*జిల్లాలో ఐదు ఇసుక రీచ్ లకు అనుమతి
*
పార్వతీపురం, మార్చి 25 (ప్రజా అమరావతి): జిల్లాలో ఐదు ఇసుక రీచ్ లను ప్రారంభించుట జిల్లా స్థాయి ఇసుక కమిటీ అనుమతించింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శని వారం జరిగింది. సంబంధిత శాఖలు తనిఖీలు నిర్వహించి, ఇసుక రీచ్ ల నుండి ఇసుక తవ్వకాలు చేపట్టవచ్చని సమర్పించిన నివేదిక మేరకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తెలిపింది. భామిని మండలం నులకజోడు ఇసుక రీచ్ 61,098 మెట్రిక్ టన్నులు, నేరెడి 66,912 మెట్రిక్ టన్నులు, లివిరి 61,860 మెట్రిక్ టన్నులు, తాలాడ 40,559 మెట్రిక్ టన్నులు, కొమరాడ మండలం కె.ఆర్.బి.పురం 15,561 మెట్రిక్ టన్నుల ఇసుక రీచ్ లను కమిటి ఆమోదించింది. దీనితో జిల్లాలో మొత్తం 2,45,990 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి రానుంది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక కొరత అనే మాట తలెత్తరాదన్నారు. ఇసుక నిలువ కేంద్రాలు అవసరమగు ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా నుండి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుక రవాణా కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని పోలిసు శాఖను ఆదేశించారు. చెక్ పోస్టులు వద్ద, అక్రమ రవాణాకు అవకాశం ఉన్న వివిధ మార్గాలలో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పనులకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. వర్షాకాలంలో కూడా పనులు చేయుటకు ముఖ్యంగా ఆగస్టు నుంచి నవంబరు వరకు అవసరమగు ఇసుకను అంచనా వేసి నిల్వలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా కమిటీ ఆమోదించిన ఐదు ఇసుక రీచ్ లు వెంటనే ప్రారంభించి నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు పోలీసు సూపరింటెండెంట్ డా. ఓ.దిలీప్ కిరణ్, గనుక శాఖ ఉప సంచాలకులు ఎం.బాలాజీ నాయక్, సహాయ సంచాలకులు ఎస్.పి.కే. మల్లేశ్వర రావు, జిల్లా గ్రామ పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, ఎం.వి.ఐ రామ్ నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment