*- వెనిగండ్ల ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు*
*- మోటూరులో భగీరథుని విగ్రహానికి పూజలు*
*- గుడివాడ పట్టణంలోనూ ఘనంగా జయంతి*
*- గంగను భువికి తీసుకొచ్చిన మహాముని భగీరథుడు*
*- సగర భగీరథ సంఘం అభ్యున్నతికి కృషి చేస్తా*
*- సభలో తెలుగుదేశం పార్టీ నేత వెనిగండ్ల రాము*
గుడివాడ, ఏప్రిల్ 27 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ నేత వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన పురాణ రాజు శ్రీశ్రీశ్రీభగీరథ మహర్షి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం మోటూరు గ్రామంలోని భగీరథుని విగ్రహానికి వెనిగండ్ల పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే గుడివాడ పట్టణం బైపాస్ రోడ్డులోని కార్యాలయంలో భగీరథుని జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వెనిగండ్ల పూజలు చేశారు. ఈ సందర్భంగా సగర భగీరథ సంఘం నాయకులు వెనిగండ్లను శాలువాతో సత్కరించారు. వేద పండితులు వెనిగండ్లకు ఆశీర్వచనాన్ని అందజేశారు. ముందుగా వందలాది మంది సగర భగీరథ సంఘం నేతలు గుడివాడ బైపాస్ రోడ్డు నుండి వెనిగండ్లను భారీ ర్యాలీగా మోటూరు గ్రామానికి తీసుకువెళ్ళారు. అనంతరం జరిగిన సభల్లో వెనిగండ్ల రాము మాట్లాడారు. గంగను భువికి తీసుకువచ్చిన మహాముని భగీరథుడు అని చెప్పారు. సూర్యవంశపు రాజు సగరునకు కేశిని, సుమతి అను ఇద్దరు భార్యలు ఉన్నారని, కేశినికి అసమంజసుడను ఒక కుమారుడు, సుమతికి 60వేల మంది కుమారులు కలిగారన్నారు. భగీరథుని ముత్తాత అయిన సగర రాజు అశ్వమేథ యాగం చేస్తాడని, ఈ యాగ అశ్వాన్ని ఇంద్రుడు దొంగిలించి పాతాళంలో కపిల మహర్షి తపస్సు చేస్తున్న ప్రాంతంలో నిర్బంధిస్తాడన్నారు. సగరుని 60వేల మంది కుమారులు పాతాళంలో నిర్బంధించి ఉన్న గుర్రాన్ని కనుగొంటారని, వారు శబ్దాలతో కపిల మహర్షిని కలవరపరుస్తారన్నారు. కోపోద్రికుడైన కపిల మహర్షి అగ్ని నేత్రాలచే సగరుని 60వేల మంది కుమారులు బూడిదగా మారతారన్నారు. వారికి ఉత్తమ గతులు లభించాలంటే దివి నుండి గంగను పాతాళానికి తేవాల్సి ఉందన్నారు. భగీరథుడు అయోధ్య సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగాదేవిని ప్రార్థించడానికి హిమాలయాల్లో తపస్సు చేస్తాడన్నారు. భగీరథుని దీక్షకు గంగాదేవి ప్రత్యక్షమై తాను స్వర్గం నుండి భూమికి దిగితే దాని దూకుడును తట్టుకుని నిలబడగలిగే శక్తి శివునికి మాత్రమే ఉందని, శివుని అనుగ్రహం పొందాలని భగీరథునితో గంగ చెప్పిందన్నారు. భగీరథుని తపస్సుకు శివుడు అనుగ్రహించి గంగ భువికి రాగానే తన జటాజూటంలో బంధిస్తాడన్నారు. భగీరథుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదులుతాడని, భగీరథుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగిందన్నారు. దారిలో జాహ్నముని ఆశ్రమాన్ని ముంచెత్తి జాహ్నవి అయిందని, ఆ తర్వాత సాగరంలోకి ప్రవేశించి, పాతాళానికి చేరి సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసిందన్నారు. సగర భగీరథ సంఘం ఆధ్వర్యంలో స్వర్గం నుండి గంగను భువికి తీసుకువచ్చిన భగీరథ మహర్షి జయంతి వేడుకలను తన చేతులమీదుగా జరపడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సగర భగీరథ సంఘం అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని వెనిగండ్ల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సగర భగీరథ సంఘం రాష్ట్ర నాయకులు నక్కా వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నేతలు తులసి, గుత్తా చంటి, అరికేపూడి రామశాస్త్రులు, ప్రభాకరరెడ్డి, బొంబాయి శ్రీను, చల్లగుళ్ళ సుబ్రహ్మణ్యం, తులసీరాణి, మోజెస్, ఏసుపాదం, జోన్స్, రాజశేఖర్, రాధాకృష్ణ, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment