలాలు, చరిత్ర, సంస్కృతీ, వారసత్వం తెలియని ప్రజలు పేర్లు లేని చెట్టుతో సమానమని ప్రతీ ఒక్కరూ చరిత్ర సంస్కృతిని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకంటూ ప్రత్యేకమైన ఘనచరిత్ర సంస్కృతులు  ఉన్నాయని అటువంటి చరిత్ర సంస్కృతి, విజ్ఞానమునకు మూలమైన పురాతన వస్తువులు ఈ బాపు మ్యూజియం గ్యాలరీలో ప్రదర్శించడం ఎంతో అభినందనీయమన్నారు.  మన గత చరిత్రను గుర్తు చేసుకోవడానికి బాపు మ్యూజియం వేదికగా  ఉంటుందన్నారు.  బాపు మ్యూజియం సాంస్కృతిక వారసత్వ విద్యకు కేంద్ర బిందువని ఇక్కడ 7 గ్యాలరీలలో ప్రదర్శితమైన 1500 పురాతన వస్తువులను వాటి చరిత్రను  డిజిటల్ ఇంటరాక్టివ్ డిస్ ప్లే టెక్నాలజీస్ ద్వారా మనం తెలుసుకోవచ్చునన్నారు.  బాపు మ్యూజియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ డ్ డిజిటల్ ఇంటరాక్టివ్ డిస్ ప్లే టెక్నాలజీ, ఇంప్రెసివ్ ప్రొజెక్షన్ థియేటర్, ప్రొజెక్షన్ మాపింగ్, ఆగ్ మోటెడ్ రియాలిటీ, ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్ ప్లే ప్యానెల్, ఇంటరాక్టివ్ డిస్ ప్లే కాబినెట్స్, ఇంటరాక్టివ్ కియోస్కోస్ మొదలైనవి ఈ మ్యూజియం లో ప్రవేశ పెట్టడం ఆధునిక  సాంకేతిక పరిజ్ఞానమునకు తార్కాణంగా చెప్పవచ్చునన్నారు.  భిన్నత్వంలో ఏకవత్వంతో కూడిన మన ఘనమైన సంస్కృతీ, వారసత్వ సంపద తెలుగువారి యొక్క ఔన్నత్యమును ఇనుమడింపచేసే విధంగా బాపు మ్యూజియంను తీర్చిదిద్దిన రాష్ట్ర పురావస్తు ప్రదర్శన శాలల శాఖను కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈసందర్భంగా అభినందించారు.  

ముందుగా బాపు మ్యూజియం ప్రాంగణంలో ఉన్న జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య జాతిపిత మహాత్మా గాంధీజీకి జాతీయ పతాకాన్ని అందిస్తున్న శిల్పానికి జి. కిషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.    

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శన శాలల కమిషనర్ శ్రీమతి జి. వాణీ మోహన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  


Comments