అమ్మవారికి, స్వామివార్లకు మంగళగిరి చేనేత పట్టు వస్త్రాలు బహుకరించిన మార్కండేయ వంశీకులు....

 అమ్మవారికి, స్వామివార్లకు మంగళగిరి చేనేత పట్టు వస్త్రాలు బహుకరించిన మార్కండేయ వంశీకులు....


శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి): 

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు శ్రీ శివభక్త మార్కండేయ వంశీకులు ఈరోజు అనగా ది.17-02-2023, శుక్రవారం చేనేత పట్టు వస్త్రాలను బహూకరించారు. మంగళగిరిలో భక్త మార్కండేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేనేత మగ్గాలపై వారం రోజుల పాటు భక్తిశ్రద్ధలతో  ఈ వస్త్రాలను ప్రత్యేకంగా తయారు చేశారు. ది.18-02-2023 మహాశివరాత్రి సందర్భంగా జరిగే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి  శివభక్త మార్కండేయ  వంశీకులు చేనేత పట్టు వస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం ప్రధాన కైంకర్య పరులుగా మార్కండేయ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, రాధా దంపతులు, మార్కండేయ ట్రస్ట్ చైర్మన్ హైకోర్టు ఆర్బిటరేటర్ దామర్ల వెంకట నరసింహం లు చేనేత వస్త్ర నివేదన చేశారు. మార్కండేయ ట్రస్ట్ సభ్యులు  పవిత్ర నేత పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ, గాజులు, విభూది, ఫల పుష్పాలు తదితరాలను 14 సాంప్రదాయ  వెదురు పల్లెములలో తలపై పెట్టుకుని ఆలయానికి విచ్చేశారు.  వీరికి దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు గారు, కార్యనిర్వహణాధికారి దర్భాముళ్ళ భ్రమరాంబ గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పూజలు జరిపి చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. తదుపరి  బాలాలయం నందు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి స్వామివారికి చేనేత శ్వేత పట్టు వస్త్రాలు సమర్పించారు. వేదపండితుల ఆశీర్వచనం అనంతరం ట్రస్టు బోర్డు చైర్మన్, కార్యనిర్వహణాధికారి వార్లు శివ భక్త మార్కండేయ వంశీకులకు ప్రసాదాలు అందజేశారు. సదరు పవిత్ర చేనేత పట్టు వస్త్రాలను స్వామివారికి కల్యాణానికి ఉపయోగిస్తామని కార్యనిర్వహణాధికారి గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ వైదిక కమిటీ సభ్యులు శ్రీ ఆర్.శ్రీనివాస శాస్త్రి గారు, మంగళగిరి చేనేత ప్రముఖులు అందే నాగ ప్రసాద్, దామర్ల కుబేరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Comments