నెల్లూరు, మార్చి 11 (ప్రజా అమరావతి):
జిల్లాలో ఈనెల 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో రానున్న 48 గంటలు చాలా కీలకమని ఆ సమయంలో ఎలాంటి రాజకీయ ప్రచారాలు జరగకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా అమలు చేయాల
ని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్ చక్రధర్ బాబు ఎన్నికల అధికారులను ఆదేశించారు.
శనివారం మధ్యాహ్నం జిల్లా ఎన్నికల అధికారి వారి క్యాంపు కార్యాలయం నుండి చిత్తూరు- నెల్లూరు-ప్రకాశం పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఈ రోజు శనివారం సాయంత్రం 4 గంటల నుండి పోలింగ్ రోజు 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు నిశ్శబ్ద కాలం పాటింపుపై దృష్టి సారించాలని, ఆ సమయంలో ఎలాంటి రాజకీయ ప్రచారాలుగానీ, ప్రచార సామాగ్రి పంపిణీ గానీ జరగకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా అమలు చేయాలన్నారు.
ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించని ప్రజా ప్రతినిధులు గాని, రాజకీయ నాయకులు గాని, ఇతర వ్యక్తులు కాని జిల్లాలో ఉండరాదని, జిల్లాలోని అన్ని లాడ్జీలు, హోటల్లు, ఫంక్షన్ హాల్లు, రిసార్టులను డివిజనల్ అధికారులు, పోలీసులు, ఎం.సి.సి. బృందాలు ముమ్మరంగా క్షుణ్ణంగా తనిఖీ చేసి జిల్లాకు చెందని వారిని జిల్లా బయటకు పంపించాలని అలాంటివారు జిల్లాలో ఎవరు కనపడరాదని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎక్కడ కూడా ఉల్లంఘించకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు.
ఎం.సి.సి ఉల్లంఘనలు జరిగినట్లు ఎక్కడ ఫిర్యాదులు అందరాదని సూచించారు.
పోస్టల్ బ్యాలెట్ ల సేకరణ కార్యక్రమం ఈ శనివారం సాయంత్రం 5 గంటలకు ముగించాలని తదుపరి ఓటరు జాబితా మార్కుడు ప్రతులను పోలింగ్ కేంద్రాల వారిగా వేరు పరచాలన్నారు.
ఈనెల 12వ తేదీ ఆదివారం నుండి పోస్టల్ బ్యాలెట్ లను సంబంధిత ఓటర్లు నేరుగా పోస్టులో చిత్తూరులోని రిటర్నింగ్ అధికారికి పంపాల్సి ఉంటుందన్నారు.
పోలింగ్ సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాల వద్ద ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు, పోలీసులు, వెబ్ కాస్టింగ్ విద్యార్థులు తదితర సిబ్బందికి సకాలంలో మంచి ఆహారము మంచినీటి సౌకర్యము కల్పించాలన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వైద్య బృందాలతో పాటు ప్రధమ చికిత్స పరికరాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు.
పోలింగ్ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి తప్పనిసరిగా మాస్కులు వేసుకునేలా సూచించాలన్నారు.
ఈనెల 12 13 తేదీల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉప కేంద్రాలు 24 గంటలు పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని, అంబులెన్సులు సిద్ధంగా ఉండాలని, ఆరోగ్యశ్రీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు
బ్యాలెట్ పెట్టెలు, బ్యాలెట్ పత్రాలు, ఓటర్ల జాబితా మార్కుడు ప్రతులు, ఇండెలిబుల్ ఇంకు, పేపర్ సీల్లు, పెన్నులు తదితర పోలింగ్ సామాగ్రిని అధికారులకు జాగ్రత్తగా అప్పగించాలని, పోలింగ్ సిబ్బందిని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సజావుగా తరలించాలని, అక్కడ వారికి కావలసిన ఏర్పాట్లు సెక్టార్ల అధికారులు, బి ఎల్ వో లు వీఆర్వోలు, వీఆర్ఏ బృందాలు చేయాలన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం సాయంత్రానికల్లా వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేసి జిల్లాలోని కంట్రోల్ విభాగానికి అనుసంధానం చేయాలన్నారు.
ఈనెల 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరిగే పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా గమనించడం జరుగుతుందన్నారు.
ప్రతి ప్రిసైడింగ్ అధికారికి రెండు బ్యాలెట్ పెట్టెలు రెండు ఓటింగ్ కంపార్ట్మెంట్లు అందజేయాలని ఒక బ్యాలెట్ పెట్టె వినియోగం పూర్తయిన తర్వాతనే రెండో పెట్టెను వాడాలని, బ్యాలెట్ పెట్టెలు గానీ,బ్యాలెట్ పత్రాలు గాని ఎటువంటి పరిస్థితుల్లో అనధికార వ్యక్తి వద్ద ఉండకూడదని స్పష్టం చేశారు.
పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రం దురాక్రమణకు గురికాకుండా చూడాలని, ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని విధాలా పర్యవేక్షించాలన్నారు.
పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించే సమయంలో ఓటరు వద్ద ఎట్టి పరిస్థితులను పెన్నులు కానీ, సెల్ ఫోన్లు గాని ఎలాంటి ద్రవపదార్థాలు గానీ, అగ్గిపెట్టెలు కానీ, భోజన పదార్థాలు గాని ఉండరాదని స్పష్టం చేశారు.
ఎవరైనా పోలింగ్ సిబ్బంది భోజనం చేయవలసి వస్తే పోలింగ్ కేంద్రం బయటకు వెళ్లి భోం చేసి రావాలని సూచించారు.
ఎట్టి పరిస్థితిలోనూ బ్యాలెట్ పత్రాలు గాని, బ్యాలెట్ పెట్టెలు గానీ పాడైపోకుండా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలన్నారు.
పోలింగ్ ముగిశాక అన్ని రకాల పత్రాలతో సహా బ్యాలెట్ పెట్టేలను సురక్షితంగా నిర్ణయించిన ప్రభుత్వ వాహనాల్లో తరలించి చిత్తూరులో రిటర్నింగ్ అధికారికి అప్పగించాలన్నారు.
ఎన్నికల నిర్వహణలో ప్రతి ప్రక్రియను డివిజన్ అధికారులు పక్కాగా గమనించి అన్ని పోలింగ్ కేంద్రాలను పోలింగ్కు సిద్ధం చేయాలన్నారు.
జిల్లా కేంద్రంలో 1950 నంబరు తో ఏర్పాటుచేసిన కంట్రోల్ విభాగం చురుగ్గా పనిచేయాలని, వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు
అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డేస్కులు ఏర్పాటు చేయాలని ఓటు వేయడానికి వచ్చే ఓటర్ల నుండి సెల్ ఫోన్లు గాని, పెన్నులు గాని తీసుకునే సౌకర్యం కల్పించాలన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో కావలసినంత పోలింగ్ సామాగ్రి ఉండాలని ఎక్కడ కొరత రాకుండా పర్యవేక్షించాలన్నారు.
సెక్టోరల్ అధికారులు వారి వద్ద అదనంగా కొంత పోలింగ్ సామాగ్రిని రిజర్వులో ఉంచుకోవాలన్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్లో సంయుక్త కలెక్టర్ శ్రీ రోణంకి కూర్మనాద్, డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మ కందుకూరు సబ్ కలెక్టర్ ఎస్ ఎస్ శోభిక, నెల్లూరు, కావలి ఆత్మకూరు ఆర్డీవోలు ఎన్నికల నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసిల్దారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment