గుడివాడలో గెలవాలంటే కుయుక్తులు అవసరం లేదు

 *- గుడివాడలో గెలవాలంటే కుయుక్తులు అవసరం లేదు* 


 *- అభివృద్ధికి దూరంగా గుడివాడ నియోజకవర్గం* 

 *- అంధకారంలో బతుకుతున్నామనే భావనలో ప్రజలు* 

 *- సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం* 

 *- గుడివాడను ప్రగతి పథంలోకి తీసుకొస్తాం* 

 *- మీడియాతో టీడీపీ సీనియర్ నేత వెనిగండ్ల* 



గుడివాడ, ఏప్రిల్ 13 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో గెలవాలంటే కుయుక్తులు అవసరం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వెనిగండ్ల రాము అన్నారు. గత 20 ఏళ్ళుగా గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో దూరంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా గుడివాడలో రెండు రోజుల పాటు జరిగే చంద్రబాబు పర్యటనకు సంబంధించి వెనిగండ్ల ఆధ్వర్యంలో టీడీపీ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా వెనిగండ్ల మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏళ్ళుగా గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. నేటికీ ప్రజలు అంధకారంలో బతుకుతున్నామన్న భావనలో ఉన్నారన్నారు. ఎక్కడ చూసినా రోడ్లు దారుణంగా తయారయ్యాయన్నారు. కనీసం ప్రయాణించడానికి వీల్లేకుండా ఉన్నాయన్నారు. వర్షం వస్తే నడవలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించే పరిస్థితులు కూడా లేవన్నారు. ఇంకా ఆటవిక రాజ్యంలోనే ఉన్నామంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కబ్జాలే కన్పిస్తున్నాయన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలకు అవసరమైన కనీస, మౌలిక వసతులను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో గుడివాడ నియోజకవర్గం ప్రగతి పథంలో పయనించేలా కృషి చేస్తామన్నారు. గుడివాడలో గెలవాలంటే కుయుక్తులు అవసరం లేదన్నారు. కుయుక్తులకు పెట్టింది పేరు ఎవరో గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని అన్నారు. గుడివాడలో గెలుస్తామన్న ఆలోచనను వైసీపీ నేతలు మర్చిపోవాలన్నారు. చంద్రబాబు గుడివాడ పర్యటనకు చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ప్రజలు తరలివచ్చారన్నారు. దీన్ని చూస్తే ఎన్టీఆర్ రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. గుడివాడ పట్టణం మొత్తం జనసంద్రంగా మారిపోయిందన్నారు. వై నాట్ 175 హాస్యాస్పదంగా ఉందన్నారు. కనీసం పులివెందుల నియోజకవర్గాన్ని గెల్చుకునేందుకు వైసీపీ ప్రయత్నించాలన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలంతా మద్దతుగా ఉన్నారని, రాష్ట్రవ్యాప్తంగా అనుకూల పరిస్థితులు కన్పిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను ఎలా గెలుస్తామని వైసీపీ నేతలు అనుకుంటున్నారో అర్ధం కావడం లేదన్నారు. గుడివాడను గెల్చుకుని చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని వెనిగండ్ల రాము స్పష్టం చేశారు.

Comments