*- నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన "రావి అరెస్ట్"*
*- రాత్రంతా స్టేషన్లన్నీ తిప్పిన పోలీసులు*
*- కటిక నేల పైనే విశ్రమించిన రావి*
*- వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలింపు*
*- గుడివాడ కోర్టులో హాజరుపర్చిన పోలీసులు*
*- రూ.20వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు*
గుడివాడ, ఫిబ్రవరి 7 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం నాగవరప్పాడులోని కాల్వగట్టుపై ఇళ్ళ కూల్చివేత ఘటనలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రావిపై ఐపీసి 341, 353, 141 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే అరెస్ట్ చేసిన రావిని రాత్రంతా పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. మొదట పామర్రు పోలీస్ స్టేషన్ కు, ఆ తర్వాత తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అక్కడి నుండి కరకట్టు మీదుగా అవనిగడ్డ పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. ఈలోగా టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నాయి. రావిని విడుదల చేయాలంటూ కరకట్టపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. గుడివాడ గడ్డ- రావి అడ్డా అంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపటికి | రావిని పమిడిముక్కల పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళారు. ఈ సందర్భంగా రావి మాట్లాడుతూ పోలీసులు తనను పలు స్టేషన్ల చుట్టూ తిప్పడం జరిగిందన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉందన్నారు. కొల్లు రవీంద్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్ళిన తనను అదుపులోకి తీసుకున్నారన్నారు. ఇది చేతకాని ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను కూడా ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా, తెల్లవారుజామున కొద్దిసేపు కటిక నేలపైనే రావి విశ్రమించడం కన్పించింది. అనంతరం వైద్యపరీక్షల నిమిత్తం గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో అక్కడకు పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వాసుపత్రి నుండి నడుచుకుంటూనే కోర్టుకు వెళ్తానని రావి స్పష్టం చేశారు. అయితే పోలీసులు మాత్రం అందుకు అనుమతించలేదు. పోలీసు వాహనంలోనే రావిని గుడివాడ కోర్టులో హాజరుపర్చడం జరిగింది. కోర్టు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా టీడీపీ శ్రేణులే కన్పించాయి. రూ.20వేల పూచీకత్తుతో రావికి బెయిల్ మంజూరైంది. బెయిల్ పై విడుదలై కోర్టు నుండి బయటకు వచ్చిన రావిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, పామర్రు టీడీపీ ఇన్ఛార్జి వర్ల కుమార్ రాజా తదితరులు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మాజీ కౌన్సిలర్ వసంతవాడ దుర్గారావు, టీడీపీ మహిళాధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి, రూరల్ మండల అధ్యక్షుడు వాసే మురళి, నాయకులు ముళ్ళపూడి రమేష్ చౌదరి, పండ్రాజు సాంబశివరావు, పోలాసి ఉమామహేశ్వరరావు, కొడాలి రామరాజు, దాసు శ్యామ్, షేక్ సర్కార్, షేక్ ఇబీన్, షేక్ జానీ షరీఫ్, షణ్ముఖ రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment