*- గుడివాడలో రెచ్చిపోతున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాలు*
*- ఆన్ లైన్ యాప్ లతో బుకీల అప్ డేట్*
*- మెయిన్ బుకీలతోనే నేరుగా సంబంధాలు*
*- కొద్దిపాటి మార్జిన్ లతో కోట్లు కొల్లగొడుతున్నారు*
*- గ్రామాలకు విస్తరించిన క్రికెట్ బెట్టింగ్ జాడ్యం*
*- ప్రతి బాల్, రన్ కు యాప్ లోనే బెట్టింగ్ లు*
గుడివాడ, మార్చి 3 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. గతంలో డమ్మీ మొబైల్ సిమ్ లను కొనుగోలు చేసి ల్యాప్ టాప్, సెల్ ఫోన్ల సహాయంతో ఒక గదిలో కూర్చొని బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహించేవారు. క్రికెట్ సిరీస్ ముగియగానే వాడిన డమ్మీ సిమ్ లను పారేసి వాటి స్థానంలో కొత్త డమ్మీ సిమ్ లను వినియోగించడం జరిగేది. ఒక్కోసారి బెట్టింగ్ లావాదేవీల్లో వివాదాలు జరిగి అవి కాస్తా పోలీసులు దగ్గరకు చేరుతుండేవి. దీని నుండి తప్పించుకునేందుకు ఇప్పుడు గుడివాడ పట్టణంలోని క్రికెట్ బుకీలంతా అప్ డేట్ అయిపోయారు. క్రికెట్ బెట్టింగ్ లకు సంబంధించి ప్రస్తుతం బెట్ వే, ఫన్ 88, విన్ డాడీ, ఫెయిర్ ప్లే, బ్యాట్ షా, 10 క్రిక్ వంటి వందల ఆన్ లైన్ యాప్ లు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. గుడివాడలో అప్ డేట్ అయిన బుకీలంతా మెయిన్ బుకీలతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. రూ. లక్షల్లో డబ్బును మెయిన్ బుకీల దగ్గర డిపాజిట్లు చేసి అంతే విలువైన పాయింట్ లను ఆయా బెట్టింగ్ యాప్ లలో లోడ్ చేయించుకుంటున్నారు. ఈ పాయింట్ లను గుడివాడ బుకీలు తమ పరిధిలో బెట్టింగ్ ఆడే వారు చేసే డిపాజిట్లను బట్టి ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకున్న యాప్ లలోకి పాయింట్ లను పంపుతున్నారు. ఈ పాయింట్ల ఆధారంగా బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహించుకునే వీలుంటుంది. బెట్టింగ్ కట్టిన మొత్తాలకు సంబంధించి ఓడితే అందుకు సమానమైన పాయింట్లను కోల్పోవాల్సి ఉంటుంది. గెలిస్తే ఆయా మొత్తాలకు సంబంధించిన పాయింట్లు యాప్ లలోకి వచ్చి చేరుతుంటాయి. అవసరమైనపుడు ఈ పాయింట్లను గుడివాడ బుకీలకు పంపితే వారే నేరుగా పాయింట్లు పంపిన వారికి డబ్బులు చెల్లిస్తుంటారు. గుడివాడ బుకీల పరిధిలో బెట్టింగ్ ఆడుతున్న వారి లావాదేవీలకు సంబంధించి ఎవరికి వారు నిర్ణీత మార్జిన్లను మెయిన్ బుకీల దగ్గర పెట్టుకుంటుంటారు. బెట్టింగ్ ఆడేవారు ఎంత నష్టపోయినా గుడివాడ బుకీలకు మాత్రం మెయిన్ బుకీల దగ్గర నుండి మార్జిన్ మొత్తాలు వస్తుంటాయి. అలా ఒక్కో గుడివాడ బుకీకి ప్రతి క్రికెట్ సిరీస్ కు దాదాపు రూ. కోట్లలో మెయిన్ బుకీల దగ్గర నుండి డబ్బు వచ్చి చేరుతుంటుంది. పోలీసులకు దొరకకుండా, గుట్టు చప్పుడు కాకుండా సెల్ ఫోన్లో ఇన్ స్టాల్ చేసిన యాప్ ల ద్వారానే క్రికెట్ బెట్టింగ్ లావాదేవీలన్నీ జరుగుతుండడంతో పాటు కొద్దిపాటి మార్జిన్ల ద్వారా గుడివాడలో దాదాపు 10మంది వరకు ఉన్న బుకీలు రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. మ్యాచ్ అంచనాలు, బోనస్ బెట్టింగ్ టిప్స్, విన్నింగ్ ఛాన్సెస్ వంటి సమాచారం కూడా యాప్ లలో దొరుకుతోంది. 50 శాతం నుండి 450 శాతం వరకు అంటే రూ.2500ల నుండి రూ. లక్ష వరకు ఒక్కో యాప్ ఒక్కో విధంగా వెల్ కమ్ బోనస్ లను అందిస్తోంది. కాగా గుడివాడ బుకీలు కళాశాలల్లో చదివే విద్యార్థులు, చాలా కాలంగా బెట్టింగ్ లు కడుతున్న వారు, వీఐపీలను లక్ష్యంగా చేసుకుని ఆన్ లైన్ యాప్ ల ద్వారా బెట్టింగ్ లు ఆడుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు. ఆన్ లైన్ యాప్ లు అంతగా వినియోగంలోకి రాని రోజుల్లో గుడివాడ పట్టణంలో దాదాపు 3వేల మంది క్రికెట్ బెట్టింగ్ లు కడుతున్నట్టుగా చెప్పేవారు. ఇప్పుడు ఫోన్లోనే ఎవరికి వారు ప్రతి బాల్, రస్ ను వదలకుండా బెట్టింగ్ లు కట్టే అవకాశం దొరకడంతో ఆడేవారి సంఖ్య 5వేల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వీరంతా ప్రతి మ్యాచ్ కు రూ.కోట్లలో డబ్బు పోగొట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కొంత మంది ఆస్థులను అమ్మి, మరికొంత మంది అప్పులు చేసి, ఇంకొంత మంది బంగారాన్ని, స్థలాలను తాకట్టు పెట్టి ఆన్ లైన్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. ఇంత పెద్దఎత్తున బెట్టింగ్ లు జరుగుతున్నప్పటికీ పోలీసులు ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు కూడా లేకపోలేదు. భారతదేశంలో క్రికెట్ బెట్టింగ్లకు చట్టబద్దత లేదు. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో క్రికెట్ బెట్టింగ్లను నిర్వహించుకోవచ్చు. కొన్ని దేశాల్లో బెట్టింగ్ కార్యకలాపాలు ప్రభుత్వ పరిధిలోనే జరుగుతుంటాయి. కాగా, ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి నిత్యం బెట్టింగ్ ఉచ్చులోకి లాగుతూ, ఆన్ లైన్ యాప్ లను ఇన్ స్టాల్ చేసి బెట్టింగ్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ కోట్లు కొల్లగొడుతున్న గుడివాడ బుకీలపై దృష్టిసారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
addComments
Post a Comment