మా గ్రామాలకు డిజిటల్ విప్లవం వచ్చింది

 



*మా గ్రామాలకు డిజిటల్ విప్లవం వచ్చింది


*



*మొబైల్ టవర్లు వస్తాయని ఎన్నడూ ఊహించ లేదు

*సిగ్నల్స్ కోసం కొండలు ఎక్కే బాధ తప్పింది

*వీడియో కాల్ లో మాట్లాడుతున్నాం

*అత్యవసర పరిస్థితుల్లో అవస్థలు తప్పాయి


పార్వతీపురం/గుమ్మలక్ష్మీపురం/జియ్యమ్మవలస, ఏప్రిల్ 7 : (ప్రజా అమరావతి) "మా గ్రామాలకు డిజిటల్ విప్లవం వచ్చింది" అని ఆనందం వ్యక్తం చేశారు జియ్యమ్మవలస మండలం గోర్లి, గుమ్మలక్ష్మీపురం మండలం బీరుపాడు గ్రామస్తులు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వి.విద్యాసాగర్ నాయుడు సంయుక్తంగా ఆయా గ్రామాలను శుక్ర వారం పర్యటించి "డిజిటల్ విప్లవం" ప్రభావాన్ని స్వయంగా అనుభూతి పొందారు. జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం మారుమూల మండలాల్లో మారుమూల గ్రామాల్లో నిర్మితం అవుతున్న మొబైల్ టవర్లు, అందుబాటులోకి వచ్చిన టవర్లతో గ్రామస్తుల స్పందన చూడాలని, వారితో పంచుకోవాలని సంకల్పించారు. గోర్లి, బీరుపాడు గ్రామస్తులు తమకు వచ్చిన మొబైల్ సిగ్నల్స్ తో ఆనందానుభూతిని పొందారు. గ్రాస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో నేలపైనే ఇద్దరు అధికారులు కూర్చుని మమేకమయ్యారు. అచ్చటనే గ్రామస్తులతో ఫోన్ లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. సెల్ సిగ్నల్ వస్తుందని, సెల్ ఫోన్ లో బంధు మిత్రులతో మాట్లాడతామని ఎన్నడూ ఊహించ లేదని వివరించారు. మా బ్రతుకులు మారనున్నాయని, ఇంతటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. 


జియ్యమ్మవలస మండలం నుంచి గుమ్మలక్ష్మీపురం మండలం బీరుపాడు గ్రామం వరకు పర్యటించారు. మార్గమధ్యంలో రంగుపురం ఇతర గ్రామాల్లో నిర్మించిన టవర్లు పరిశీలించారు. ఇద్దరు అధికారులు ఒకే బైక్ పై  బీరుపాడు వరకూ ప్రయాణించి రహదారి పనులు, ఇతర పనులను సైతం పరిశీలించారు. బైక్ పై బీరుపాడు చేరుకున్న జిల్లా కలెక్టర్, ఎస్.పి లను ప్రజలు గుర్తించ లేకపోయారు. కొత్త వ్యక్తులు టవర్లు పరిశీలించుటకు వచ్చారని అనుకుని టవరు వద్దకు వెళ్లే మార్గాన్ని సూచించారు. టవరు వద్దకు వచ్చి జిల్లా కలెక్టర్, ఎస్.పి అని పరిచయం చేసుకోగా  ఆశ్చర్యపోవడం గ్రామస్తుల వంతు అయింది. 


గ్రామస్తుల యోగ క్షేమాలు ఇద్దరు అధికారులు తెలుసుకున్నారు. గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించారని, బస్సు వస్తుందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు మొబైల్ సిగ్నల్స్ వస్తున్నాయని మా జీవితాలు మార్పుకు నాంది పడిందని పేర్కొన్నారు. 


బీరుపాడు వెలుగు సిసి శ్రీరాములు మాట్లాడుతూ గ్రామానికి రహదారి, బస్సు వచ్చింది. సెల్ ఫోన్ రావడం గొప్ప ఆనందంగా ఉందన్నారు. 


బీరుపాడు పంచాయతీకి చెందిన టి. ఠాగూర్ మాట్లాడుతూ సిగ్నల్స్ కోసం కొండలు, గుట్టలు ఎక్కే వాళ్ళమని ఆ సమస్యకు పరిష్కారం లభించిందని అన్నారు. 


బీరుపాడు గ్రామస్తులు పి. సునీల్ కుమార్ మాట్లాడుతూ మొబైల్ సిగ్నల్స్ వస్తుందని జీవితంలో ఊహించ లేదని అన్నారు. ఇది ప్రజలకు గొప్ప అవకాశం, అనుభూతి అన్నారు. 


పువ్వుల లక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ బీరుపాడు మారుమూల గ్రామం అని, సౌకర్యాలు వస్తాయని ఊహించలేదని అన్నారు. "నేను నాగావళిలో కొట్టుకు పోవలసిందని, మా చెల్లిని డోలీలో ఆసుపత్రికి చేర్చిన గుర్తులు" ఇంకా ఉన్నాయని అన్నారు. ఇటీవల కాలంలో ఫోన్ చేయాలంటే కొండలు ఎక్కాల్సి వచ్చేదని, పింఛను, రేషను కోసం బయో మెట్రిక్ వేయాలంటే చెట్టు పుట్ట చూడాల్సి వచ్చేదని, సిగ్నల్స్ కోసం గంటల తరబడి నిరీక్షణ చేసేవారమని అన్నారు. ఇప్పుడు కూర్చున్న చోటే సిగ్నల్ వస్తుందని, అచ్చటనే థంబ్ వేస్తున్నామని, ఎమర్జెన్సీ అయితే 108 కి కాల్ చేస్తున్నామని, బంధు మిత్రులతో వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నామని, మా గ్రామానికి పెద్ద సాంకేతిక విప్లవమని అన్నారు. 


జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో డిజిటల్ విప్లవం ప్రారంభం అయిందన్నారు. జిల్లాలో 170 మొబైల్ టవర్లు మంజూరు అయ్యాయని చెప్పారు. వీటిని జియో, బి.ఎస్.ఎన్.ఎల్, ఎయిర్ టెల్ సంస్థలు నిర్మిస్తున్నాయని చెప్పారు. జూన్ నాటికి 160 టవర్లు పూర్తి అవుతాయని తద్వారా జిల్లాలో ప్రతి మారుమూల గ్రామం లోనూ 4జి నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చి గొప్ప డిజిటల్ విప్లవం రానుందన్నారు. ప్రభుత్వ సేవలు మరింత చేరువ అవుతాయని, ఎమర్జెన్సీ సమయంలో 108, అంబులెన్సు సేవలు సులభంగా పొందవచ్చని చెప్పారు. టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల 52 ప్రదేశాల్లో అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసామని, రెవిన్యూ, పోలీస్, అటవీ, గిరిజన సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ త్వరగా టవర్లు అందుబాటులోకి తెచ్చుటకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 


పోలీస్ సూపరింటెండెంట్ వి.విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ టవర్లు రావడంతో ఎన్నో అవకాశాలు వస్తాయని వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 


ఈ కార్యక్రమంలో టి.పి.ఎం.యు ఏపిడి వై. సత్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Comments